వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సొంత పార్టీలో అసమ్మతి బెడద ఎక్కువైంది. నగరి వైసీపీలో అసమ్మతి …జగన్ పుట్టిన రోజు సందర్భంగా బయట పడింది. రోజాను వ్యతిరేకిస్తున్న వర్గం పుత్తూరులో రోడ్డెక్కి ఎమ్మెల్యేపై విరుచుకుపడడం గమనార్హం.
నగరి వైసీపీలో రచ్చ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటీవల నగరి పరిధిలోని ఓ ఎంపీపీ ఎన్నిక విషయం లోనూ రోజాను అసమ్మతి వర్గం అడ్డుకోవడం, చివరికి మంత్రి పెద్దిరెడ్డి జోక్యంతో సర్దుబాటు కావడం తెలిసిందే. తాజాగా మరోసారి వివాదం చెలరేగింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా నగరిలో కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే రోజా, ఆమెను వ్యతిరేకించే వర్గాలు ఎవరికి వారుగా ఏర్పాట్లు చేస్తుండడమే వివాదానికి కారణమైంది.
పుత్తూరులో జగన్‌ను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇదంతా రోజా తన అనుచరులతో చేయించిన పనే అంటూ అసమ్మతి వర్గ నాయకులు ఏలుమలై, కేజే కుమార్, లక్ష్మీపతిరాజు, భాస్కర్‌రెడ్డి, మురళీరెడ్డి, రవిశేఖరరాజు. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ చక్రవర్తిరెడ్డి ఆరోపిస్తున్నారు.
జగన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించిన వారిని అరెస్ట్ చేయాలంటూ రోజా అసమ్మతి వర్గీయులంతా పుత్తూరులో ధర్నాకు దిగారు. రోజా స్థానికేతురాలని అసమ్మతి వర్గీయులు విమర్శిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ పెద్ద నాయకుల అండతోనే తనపై అసమ్మతి వర్గీయులు కాలు దువ్వుతున్నారని రోజా ఆరోపిస్తున్నారు. వైసీపీలో అంతర్గత గొడవలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉన్నాయని నగరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.