పగ వున్న వాడిని కొడితే భక్తి వున్నవాడికి తగులు తుందని సామెత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినిమా రంగానికి తీసుకుంటున్న చర్యలు అచ్చం ఇలాగే తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు సినిమా రంగం నుంచి సరైన, సక్రమమైన వాటా రావడం లేదన్నది జగన్ నిశ్చితాభిప్రాయం. అది కొంత వరకు నిజం కూడా. దానికి సవాలక్ష కారణాలు వున్నాయి. టెక్నికల్ రీజన్స్ కూడా వున్నాయి. అలాంటి నేపథ్యంలో ఇక వాటికి ఎందుకు మేలు చేయాలి? అనే పాయింట్ ఒకటి, అసలు ఆ రంగానికి ముకుతాడు ఎలా వేయాలి అన్న పాయింట్ మరోటి. కనీసం జనాలకు అయినా తక్కువలో ఎంటర్ టైన్ ఇస్తే బెటర్ కదా అనే ఆలోచన కూడా తోడయింది.
అందుకే సినిమా టికెట్ రేట్లు తగ్గించడం. ప్రత్యేక షో లు ఇవ్వకపోవడం, ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తయారు చేయడం. ఇదంతా బాగానే వుంది అనుకుందాం. కానీ ఇక్కడ జనాల రెస్పాన్స్ ఎలా వుంది అన్నది కీలకం. రేట్లు తగ్గించినా జనం ఏమీ పెద్దగా పాజిటివ్ గా ఫీలయిపోలేదు. దొంగచాటుగా వంద అమ్మితే నిలదీయడం లేదు. హ్యాపీగా ఇచ్చేస్తున్నారు. మరి ఏం ప్రయోజనం.
ఆ సంగతి అలావుంచితే థియేటర్లలో చాలా మంది వైకాపా జనాలు వున్నారు. వారంతా కక్కలేక మింగలేక కిందా మీదా అవుతున్నారు. అలాగే పార్టీమీద సింపతీ వున్న నిర్మాతలు వున్నారు. వారు కూడా ఫుల్ అన్ హ్యాపీగా వున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు. ఫ్యాన్స్ తో వ్యవహారం మరోఎత్తు. సినిమా నిర్మాణంలో, సినిమా రంగంలో ఓ సామాజిక వర్గం ఎక్కువగా ఇన్ వాల్వ్ అయి వుండొచ్చు.కానీ సినిమా హీరోలు ఎక్కువగా కాపు సామాజిక వర్గం నుంచే వున్నారు. ఇప్పుడు హీరోల కన్నా వారి ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. తమ హీరోల సినిమాలను జగన్ దెబ్బతీస్తున్నాడు అని ఫీలవుతున్నారు.
మెగాస్టార్, పవన్ కళ్యాణ్, బన్నీ, చరణ్, లాంటి టాప్ హీరోల ఫ్యాన్స్ అంతా జగన్ కు వ్యతిరేకం అవుతున్నారు. తమ హీరోల సినిమాలు రికార్డులు సృష్టించకుండా జగన్ అడ్డం పడుతున్నాడని భావిస్తున్నారు. దాంతో మామూలుగానే కొంత మంది అటు కొంత మంది ఇటుగా వుండే వీరు పూర్తిగా జనసేన వైపు మొగ్గుతున్నారు.
ఈ ఫ్యాన్స్ ఎంత మంది ఓటింగ్ కు వస్తారు అన్నది పక్కన పెడితే, వీరంతా నూటికి నూరు శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు.దాంతో ఫుల్ గా అక్కడ తమ ప్రతాపం చూపిస్తున్నారు. అదంతా జగన్ కు పట్టడం లేదు. ఆయన దృష్టికి ఎవ్వరూ తీసుకెళ్లడంలేదు. దీనివల్ల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది.