రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోయే వారిని కుంభకర్ణుడితో పోలుస్తూ వెటకారం చేస్తుంటారు. యూకేలో కూడా ఒక మహిళ ఇలా రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోతుంది. రోజుకి ఏకంగా ఆమె 22 గంటలు నిద్రపోతుంది. ఒక్కోసారి 4 రోజుల పాటు అసలు మెలకువే రాకుండా పడుకుంటుంది. తనకు తాను స్లీపింగ్ బ్యూటీగా చెప్పుకునే ఆవిడ పేరు జోఅన్నా కాక్స్. వయసు 38 ఏళ్లు. రోజుకి 22 గంటలు నిద్రపోవడం, కేవలం 2 గంటలు మాత్రమే మెలకువతో ఉండటం ఆమెకు అలవాటు, కాదు కాదు గ్రహపాటు.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలంటుంటారు, కానీ జోఅన్నా ఏకంగా 22గంటలు నిద్రపోతుంది అంటే అది విచిత్రమే. 2017లో తనకు ఇలాంటి సమస్య ఉన్నట్టు జో అన్నా గుర్తించింది. ఆఫీస్ లో ఉన్నా కూడా ఆమెకు నిద్ర ముంచుకొచ్చేది. అందుకే ఆమె 2019లో ఆఫీస్ మానేసింది. కారులో ప్రయాణిస్తున్నా, చివరకు క్లబ్బులో ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆమెకు నిద్ర ముంచుకొస్తుంది. అక్కడే పడుకుని నిద్రపోతుంది.
ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా..
జోఅన్నాకు ఉన్న ఈ వ్యాధి పేరు ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా. దీనివల్ల ఆమె మెలకువతో ఉండాలన్నా ఉండలేని పరిస్థితి. రోజుకి 22 గంటలు నిద్రపోనిదే ఆమెకు కుదరదు. బలవంతంగా మేల్కొని ఉండాలన్నా కూడా ఆమెకు సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే.. తన ఒంటిపై సాలీడులు పాకే ఫీలింగ్ వస్తుందట. అందుకే ఆమె వెంటనే నిద్రపోతుంది.
కాస్త మత్తుగా అనిపించినా దుప్పటి ముసుగుతన్నేస్తుంది. నిద్ర లేవడం, వంట వండు కోవడం వంటివన్నీ ఆమెకు అలవాటు లేదు. ఎందుకంటే వంట వండుకునేందుకు కూరగాయలు కడిగి పెట్టుకోగానే ఆమెకు నిద్ర ముంచుకొస్తుంది. అందుకే ఆమె ప్రొటీన్ షేక్ లను లాగించేస్తుంది. నిద్రలేవగానే ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని డెలివరీ వచ్చీ రాగానే తినేసి మళ్లీ పడుకుంటుంది.
ఇద్దరు పిల్లల బాధ్యతను భర్తకే వదిలేసింది జోఅన్నా. ప్రస్తుతానికి ఆమె రోగానికి మందులేదు. కానీ తనకున్న వ్యాధిని నయం చేసే డాక్టర్ దొరుకుతాడనే ఆశ ఆమెకు ఉంది.