Advertisement

Advertisement


Home > Politics - National

వాట్సాప్ తెచ్చిన తంటా.. అడ్మిన్ పై తుపాకీ కాల్పులు

వాట్సాప్ తెచ్చిన తంటా.. అడ్మిన్ పై తుపాకీ కాల్పులు

వ్యక్తిగత కక్షలు రానురాను ఎలా మారిపోతున్నాయో తెలియజేసే ఘటన ఇది. వాట్సప్ గ్రూప్ నుంచి డిలీట్ చేశాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు అడ్మిన్ ని తుపాకీతో కాల్చారు. అతను ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటన గురుగావ్ లో జరిగింది. ఫిబ్రవరి 26న ఈ హత్యాయత్నం జరగగా, తాజాగా నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు దానికి గల కారణం తెలుసుకుని షాకయ్యారు. కేవలం వాట్సప్ గ్రూప్ నుంచి డిలీట్ చేసినందుకే అడ్మిన్ పై కక్ష పెంచుకుని హత్యాయత్నం చేసినట్టు తేలింది.

అసలు కథేంటి..?

రాజ్ కమల్ అనే వ్యక్తి పెంపుడు జంతువులపై అభిమానం ఉన్నవారితో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇతని గ్రూప్ లో ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆనంద్ కుమార్ స్థానికంగా ఓ టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. అతడికి చెందిన ఓ కుక్క ఇటీవల డాగ్ ఫైట్ లో చనిపోయింది. దీంతో వాట్సప్ గ్రూప్ లో దానిపై చర్చ జరిగింది.

ఈ క్రమంలో ఆనంద్ కుమార్ ని కొంతమంది ఎగతాళి చేశారు. ఆ తర్వాత మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో గ్రూప్ అడ్మిన్ రాజ్ కమల్.. ఆనంద్ కుమార్ సహా మరో ఇద్దరిని గ్రూప్ నుంచి తొలిగించాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంతో పరువు పోయినట్టు భావించిన ఆ ముగ్గురు, రాజ్ కమల్ ని అంతమొందించాలని ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా తుపాకీతో కాల్పులు జరిపారు. తుపాకీ బుల్లెట్ల గాయాలతో రాజ్ కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆనంద్ కుమార్ తో పాటు, హితేష్ అలియాస్ డేవిడ్, భూపేందర్ అలియాస్ భీమ్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన ఓ పిస్టల్ తో ఆ ముగ్గురు రాజ్ కమల్ ని చంపాలని చూశారు. తనని కాల్చింది ఎవరో తెలియని పరిస్థితుల్లో రాజ్ కమల్ ఆస్పత్రిపాలయ్యాడు.

చివరకు పోలీసులు ఆరా తీస్తే ఆనంద్ కుమార్ పేరు బయటకు వచ్చింది. అతనితో పాటు మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సప్ గ్రూప్ నుంచి డిలీట్ చేశాడనే కోపంతో గతంలో కూడా అడ్మిన్ పై ఇలాంటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?