ధర్మవరం టికెట్ నాకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా టీడీపీకి గుడ్ బై చెప్పేస్తానంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే రెండున్నరేళ్ల ముందే ఆయన టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నారనమాట. అది కూడా అధినాయకుడి మాటల్లో కాకుండా, తనకు తానే టికెట్ కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీడీపీలో చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో చెప్పడానికి.
2019లో రాప్తాడులో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ కే అంత ధీమా ఉంటే.. ఆయనకంటే మెరుగైన ఫలితాలు సాధించినవారిలో ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాంటి వారంతా ఆ టికెట్ మాదే, ఈ టికెట్ మాదేనంటూ అడ్డం తిరిగితే పాపం చంద్రబాబు పరిస్థితి ఏంటి..? పైగా శ్రీరామ్ తనకు ధర్మవరం, తన తల్లి సునీతకు రాప్తాడు టికెట్లు కావాలని ఇప్పుడే చెప్పేస్తున్నారు.
శ్రీరామ్ సంగతి పక్కనపెడితే టీడీపీలో ఈమధ్య ఓ రేంజ్ లో లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలో కోవర్టులు, కట్టప్పలంటూ కొంతమందికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా రివ్యూలో ఏకంగా ముగ్గురిపై వేటు వేశారు కూడా. అయితే అసంతృప్తుల్ని బుజ్జగించడం చంద్రబాబు వల్ల కావడంలేదు.
గతంలో కేశినేని నాని పార్టీని వీడతారంటూ జరిగిన ప్రచారంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. ఎమ్మెల్యేలు పోతున్నా ఏమీ చేయలేకపోయారు, రాజధాని ప్రాంతంలో ఉన్న ఎంపీ, అందులోనూ తన సామాజిక వర్గ నేత చేజారుతున్నారనే సరికి బాబులో భయం మొదలైంది. నయానో భయానో నచ్చజెప్పుకుని కేశినేనిని తనదారికి తెచ్చుకున్నారు. కేశినేని కోసం బొండా ఉమ, బుద్ధా వెంకన్నకు రాజకీయ సమాధి కట్టేశారు బాబు.
బుచ్చయ్య డ్రామా హైలెట్..
ఆ మధ్య గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక, డెడ్ లైన్, డెడ్ లైన్ తర్వాత ఆయన మెత్తబడటం అందరికీ తెలిసిన విషయమే. బచ్చయ్య టీడీపీని వదిలిపెట్టి బయటకు వెళ్లడమేంటి అని సీనియర్లు గాలివార్తగా కొట్టిపారేసినా.. ఆ రోజుకి ఆయనలో ఉన్న ఫైర్, టీడీపీ అనుకూల మీడియా కూడా ఆయన్ని హైలెట్ చేయడంతో కాస్త అనుమానాలు మొదలయ్యాయి.
అయితే చంద్రబాబుని దారికి తెచ్చుకోడానికే బుచ్చయ్య ఈ డ్రామా ఆడారని తర్వాత తేలింది. మొత్తమ్మీద చిన్నా పెద్దా ఏ ఒక్కరూ బాబుకి భయటపడంలేదు, ఆయన్నే భయపెడుతున్నారు.
పక్కలో బల్లేలు.. జేసీ బ్రదర్స్..
జేసీ బ్రదర్స్ తో వేదిక పంచుకోవడం అంటే చంద్రబాబుకి మూడినట్టే లెక్క. ఎక్కడో మొదలు పెడతారు, ఎక్కడికో తీసుకెళ్తారు, పక్కనే ఉండి చంద్రబాబుని తిట్టిపోస్తారు, ఆ తర్వాత ఆయనలాంటి నాయకుడు లేడంటారు. వీరితో బాబు విసిగిపోయినా.. కుప్పం నియోజకవర్గంలో ఎగరని టీడీపీ జెండా, అనంతపురంలో ఎగిరేసరికి వారిని భరించాల్సిన పరిస్థితి.
జేసీ బ్రదర్స్ అంటే పెదబాబుకే కాదు, వారి చేతిలో చాలా సార్లు చాకిరేవు పెట్టించుకున్న చినబాబుకి కూడా భయమే. ఆ భయమే తమ పెట్టుబడిగా టీడీపీలో పెత్తనం చలాయిస్తున్నారు ఈ సోదరులిద్దరూ.
ఉత్తరాంధ్రలో నాయుడిగారి పెత్తనం..
ఉత్తరాంధ్రే కాదు, ఏకంగా టీడీపీ పగ్గాలు సైతం తమ నాయకుడిగే అప్పగించాలంటూ ఆమధ్య సోషల్ మీడియా వేదికగా రామ్మోహన్ నాయుడి అభిమానులు హడావిడి చేశారు. పార్టీపై అప్పుడే కన్నేశారు ఎర్రన్నాయుడి తనయుడు. కానీ చంద్రబాబు వ్యూహాల ముందు అవి పనిచేయలేదు. అయినా కూడా ఇప్పటికీ ఉత్తరాంధ్రలో తనమాటే చెల్లుబాటు కావాలంటారు. బాబాయ్ అచ్చెన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో రామ్మోహన్ నాయుడు ఆడింది ఆట, పాడింది పాటలా ఉంది. ఆమధ్య కొన్ని సందర్భాల్లో లోకేష్ ను కూడా లెక్కచేయలేదు.
దీంతో చంద్రబాబు, చినబాబు ఇద్దరూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, ఏకంగా ఉత్తరాంధ్ర పెత్తనం కోరుతున్నట్టు సమాచారం. కుదరని పక్షంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిర్ణయాధికారం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బెదిరింపులే స్వాతంత్రమా..?
గతంలో టీడీపీలో అధినేతను బెదిరించే స్వభావం ఎవరిలో ఉండేది కాదు, పోనీ బాబు బెదిరిస్తే బెదిరిపోయే రకం కూడా కాదు. కానీ 2019 తర్వాత మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రతి జిల్లా నుంచి ఇలాంటి ఓపెన్ వార్నింగులు ఎక్కువయ్యాయి.
ఎవర్నీ, ఎక్కడా ఏమీ అనలేని చంద్రబాబు దీనావస్థ వర్ణనాతీతం. బహుశా.. ఈ హెచ్చరికల్ని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ బాబు కవర్ చేసుకుంటారేమో.