ఆయనంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇప్పటికీ అభిమానమే అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. సోనియా గాంధీ అంతగా అభిమానించే నాయకుడు ఎవరూ అనుకుంటున్నారా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన, ఉమ్మడి ఏపీకి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తేవడంలో కృషి చేసిన తెలంగాణా నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్.
కాంగ్రెస్ తో విభేదించి డీఎస్ టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడైనప్పటికీ సోనియా గాంధీకి ఆయనపై అభిమానం తగ్గలేదట. ఈ ఏడాది జూన్ లో డీఎస్ పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన తిరిగి ఒకప్పటి తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆయన కాంగ్రెస్ లో తిరిగి చేరాలనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
డీఎస్ పార్టీలోకి రావడం సోనియా గాంధీకి ఇష్టమేగానీ రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని కొందరు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వారిని మళ్ళీ చేర్చుకునే ప్రసక్తే లేదని రాహుల్ అంటున్నాడట. డీఎస్ బాత్ రూములో కాలుజారి కింద పడినప్పుడు పరామర్శించే పేరుతో డీఎస్ ను కలిశాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అప్పుడే ఆయన్ని కాంగ్రెసులోకి ఆహ్వానించాడు.
రేవంత్ ఆహ్వానించకముందే కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచన డీఎస్ కు ఉండొచ్చు. కానీ టీపీసీసీలోని కొందరు నాయకులు డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వారు చెబుతున్న అభ్యంతరం డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నాడని. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడానికి కారణం టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న డీఎస్ తన కుమారుడు అరవింద్ కు సహాయపడటమే అని కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్లాయి.
అప్పటి నుంచి ఆయన డీఎస్ ను దూరం పెట్టారు. ఆ అగాధం అలా పెరిగిపోయింది. డీఎస్ కాంగ్రెస్ లో చేరినా కుమారుడికి సహాయం చేస్తాడేమోనని కొందరి నాయకుల అనుమానం. డీఎస్ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతాడనేది పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాకే చేరొచ్చని కొందరు అంటుండగా, సంక్రాంతి తరువాత చేరొచ్చని ఇంకొందరు అంటున్నారు.
సరే …ఎప్పుడో ఒకప్పుడు పార్టీలో చేరడం మాత్రం ఖాయం. డీఎస్ కు సోనియా తగిన ప్రాధాన్యం ఇస్తారని, ఆయన సేవలను గణనీయంగా వినియోగించుకుంటారని చెబుతున్నారు. డీఎస్ ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. రీఎంట్రీ తరువాత సీనియర్ అవుతాడో, జూనియర్ అవుతాడో చెప్పలేం.