టీడీపీకి భావి వారసుడుగా నారా లోకేష్ ఉన్నారు. ఇక లోకేష్ ని అధికార హోదాలో చూడాలని తండ్రి చంద్రబాబు తపన అందరికీ తెలిసిందే. అయితే లోకేష్ విషయంలో టీడీపీ తమ్ముళ్ళు ఎంతవరకూ నమ్మకంగా ఉంటున్నారో తెలియదు కానీ ఆ పార్టీ లో సుదీర్ఘకాలం కొనసాగి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు మాత్రం లోకేష్ ఎప్పటికీ సీఎం కాలేరని పక్కాగా జోస్యం చెప్పేశారు.
టీడీపీ అధికారంలోకి రాదు, లోకేష్ ముఖ్యమంత్రి కిరీటం అన్నది కల అంటున్నారు ఆయన. ఇక చంద్రబాబు కోసం ఎంత కష్టపడినా ఆ పార్టీలో నాయకులకు ఏమీ మిగలదు, ఒరగదు, అందుకు తానే ఉదాహరణ అంటున్నారు. తాను టీడీపీలో ఉన్నపుడు ఎన్నో ప్రజా పోరాటాలు చేశానని, అయినా కూడా తన పట్ల బాబు ఏనాడు కరుణ చూపలేదని ఆయన విమర్శించారు.
ఇక చంద్రబాబుకు దళితులు అంటే ఎందుకో కోపమని, తన లాంటి వారిని పనిగట్టుకుని ఓడించడమే దానికి మరో ఉదాహరణ అని ఆయన చెప్పుకున్నారు. ఏపీ రాజకీయాల్లో వెన్నుపోట్లు శ్రీకారం చుట్టించి చంద్రబాబేనని కూడా ఘాటు కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు అధికారం కావాలని దాని కోసం ఎంతదాకా అయినా వెళ్తారని చెంగల పేర్కొనడం విశేషం. ఈ మధ్యన జగన్ని గాల్లో వచ్చాడు, గాల్లోనే పోతాడు అన్న మాటలు కూడా అనుమానించతగినవే అన్నారు. జగన్ని ప్రజా క్షేత్రంలో ఎదుర్కోనలేక ఏమైనా చేయిస్తాడు అన్న సందేహాలు అయితే జనాల్లో ఉన్నాయని చెంగల తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబుతో ఏపీ రాజకీయాల్లో ఇక టీడీపీ వెలిగేది ఏమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకనాడు నియోజకవర్గానికి వేయి ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే బాబు జమానాలో గగనం అయ్యేదని, ఇపుడు జగన్ పాలనలో ప్రతీ ఒక్కరికీ పట్టాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బాబు నాడు పేదలకు పెన్షన్లు కొత్తగా ఎవరైకైనా ఇవ్వాలంటే తీసుకున్న వాళ్ళలో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇపుడు జగన్ మొత్తం మార్చేశారని, అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ అందుతోందని అన్నారు.
అదే విధంగా దళితులకు పెద్ద పీట వేయడంతో జగన్ తరువాతనే ఎవరైనా అంటూ కితాబు ఇచ్చారు. మొత్తానికి ఆయన తేల్చింది ఏంటి అంటే ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే అన్నది. ఇక తాను ఒక సాధారణ కార్యకర్తగానే వైసీపీలో కొనసాగుతానని కూడా చెంగల చెప్పుకున్నారు. ఇంతకీ ఈ చెంగల ఎవరనుకుంటున్నారా బాలయ్య వియ్యంకుడు బాలక్రిష్ణ తో సమర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీని తీసి ఇండస్ట్రీకి అదిరిపోయే హిట్ ఇచ్చిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత. పాయకరావుపేట మాజీ టీడీపీ ఎమ్మెల్యే కూడా.