ఆమె ఓ అందాల రాశి. అందం తెచ్చి కుప్పగా పోసి తయారుచేశారేమో అనిపించేంత గ్లామర్ ఆమె సొంతం. ఇప్పుడా అందాల ముద్దుగుమ్మ గుండుతో కనిపించింది. తన జీవితంలో అత్యంత బాధాకరమైన దశను బయటపెట్టింది. ఆమె పేరు హంసానందిని. ప్రస్తుతం ఆమె కాన్సర్ తో పోరాడుతోంది.
“4 నెలల క్రితం ఒక సాధారణ ఉదయం, నా రొమ్ములో ఒక చిన్న ముద్ద ఉన్నట్లు అనిపించింది. నా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండబోదని ఆ క్షణంలోనే తెలిసింది. 18 సంవత్సరాల క్రితం నేను ఒక భయంకరమైన వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. ఆ చీకటి, బాధలోనే బతికాను. కొన్ని గంటల్లో, నేను మామోగ్రఫీ క్లినిక్‌లో గడ్డను టెస్ట్ చేయించాను. బయాప్సీలో నా భయం నిజమైంది. నాకు గ్రేడ్-3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.”
ఇలా తనకు కాన్సర్ సోకిన విషయాన్ని బయటపెట్టింది హంసానందిని. తనకు సర్జరీ పూర్తయిందని, కణతిని తొలిగించారని తెలిపిన హంసా.. విషయాన్ని ముందుగానే పసిగట్టడం తన అదృష్టం అని తెలిపింది. అయితే ఇక్కడితో తన కష్టాలు తీరలేదని ప్రకటించింది ఈ హీరోయిన్.
“నాకు వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ ఉంది. ప్రస్తుతం ఉపశమనం స్వల్పకాలికం మాత్రమే. నేను కాన్సర్ జన్యు ఉత్పరివర్తనను కలిగి ఉన్నాను. నా జీవితంలో మరోసారి రొమ్ము కాన్సర్ రావడానికి 70శాతం ప్రమాదం ఉంది. అదే విధంగా అండాశయ కాన్సర్ రావడానికి 45శాతం ప్రమాదం నాకు ఉంది. ఇంకా చెప్పాలంటే కీమో థెరపీ నా సమస్యకు ముగింపు కాదు. ఈ వ్యాధితో నా యుద్ధం, ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారింది.”
ఇప్పటికి 9 సెషన్స్ కిమోథెరపీలు పూర్తయ్యాయి. మరో 7 ఉన్నాయి. ప్రతి సెషన్ బాధాకరమే. తన జీవితం అంధకారమైనప్పటికీ చిరునవ్వుతో పోరాడి గెలుస్తానంటోంది హంసానందిని. మరింత మెరుగ్గా తయారై, బలంగా తెరపైకి వస్తానంటోంది. జీవితాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకుంటానంటోంది. ఈ సందర్భంగా జుట్టు లేకుండా ఆమె తన ఫొటోను విడుదల చేసింది.