ఒకే ఒక్క ట్వీట్. అందులో లైన్లు నాలుగే ఉన్నాయి. కానీ ఏకంగా ఏపీలోని విపక్షం మొత్తం గాలిని తీసేశారు అంతే. ఆ ట్వీట్ చేసింది వేడి పుట్టించింది ఎవరో కాదు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభ మీద కాస్తా లేట్ గా అయినా లేటెస్ట్ గానే రియాక్షన్ చూపించారు.
అక్కడ చేరిన రాజకీయ పార్టీలు వాటి మధ్య ఐక్యత మీద కూడా ఆయన ట్వీట్ లోనే జవాబు చెప్పేశారు.
జన బలం లేని వారిని వందమందిని వేదిక మీదకు తీసుకురావచ్చు, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు తామంతా ఒక్కటి అని జనాలను మభ్యపెట్టవచ్చు, ఇక ఉద్రిక్త సంఘటనలను కూడా ఉండొచ్చు. కానీ అయిదు కోట్ల మంది ఏపీ ప్రజల పూర్తి ఆదరణ మాత్రం జగన్ ఒక్కరికే ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ లో గట్టిగా పేర్కొన్నారు.
జగన్ ని తన సంకల్పం నుంచి ఒక్క అంగుళం కూడా ఇవేమీ కదిలించలేవు అని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం విశేషం. అంటే తిరుపతి సభ సక్సెస్ అయిందని, ఏపీలో జగన్ వర్సెస్ టోటల్ విపక్షం అన్నట్లుగా టీడీపీ సంబరాలు చేసుకున్నా కూడా జరిగేది ఒరిగేది ఏదీ లేదని ఒక్క ట్వీట్ తో విజయసాయిరెడ్డి చెప్పారన్న మాట. మరి ఆయన ట్వీట్ కి టీడీపీ సహా విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.