జస్టిస్ చంద్రు ఏం మాట్లాడినా సంచలనమే. అంతేకాదు, ఆయన ఏమీ మాట్లాడకపోయినా వార్తాంశమే. జైభీమ్ సినిమా ఫేంగా జస్టిస్ చంద్రుకు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కింది. తమ ప్రాంతానికి వచ్చి రెండు మంచి మాటలు చెప్పి స్ఫూర్తి రగిల్చాలనే ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఏపీ హైకోర్టుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రేపిన దుమారం గురించి అందరికీ తెలిసిందే.
ఇవాళ ఆయన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజావ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని స్పష్టం చేశారు.
గతంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. మరీ ముఖ్యంగా యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ఆయన నిలదీశారు. కార్మికులకు ప్రాతినిథ్యం వహించే యూనియన్ల తోనే మాట్లాడాలని ఆయన అన్నారు.
ముఖ్యంగా జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని హెచ్చరించారు. జై భీమ్ సినిమా ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందన్నారు. ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు చెప్పడం విశేషం. కేసీఆర్ తీరుపై విమర్శలు చేసిన జస్టిస్ చంద్రుపై తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఎందుకంటే ఏపీలో జస్టిస్ చంద్రు వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారనే విష ప్రచారాన్ని టీడీపీ నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. చివరికి ఆయన కులం, మతం, ప్రాంతం, ఇతరత్రా వ్యక్తిగత అంశాల్ని కూడా తెరపైకి తెచ్చారంటే… జస్టిస్ చంద్రు విమర్శలు వారిని ఎంతగా గాయపరిచాయో అర్థం చేసుకోవచ్చు.