రాజధాని వికేంద్రీకరణకు విలువైన సూచనలు

వికేంద్రీకరణతోనే అభివృద్ధి అన్నది రాజకీయాలకు అతీతంగా ఆలోచించే మేధావులు, తటస్థులు అందరిలోనూ ఉన్న మాట. హైదరాబాద్ మోడల్ తో దారుణంగా దెబ్బ తిన్న తరువాత ప్రగతి అంతా ఒకే చోట కుప్ప పోసిన విధంగా…

వికేంద్రీకరణతోనే అభివృద్ధి అన్నది రాజకీయాలకు అతీతంగా ఆలోచించే మేధావులు, తటస్థులు అందరిలోనూ ఉన్న మాట. హైదరాబాద్ మోడల్ తో దారుణంగా దెబ్బ తిన్న తరువాత ప్రగతి అంతా ఒకే చోట కుప్ప పోసిన విధంగా చేస్తే మాత్రం వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటాయని భయమైతే అందరిలోనూ ఉంది.

అందుకే మూడు రాజధానుల విషయంలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి సలహా ఇస్తున్నాయి. సీపీఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాలు విశాఖలో చేపట్టిన ధర్నా సందర్భంగా ఆయా వర్గాల నేతలు మాట్లాడుతూ మూడు రాజధానులకు గట్టి మద్దతు ప్రకటించారు.

అమరావతిలో శాసన రాజధాని ఉండాలని, అలాగే  విశాఖకు పరిపాలనా రాజధాని కేటాయించి, కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. అదే సమయంలో హై కోర్టు బెంచిలను విశాఖలో అమరావతిలో ఉంచాలని, ఇక ఏడాదిలో ఒక అసెంబ్లీ సమావేశాన్ని విశాఖలో, మరోకటి రాయలసీమలో జరపాలని పేర్కొన్నారు. అదే విధంగా ఉప సచివాలయాల‌ను అమరావతి, కర్నూల్ లలో ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు.

ఇక కొత్తగా రాజధాని కోసం అంటూ పెద్ద ఎత్తున వేల ఎకరాలను సేకరించకుండా పర్యావరణహితంగా వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కేంద్రం వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి కింద యాభై వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి చూసుకుంటే ఏపీ సమగ్ర అభివృద్ధికి ఈ సూచనలు విలువైనవిగానే అంతా భావిస్తున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఏమి ఆలోచిస్తారో చూడాలి.