వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌… సుప్రీంకోర్టు వ‌ర‌కూ!

తెలంగాణ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ సారి వాళ్ల గొడ‌వ ఏకంగా సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ ప్ర‌భుత్వం పంపిన బిల్లుల‌ను కొన్ని నెల‌లుగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై…

తెలంగాణ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ సారి వాళ్ల గొడ‌వ ఏకంగా సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ ప్ర‌భుత్వం పంపిన బిల్లుల‌ను కొన్ని నెల‌లుగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఏదీ తెల్చకుండా తొక్కి పెట్ట‌డంపై కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకుంది. ప‌ది బిల్లులు ఆమోదించ‌క‌పోవ‌డంపై సుప్రీంకోర్టులో తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

గ‌వ‌ర్న‌ర్‌పై తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఈ పిటిష‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను ప్ర‌తివాదిగా చేర్చారు. బ‌హుశా శుక్ర‌వారం విచార‌ణ‌కు రావ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంలోనూ వ్య‌వ‌హారం తెలంగాణ హైకోర్టుకు చేరిన సంగ‌తి తెలిసిందే. 

హైకోర్టు సూచ‌న మేర‌కు ప్ర‌భుత్వ‌, రాజ్‌భ‌వ‌న్ న్యాయ‌వాదులు చ‌ర్చించుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో బ‌డ్జెట్ స‌మావేశాలు మొద‌లు పెట్టేందుకు కేసీఆర్ స‌ర్కార్ ఆమోదించింది. దీంతో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింది.

ఎలాంటి వివాదం లేకుండానే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సాగింది. ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చ‌దివారు. ఈ ఎపిసోడ్‌తో గ‌వ‌ర్న‌ర్‌, ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. అయితే బిల్లులు ఆమోదించ‌కపోవ‌డం స‌ర్కార్‌కు కోపం తెప్పించింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ, బిల్లుల‌ను తొక్కి పెడుతున్నారంటూ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్క‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే. దీనిపై సుప్రీంకోర్టు స్పంద‌న స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది.