రాజమౌళితో సినిమా చేయాలని హీరోలు అందరికీ ఉంటుంది. కొంతమందికి ఆ అవకాశం వస్తుంది. మరికొంతమంది మొహమాటపడి అడగరు, ఇంకొందరు బయటపడరు. బాలయ్య మాత్రం ఆ టైపు కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాట్రం బయటపడ్డారు. మన కాంబినేషన్ ఎప్పుడు అంటూ నేరుగా రాజమౌళినే అడిగేశారు.
తమ హీరోతో సినిమా చేయమని రాజమౌళిని గతంలో బాలయ్య అభిమానులు అడిగారట. దానికి సమాధానంగా బాలకృష్ణను నేను హ్యాండిల్ చేయలేను అంటూ సమాధానమిచ్చాడట రాజమౌళి. ఇదే విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు. ఎందుకు నన్ను బ్యాడ్ చేస్తున్నారంటూ మొహంమీదే అడిగేశారు. దీనిపై రాజమౌళి కూడా అంతే సూటిగా స్పందించాడు.
“బాలాకృష్ణకు పద్ధతి అంటే చాలా పట్టింపు. కానీ నాకు మాత్రం అలాంటి పద్ధతులుండవు. సెట్స్ లో కనీసం నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పినా చిరాకే. షాట్ పెట్టిన తర్వాత హీరో ఎండలో నిల్చున్నాడా, వానలో నిల్చున్నాడా అనేది పట్టించుకోను. నా ఫ్రేమ్ రెడీ అయ్యేవరకు హీరో కష్టసుఖాలు పట్టించుకోను. బాలకృష్ణను నేను అలా ట్రీట్ చేయలేను. ఆయనకు కోపం వస్తుందేమో అని భయం.”
ఇలా ఉన్నది ఉన్నట్టు బయటపెట్టేశాడు రాజమౌళి. దీనిపై బాలకృష్ణ కూడా వివరణ ఇచ్చారు. తను షూటింగ్ లో ఎంత కష్టమైన ఓర్చుకుంటానన్నారు. ఒకసారి కారవాన్ దిగితే మళ్లీ అందులోకి వెళ్లనన్నారు. సెట్స్ లో గొడుగు కూడా పట్టించుకోనని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మరో గమ్మత్తైన విషయం కూడా బయటపెట్టారు బాలకృష్ణ. మగధీర సినిమా స్టోరీని రాజమౌళి ముందుగా బాలకృష్ణకే చెప్పారట.