ఆర్ఆర్ఆర్ ప్రచారం పీక్ స్టేజ్ లో సాగుతోంది. ట్రయిలర్ లాంఛ్ నుంచి దశలవారీగా ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చరణ్-ఎన్టీఆర్-అలియా స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచారు. ఈ క్రమంలో ఈరోజు ముంబయిలో జరగనున్న భారీ ఈవెంట్ ను కూడా టీవీల్లో చూసి ఎంజాయ్ చేయాలని చాలామంది వెయిటింగ్. సరిగ్గా ఇక్కడే యూనిట్ షాకిచ్చింది.
ముంబయిలో మరికొద్దిసేపట్లో మొదలుకాబోతున్న ఆర్ఆర్ఆర్ మెగా ఈవెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కేవలం 2 మీడియా సంస్థలకు మాత్రమే అనుమతి ఇచ్చారట. వాళ్లు టోటల్ ఈవెంట్ ను షూట్ చేసి త్వరలోనే ప్రసారం చేస్తారట. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించి, అభిమానులకు షాకిచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈరోజు జరగనున్న ఈవెంట్ హక్కుల్ని ఆర్ఆర్ఆర్ యూనిట్ స్టార్ ప్లస్ ఛానెల్ కు విక్రయించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 రాత్రి ఈ కార్యక్రమాన్ని సదరు ఛానెల్ టెలికాస్ట్ చేస్తుందట. దీనిపై మాత్రం యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.
మరోవైపు దేశవ్యాప్తంగా జరగనున్న ఇతర ఈవెంట్లపై మాత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ''రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్'' పేరిట ఇతర నగరాల్లో త్వరలో జరగబోయే కార్యక్రమాలు మాత్రం టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ లో లైవ్ లో చూడొచ్చని స్పష్టంచేసింది. ఆ తేదీల్ని త్వరలోనే ప్రకటించబోతున్నారు.
నిజానికి ఈ ఈవెంట్ కు కూడా భారీగా అతిథుల్ని, అభిమానుల్ని ఆహ్వానించి, గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు. ఎప్పట్లానే లైవ్ కు వెళ్లాలని కూడా అనుకున్నారు. కానీ మహారాష్ట్రలో, ప్రత్యేకించి ముంబయిలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలా తక్కువమంది అతిథుల సమక్షంలో ఆఫ్-లైన్ లో ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. అటు చరణ్, తారక్ ఫ్యాన్స్ మాత్రం దాదాపు వెయ్యి మంది ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు.