నోట్ల రద్దు నల్లధనికులకు పెద్ద షాక్.. అనేది ఒట్టి భ్రమ మాత్రమే అని తేల్చి చెప్పే సంఘటన ఇది. నోట్ల రద్దుతో మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని, అనేక మంది నల్లధనికులు ఇబ్బందుల పాలయ్యారని.. కొంతమంది వాదిస్తూ ఉంటారు. అయితే అలాంటి వాదనలు వీగిపోయి చాలా కాలం అయిపోయిందనుకోండి. ఇంకా అందుకు సంబంధించిన అమాయకులు ఎవరైనా ఉంటే.. వారు శశికళ ఉదంతం గురించి తెలుసుకుంటే.. మొత్తం కథ అర్థం అవుతుంది.
నోట్ల రద్దు జరిగిన తర్వాత.. తన దగ్గర మిగిలిన పాత నోట్లతో అక్షరాలా 1,674 కోట్ల రూపాయల ఆస్తులను కొనుగోలు చేసిందట శశికళ. అప్పటి వరకూ శశికళకు కలిగిన ఆస్తులు వేరు. ఆమె దగ్గర మారకం రద్దు అయిన నోట్లే ఆ రేంజ్ లో ఉన్నట్టున్నాయి. ఉన్న ఫలంగా వాటి మారకం రద్దు అయ్యింది. దీంతో ఆమె సింపుల్ గా ఆ నోట్లను ఇచ్చేసి ఆస్తులను కొనుగోలు చేశారు. వాటికి గడువు మూడు రోజులే అయినా.. వాటిని మార్చుకునే టెక్నిక్స్ వాళ్లకు తెలుసు. అందుకే దర్జాగా అన్ని వందల కోట్ల రూపాయలను మార్చుకోగలిగారు.
అంతే కాదట.. మారకం రద్దు అయిన నోట్లను కొంతమందికి అప్పుగా కూడా ఇచ్చారట శశికళ. వాళ్లు వద్దన్నా బలవంతంగా అప్పు ఇవ్వడం అది! రద్దైన నోట్లను వాళ్లకు ఇచ్చేసి, దానికి వడ్డీ వేసి శశికళకు ఇవ్వాలట. తిరిగి చెల్లింపులు కొత్త నోట్ల రూపంలో జరగాలి! ప్రభుత్వ పనుల కాంట్రాక్టర్లకు అలా రద్దు అయిన నోట్లను అంటగట్టారట శశికళ.
అయితే బయటకు వస్తున్నది కేవలం శశికళ లీలలు మాత్రమే. రాజకీయంగా ఆమె ఇరుకుపడ్డారు కాబట్టి.. ఆమెకు సంబంధించిన వ్యవహారాలను ఇలా బయటపెట్టగలుగుతున్నారు. నల్లధనికురాలు ఆమె ఒకతే కాకపోవచ్చు. మరెంతో మంది ఉంటారు. వారు కూడా ఇలాంటి వేల కోట్ల డీల్స్ అప్పట్లో చేసి ఉండొచ్చు. అలాంటివి బయటకు రావు, రాలేవు. అమాయక భక్తులు మాత్రం మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని భ్రమ పడుతూ ఉంటారంతే!