రాజధాని అమరావతిపై విచారణకు సంబంధించి ఏపీ సర్కార్కు సర్వోన్నత న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో రాజధాని విషయమై ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం రాజధాని పిటిషన్లను విచారణకు స్వీకరించింది.
అయితే ఈ నెల 28న తిరిగి విచారిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రాజధానిపై తమ నిర్ణయాల్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తికనబరుస్తోంది. ఈ నేపథ్యంలో 28 రోజుల పాటు ఎదురు చూడడం అంటే మరింత జాప్యానికి కారణమవుతుందనే ఆలోచన ఏపీ ప్రభుత్వానిది. దీంతో మరోసారి త్వరగా విచారణ చేపట్టాలని విన్నపంతో సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది.
ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విన్నపాన్ని ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎం జోసెఫ్ ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది. విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ పరమైన అంశాలు ఇందులో చాలా ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. గతంలో పేర్కొన్నట్టుగానే 28వ తేదీనే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ అదొక్క రోజే విచారిస్తే సరిపోదని, మార్చి 29, 30 తేదీల్లో కూడా విచారించాలని కోరారు. అయితే ఆ రోజుల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని చీఫ్ జస్టిస్ సర్క్యులర్ వుందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయమై చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని, అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. కానీ ధర్మాసనం తిరస్కరించింది. దీంతో రాజధాని వ్యవహారంపై 28వ తేదీ వరకూ విచారణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.