యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గంలో నడక సాగిస్తున్నారు. అత్యధికంగా ఐదు రోజుల పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనే తాను పాదయాత్ర చేస్తున్నట్టు కాసేపటి క్రితం లోకేశ్ చెప్పడం విశేషం. ఇది చంద్రబాబు పుట్టిన గడ్డ. ఈ నియోజకవర్గంలోని నారావారిపల్లెలో చంద్రబాబు జన్మించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన్ను ఒకే ఒక్కసారి మాత్రమే ఆదరించారు.
చంద్రగిరిలో రాజకీయంగా తనకు అనుకూలమైన పరిస్థితి లేదని చంద్రబాబు గ్రహించి, కుప్పానికి మకాం మార్చారు. 30 ఏళ్లుగా టీడీపీని దూరం పెడుతూనే ఉన్నారు. దీన్నిబట్టి సొంత నియోజకవర్గంలో బాబును ఎంత వరకూ నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ పదేపదే చేస్తున్న విమర్శ… “చెవిరెడ్డికి ఒకట్రెండు కాదు, ఏకంగా నాలుగు పదవులున్నాయి. రెండో దఫా ఎమ్మెల్యే అయిన ఆయన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి? ప్రజలకు చీరలు, స్వీట్ బాక్సులు. ఇవి తప్ప చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇచ్చింది ఏమైనా వుందా?” అని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
చెవిరెడ్డి తెలివైన వాడని, ఎప్పుడు తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన లీడర్ అని అభిమానులు అంటుంటారు. చంద్రగిరి నీళ్లలో ఏదో ప్రత్యేకత వుందని, ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకుల మనస్తత్వం ఒకేలా వుంటుందని, అందుకు ఉదాహరణ చంద్రబాబు, చెవిరెడ్డి అని గిట్టని నేతలు విమర్శగానో, వ్యంగ్యంగానో అంటుంటారు. కానీ వారిలో నాయకత్వ లక్షణాలు లేకపోతే… ఇంతింతై అన్నట్టు ఎదిగే అవకాశం వుండేది కాదని ఎవరైనా అంగీకరించాల్సిన సత్యం.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎంత తెలివైన లీడర్ అంటే తుడా చైర్మన్ పదవిని వరుసగా రెండోసారి కూడా దక్కించుకున్నారు. ఇందులో డైరెక్టర్లకు చోటే లేకుండా, అంతా తానై పవర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలా వుండేది కాదు. చంద్రబాబు ఎప్పుడూ ఒకరికే పవర్ ఇవ్వరు. చైర్మన్‌కు తోడు డైరెక్టర్లను కూడా నియమించే వారు. మరీ ముఖ్యంగా బీసీలకు ఆ పదవిని కట్టబెట్టేవారు. తద్వారా తిరుపతితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీ వైపు సానుకూల వైఖరితో బీసీలు ఉండేలా చేసుకునేవారు.
అబ్బే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాంటివేవీ ఆలోచించలేదు. తమ్ముడు చెవిరెడ్డి అడిగాడు, మరొకరికి చోటు లేకుండా సీఎం జగన్ ఒకరికే పవర్ ఇచ్చారనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. తుడా చైర్మన్ కావడంతో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా టీటీడీ మెంబర్‌గా కూడా అవకాశం కలిసొచ్చింది. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ విఫ్ పదవిని కూడా జగన్ ఇచ్చారు. ఏకంగా నాలుగు పదవులు చెవిరెడ్డికే ఇవ్వడంపై సహజంగానే ఇతర నాయకుల్లో కొంత అసంతృప్తి ఉండే అవకాశం వుంటుంది. నాణేనికి రెండో వైపు కూడా చూడాల్సి వుంటుంది.
చెవిరెడ్డికి ఎంతో టాలెంట్ ఉంటేనే సీఎం జగన్ ఒకటికి నాలుగు పదవులు ఇచ్చారని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. అంతెందుకు ఇటీవల వైసీపీ అనుబంధ విభాగాల ప్రధాన బాధ్యుడిగా విజయసాయిరెడ్డి ఉన్నప్పటికీ, వాటి నియామకాలన్నీ చెవిరెడ్డే ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా లోకేశ్ విమర్శల పుణ్యాన చెవిరెడ్డి నాలుగు పదవులపై చర్చ జరుగుతోంది. తెలివి ఒకరబ్బని సొమ్ము కాదని గ్రహిస్తే… చెవిరెడ్డి బహు పదవులపై లోకేశ్, ఇతర నాయకులు విమర్శించే అవకాశం వుండదు.
ఎందుకంటే చీర, స్వీట్‌తో చెవిరెడ్డి మోసగిస్తాడని విమర్శిస్తున్న లోకేశ్, అదే పని చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నానితో చేయిస్తే ఎవరొద్దంటారు. కడుపు మంటతో విమర్శలు తప్ప, అందులో ఏమైనా లాజిక్ వుందా? చెవిరెడ్డి మీరు పంచడం మాత్రం ఆపొద్దు సార్!