ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా జీవో 142ని జారీ చేసింది. సినీ పెద్దల సూచనల మేరకు సినిమా టికెట్ల విక్రయాల్లో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయ బాధ్యతను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇంత వరకూ సినిమా టికెట్లను పేటీఎం, బుక్‌మై షో తదితర యాప్‌లలో కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయించడంతో అందుకోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వ జోక్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
దానిపై డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం వెళ్లింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సినిమా టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని, ముందుగా ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు వారికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ టికెట్ల ధరల పెత్తనం ప్రభుత్వం చేతిలోకి వెళ్లినట్టైంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్లడంపై కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.