పరిపాలనా రాజధాని ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అర్హమైన ప్రాంతమని, అందువల్ల జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్నామని విశాఖ అర్బన్, రూరల్ టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అంతేకాదు వీరంతా కలసి ఓ తీర్మానం కూడా చేశారు. మరోవైపు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ , ఇతర నాయకులు విజయవాడలో ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని జగన్ సర్కార్ వెల్లడించినప్పటి నుంచి విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మద్దతు తెలపడంతో పాటు అందుకు అనుగుణంగా బలమైన వాదన వినిపిస్తున్నారు. చివరికి విశాఖ జిల్లాలోని టీడీపీ మొత్తాన్ని తన దారికి తెచ్చుకుని ఓ తీర్మానం కూడా చేసేలా రాజధాని మెడలో ‘గంట’ కట్టారు.
టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం వారంతా సమావేశమయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తూ విశాఖ అర్బన్, రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగాలు స్వాగతించాయి.
ఈ మేరకు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, సినీనటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ సహా మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనితి, పల్లా శ్రీనివాసరావు, పీలా గోవిందు, కేఎస్ఎన్ రాజు పార్టీ సీనియర్ నేతలు తీర్మానం చేశారు.
రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, విశాఖ అభివృద్ధి చెందాల్సిన సమయం ఇదేనన్నారు. తమ నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించాలని తీర్మానించారు. కాగా ఈ సమావేశంలో తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, విశాఖ అర్బన్, రూరల్ పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబుపై ఈగ వాలనివ్వని వంగలపూడి అనిత, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పాల్గొనేలా గంటా శ్రీనివాసరావు చక్రం తిప్పారు.
ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళితే రాజకీయాల్లో రాణించలేరని, జగన్ సర్కార్ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించకపోతే భావితరాలు మనల్ను క్షమించవని హితబోధ చేయడంతో మిగిలిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారని సమాచారం. ఏది ఏమైనా చంద్రబాబు కంటే విశాఖ రాజధాని వైపు స్థానిక టీడీపీ నేతలు మొగ్గు చూపడం గమనార్హం.