రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ సర్కారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. పరిపాలనకు, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎలాగైతే బాగుంటుందని వారికి అనిపిస్తున్నదో.. అలాంటి నిర్ణయాలను వారు తీసుకుంటున్నారు. సహజంగానే ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలను రాద్ధాంతం చేయడానికి ప్రయత్నించడం జరుగుతూనే ఉంటుంది. అయితే రాజ్యాంగబద్ధ ఉన్నత పదవిలో ఉండే వ్యక్తి కూడా ఇలాంటి వాటిలో భాగం కావడమే ఇప్పుడు చిత్రంగా కనిపిస్తోంది.
అమరావతిని చట్టసభలు కొలులుతీరే రాజధానిగా అలాగే ఉంచుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం మరో రెండు రాజధానాలుగా విశాఖ, కర్నూలు ఉండాలని జగన్ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు ఆ ప్రాంతంలోని కొందరు రైతులనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. రాజధాని ప్రాంతంలోని రైతులు రాజధాని ఇక్కడే ఉండాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. సహజంగానే విపక్షాలు, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వారు వెనుక ఉండి.. ఇలాంటి వాటిని నడిపిస్తున్నారు. అలాంటి వాళ్లంతా కలిసి తాజాగా విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి.. తమ పితూరీలు అన్నీ ఆయనకు చెప్పుకున్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు.. ఇలాంటి రాజకీయ ప్రేరిత వివాదాస్పద అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే సరిపోయేది. ఆయన వారితో ఈ రాజధాని ప్రాంత రైతుల సమస్యలు నాకు తెలుసు, ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందో, ఎవరికి చెప్పలో వారికి చెబుతాను.. అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారుతోంది.
కొన్ని పార్టీలు రైతులను రెచ్చగొట్టి.. వివాదాన్ని రేకెత్తిస్తోంటే.. రాజ్యాంగ పదవిలో ఉన్న ఉప రాష్ట్రపతి కూడా.. వారి పితూరీలకు దన్ను ఇస్తున్నట్లుగా.. ఎవరికి చెప్పలో వారికి చెబుతాను అని వ్యాఖ్యానించడం.. సబబు కాదని పలువురు అంటున్నారు. రాష్ట్రప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నట్లుగా, రాజకీయంగా మాట్లాడుతున్నట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. వివాదాల జోలికి ఉపరాష్ట్రపతి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని పలువురు అంటున్నారు.