రాజకీయ ప్రత్యర్థులు ఆయన సీనియారిటీని ఎద్దేవా చేయవచ్చు గాక! కానీ ఆయన నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఈ రాష్ట్రంలో మరెవ్వరూ చేయలేని విధంగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి నాయకుడు.. తరచూ రాజకీయ కక్షతో తప్ప ప్రజాహితమైన దృక్పథంతో కాకుండా.. వక్రమాటలు మాట్లాడుతుండడం వల్ల వివాదాలకు బీజం వేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ.. ఆయన తాజాగా ఒక అద్భుతమైన మాట అన్నారు. ప్రతిఒక్కరూ కూడా శ్రద్ధగా గమనించాల్సిన మాట అది.
మూడు ప్రాంతాల్లో రాజధానిని విస్తరించాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రాంతంలోని కొందరినుంచి, పొలాలను ఇచ్చిన వారినుంచి వ్యతిరేకత వస్తోంది. వారి వెనుక కొన్ని రాజకీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. అయితే వారంతా వెళ్లి మంగళవారం నాడు చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను నమ్ముకోకుండా మీరే రోడ్డు మీదకు వచ్చి పోరాడడం చాలా మంచి పరిణామం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. పైగా.. మీమీద కేసులు పెడతారు. జైల్లో పెడతారు అని కూడా హెచ్చరించారు. చేస్తారో లేదో గానీ.. నేను కూడా జైలుకు వచ్చి కూర్చుంటా.. అని హామీ మాత్రం ఇచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు. రాజధాని కోసం పోరాటాల్ని జేఏసీగా మీరందరూ చేయండి. మా పార్టీ తరఫున పోరాటాలు మేం చేస్తూ.. మీకు కూడా మద్దతు ఇస్తాం.. అని చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతులకు చెప్పారు. ఒకే గొడుగు కింద పోరాడితే ఫలితం వస్తుందని అంటూనే.. రాష్ట్రపతికి ప్రధానికి లేఖలు రాయాలని, ప్రతిరోజూ ఒక కార్యక్రమం ప్రకటించాలని.. రాజకీయ ఉద్దేశాలతో.. అత్యంత ముసలి ఆలోచనలను కూడా చంద్రబాబు వారికి చెప్పారు.
ఇందులో అద్భుతమైన మాట ఏంటంటే.. జేఏసీ పోరాటం రాష్ట్రమంతా విస్తరించాలని చంద్రబాబు అన్నారు. ఇది పట్టించుకోవాల్సిన సంగతి. తెలుగుదేశం కుట్రలతో సంబంధం లేకుండా.. రాజధాని అమరావతిలోనే ఉండాలనే పోరాటం రాష్ట్రానికంతా విస్తరిస్తే గనుక.. ఆ వాదనలో నిజం ఉన్నట్లు లెక్క. తెదేపా తెరవెనుక నుంచి అలాంటి రాద్ధాంతం రాష్ట్రమంతా చేయాలని అనుకుంటే.. అది కుట్ర కింద లెక్క. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ రాజధాని కేంద్రాలు వస్తుండగా.. వారంతా అమరావతికే జై కొట్టేలా ఉద్యమాలు ఎందుకు చేస్తారో ఎలా చేస్తారో చూడాలి. చేస్తే.. జగన్ ప్రభుత్వపు ఆలోచన తప్పనే అనుకోవచ్చు.