ఇటు జగన్, అటు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఈ రెండు పార్టీలు, ఈ రెండు పవర్ సెంటర్ల మధ్య తెరవెనక యుద్ధం నడుస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు బీజేపీలోకి చేరిన కొంతమంది టీడీపీ మాజీ తమ్ముళ్లు ఈ యుద్ధాన్ని ఎగదోస్తూనే ఉన్నారు. అయితే ప్రతి సారి జగన్ దే పైచేయిగా ఉంటోంది. ఇప్పుడు కీలకమైన అమరావతి అంశం దగ్గరకొచ్చి ఆగింది పోటీ. మరి ఈసారి కూడా జగనే గెలుస్తారా.. లేక కేంద్రం పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి ఇంగ్లిష్ మీడియం వరకు ప్రతి విషయంలో జగన్ తను అనుకున్నది సాధించారు. చేసి చూపించారు. పీపీఏల విషయంలో వెనక్కి తగ్గాలని స్వయంగా కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్ తగ్గలేదు. ఏకంగా కేంద్రం నుంచి అధికారికంగా మంత్రులు, అధికారులు లేఖలు రాసినా సీఎం పట్టించుకోలేదు. రాష్ట్రంపై ఏళ్లుగా పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించే పనిని దిగ్విజయంగా పూర్తిచేశారు.
పోలవరం విషయంలో కూడా ఇదే జరిగింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దంటూ కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసింది. పాత నవయుగ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంపై స్వయంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జగన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా ముఖ్యమంత్రి తగ్గలేదు. రివర్స్ టెండరింగ్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంపై అదనపు భారాన్ని తగ్గించారు. ఈ విషయంలో కూడా బీజేపీ నేతలు ఏం చేయలేకపోయారు.
అటు ఇంగ్లిష్ మీడియం విధానంపై కూడా కేంద్రం చూడడం మినహా మరేం చేయలేకపోయింది. చివరికి ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించిన వెంకయ్యనాయుడు కూడా ఇప్పుడు ఓకే అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు జరిగినవన్నీ ఒకెత్తు. ఈసారి అమరావతి అంశం ఒక్కటి మరో ఎత్తు. మూడు రాజధానుల అంశంపై బీజేపీతో పాటు, టీడీపీ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎలాగైనా జగన్ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.
అమరావతి చుట్టుపక్కల ఏ స్థాయిలో భూదందా జరిగిందో అందరం చూశాం. అక్కడ పూర్తిస్థాయి రాజధాని రాకపోతే టీడీపీ నేతలు, బినామీలకు కోట్లలో నష్టం వస్తుంది. అందుకే వీళ్లంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈసారి ఎలాగైనా జగన్ ను ఆపాలని వాళ్లు కోరుతున్నారు. విశాఖ లేదా కర్నూలులో శంకుస్థాపన రాయి పడిందంటే.. తమ గుండెల్లో రాయి పడినట్టేనని వాళ్లు కేంద్ర పెద్దల ముందు మొరబెట్టుకుంటున్నారు. ఈ విషయంలో టీడీపీ-బీజేపీ పెద్దలంతా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు.
అయితే జగన్ ను ఈ విషయంలో ఎలా అడ్డుకుంటారనేది ప్రధానమైన ప్రశ్న. రాజధానిని అమరావతిలోనే కట్టి తీరాలని డిమాండ్ చేస్తే, కేంద్రం నుంచి జగన్ భారీగా నిధులు కోరే అవకాశం ఉంది. దీనికి బీజేపీ వద్ద సమాధానం లేదు. పైగా ఇలా డిమాండ్ చేస్తే, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ భూస్థాపితం అయిపోతుంది. సో.. ఈసారి కూడా సీఎంను అడ్డుకోవడం కష్టమనే అంటున్నారు విశ్లేషకులు. నిధుల సమస్య ఉన్నప్పటికీ జగన్ తను అనుకున్నది చేసి చూపిస్తారని చెబుతున్నారు. వెంకయ్యనాయుడు లాంటి నేతలు అధికార వికేంద్రీకరణ అంటూ ప్రసంగించడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు