ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, సీమాంధ్ర ప్రాంతం తమకు ఏం కావాలో డిమాండ్ చేయలేకపోయింది. సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిథులెరూ.. తమ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, 'అమరావతి ఒక్కటే ముద్దు.. ఆ రెండూ వద్దు..' అనే నినాదాన్ని రాజధాని అమరావతి ప్రాంత రైతులతో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నినదింపజేస్తోంది.
మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఈ రోజు అమరావతికి మద్దతుగా కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు 'మూడు రాజధానాలు వద్దు.. అమరావతి ఒక్కటే ముద్దు..' అంటూ నినదించారు. వారితో అమరావతి ప్రాంత రైతులు గొంతు కలిపారు.
నిజానికి, అమరావతి ప్రాంత రైతులు.. తమ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించాల్సి వుంటుంది. ఆ మాటకొస్తే, వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికీ అమరావతి అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదనే చెబుతోంది.
ఒకరిద్దరు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మినహాయిస్తే, ప్రభుత్వం తరఫున విషయం చాలా క్లియర్‌గా వుంది.
అలా ఒకరిద్దరు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, వాటిని ఖండిస్తూ.. మిగిలిన మంత్రులు వివరణ ఇస్తున్న దరిమిలా, అమరావతి రైతులు ఆందోళన చేయాల్సిన పనే లేదు.రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి, మూడు రాజధానుల్ని ప్రతిపాదించింది జీఎన్ రావు కమిటీ.
ఆ కమిటీ నివేదికపై ఈ నెల 27న జరిగే క్యాబినెట్‌లో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. నివేదిక ప్రకారం చూసుకున్నా, అమరావతికి కలిగే నష్టమేమీ లేదు. ఇప్పుడున్న భవనాల్లో దేన్నీ కూల్చే పరిస్థితి లేదు. పైగా, కొత్త భవనాలు వస్తాయి. దానికి తోడు అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్‌గానూ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
ఒకవేళ అమరావతిని పూర్తిగా కాలగర్భంలో కలిపేయాలన్న ఆలోచనే ప్రభుత్వంలో వుంటే, కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిథులు మౌనంగా వుంటారని ఎలా అనుకోగలం.? ఇప్పుడు చర్చ, మూడు రాజధానులు ఎలా కడతారన్నది మాత్రమే.
కర్నూలులో అయినా విశాఖలో అయినా కొత్తగా నగరాల నిర్మాణం జరగదు. కొత్త కొత్త భవనాలు అదనంగా వస్తాయంతే. కొత్తగా ఓ నగరాన్ని నిర్మించడం కంటే, ఇది సులువైన పనే.కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి కన్పించడంలేదు గనుక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. ఈ మూడు రాజధానుల ప్రతిపాదన, అభివృద్ధితోపాటు అధికార వికేంద్రీకరణ అనేది మెరుగైన ఆలోచనే.
కానీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కర్నూలు, విశాఖ నగరాల అభివృద్ధిని అడ్డుకునేలా 'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు' అనే నినాదాన్ని భుజానికెత్తుకుని.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం విషయంలో టీడీపీ వ్యవహరించిన వైఖరితో సీమాంధ్ర ఎలా నష్టపోయిందో చూశాం.. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా అలాగే జరగబోతోందా.?