కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకుంటుంటారు. తద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. రాజకీయంగా ఔట్‌డేటెడ్ అయిన రేణుకా చౌదరి భవిష్యత్‌పై దింపుడుకళ్లెం ఆశతో ఉన్నట్టున్నారు. గతంలో తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభలో రేణుకా చౌదరి ప్రసంగిస్తూ, జగన్‌పై అవాకులు చెవాకులు పేలారు.
కమ్మ రాజమాతగా తనకు తానుగా భావించే రేణుకా చౌదరి తాజాగా విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన మార్క్ కామెడీ ప్రదర్శించారు. ఏపీ ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారన్నారు. ఏపీలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమన్నారు. అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమని రేణుకా చౌదరి ప్రకటించడం విశేషం. ఏపీలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానంటూనే, తన ఆప్షన్ విజయవాడ అని చెప్పడంలోనే ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాకు వెళితే మాత్రం టీడీపీ. ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలను ఏపీ ప్రజలు ఆదరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేరని తెలిసినా, అక్కడ పోటీ చేస్తానని రేణుకా చెప్పడం వెనుక ఆమె నమ్మకం కులమే. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా తన కులం విజయవాడలో బలంగా ఉందని, అదే శ్రీరామ రక్ష అని రేణుకా చౌదరి భావన.
కమ్మ వాళ్ల రాజధానిగా పేరు గాంచిన అమరావతిని మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఆమె సీఎంపై ఆగ్రహంగా ఉన్నారు. రేణుకా చౌదరి ఆంధ్రాకు వచ్చి జగన్‌ను తిడుతుంటే, ఆమె సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఖుషీ అవుతున్నారు. అయినా రేణుకా చౌదరి తప్ప, ఆ స్థాయిలో జగన్‌ను ఎదుర్కొనే కమ్మ నేతలెవరూ లేరా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.