రియల్టర్లకు పండుగే పండుగ

అభివ్రుధ్ధి అంటే మొదట పండుగ చేసుకునేది రియల్టర్లే. నిజానికి వారే కేరాఫ్ అడ్రస్ కూడా. అది అమరావతి అయినా విశాఖ అయినా భూమి ఉన్న వారిదే బూమింగ్. రాజధాని విశాఖలో పెడతామని ఎపుడైతే వైసీపీ…

అభివ్రుధ్ధి అంటే మొదట పండుగ చేసుకునేది రియల్టర్లే. నిజానికి వారే కేరాఫ్ అడ్రస్ కూడా. అది అమరావతి అయినా విశాఖ అయినా భూమి ఉన్న వారిదే బూమింగ్. రాజధాని విశాఖలో పెడతామని ఎపుడైతే వైసీపీ సర్కార్ నుంచి ప్రతిపాదన వచ్చిందో నాటి నుంచే విశాఖలో రియల్టర్లు ఓ రేంజిలో హల్ చల్ చేస్తున్నారు.

ఎన్నడూ లేనిది జగన్ బర్త్ డే వేళ ఫ్లెక్సీలు పెట్టి మరీ సంబరాలు చేశారు. ఎక్కడ చూసినా జై జగన్ అంటూ కటౌట్లు పెట్టి హుషార్ చేశారు. చిత్రమేంటంటే వీరిలో మెజారిటీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉండడమే.

గతంలో వారంతా చంద్రబాబే నవ్యాంధ్ర సారధి, అభివ్రుధ్ధికి వారధి అంటూ తెగ ఊదరగొట్టిన బ్యాచ్ అంతా ఇపుడు జగన్ కి జై కొట్టడమే అసలైన ముచ్చట. ఇన్నాళ్ళూ ఉసూరుమన్న రియల్ వ్యాపారం ఒక్కసారిగా జగన్ ప్రకటనతో జోరందుకుంటోంది. విశాఖ భూములకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడుతోంది. బిజినెస్ లేక ఆగిన అపార్ట్మెంట్లు సైతం ఇపుడు పరుగులు తీసే అవకాశం కనిపిస్తోంది.

దాంతో వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి చుట్టూ చేరి తెగ సందడి చేస్తున్నారు. విశాఖలో రాజధాని అంటే ప్రభుత్వమే కళ్ళ మూందుకు వచ్చేసినట్లే. దాంతో గతంలో వైసీపీ అంటే పట్టించుకోని రియల్టర్లు, కాట్రాక్టర్లు సైతం ఇపుడు నాయకుల వెంట పడుతున్నారు.

పార్టీ ఆఫీసుల చుట్టూ చక్కరులు కొడుతున్నారు. విశాఖ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున‌ లే అవుట్లు వేసి ఈగలు తోలుకుంటున్న వారంతా మంచి రోజులు వచ్చేశాయని అంటున్నారు. మొత్తానికి కొత్త ఏడాది రాకముందే సంక్రాంతి పండుగ విశాఖకు వచ్చేసింది. ఇది ఒకరోజు పండుగ కాదు,  స్మార్ట్ సిటీకి ప్రతీ రోజు పండుగేనని అంటున్నారు. మొత్తానికి జగన్ రియల్టర్లకు రియల్ హీరోగా కనిపిస్తున్నారట.