ఒకటేమో సిఎఎ, ఇంకోటేమో ఎన్‌ఆర్‌సి, మరొకటేమో ఎన్‌పిఆర్.. దేశాన్ని ఇప్పుడు ఈ మూడు విషయాలూ ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఈ మూడు అంశాల్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓ పక్క, ఇవన్నీ మా ఘనతలే.. అని చెప్పుకుంటూనే, ఇంకోపక్క 'ఇవి మా విధానాలు కావు.. యూపీఏ విధానాలు..' అంటూ బుకాయిస్తోంది నరేంద్ర మోడీ సర్కార్. ఎందుకింతలా ఈ మూడు అంశాలపై ఇంత రచ్చ జరుగుతోంది.? ఇంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.!
ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టంగా మార్పు కన్పిస్తోంది. ఎన్‌ఆర్‌సిని పక్కన పెట్టింది.. సిఎఎ విషయంలోనూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అంతలోనే ఎన్‌పిఆర్‌ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ నుంచి ఎన్‌పిఆర్ పనులు ప్రారంభమవుతాయి. దేశ జనాభా గనన ఈ ఎన్‌పిఆర్ అసలు ఉద్దేశ్యం. 'ఎన్‌పిఆర్‌లో పేరు నమోదు చేసుకోనంతమాత్రాన దేశ ప్రజల పౌరసత్వానికి వచ్చిన సమస్య ఏమీ లేదు..' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెలవిచ్చారు తాజాగా.
దేశంలో గత కొద్దికాలంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితులకు కారణం ఎన్నార్సీ – సిఎఎ. వీటిల్లో మొదటిది ఇప్పటికే అస్సాంలో అమలు చేసేశారు. రెండోది ఈ మధ్యనే వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం. నిజానికి, ఎన్నార్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్) కంటే, సిఎఎకి వ్యతిరేకంగానే పెద్దయెత్తున ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఆ రెండినీ ఇప్పుడు ఎన్‌పిఆర్ (జాతీయ జన గనన)తో డైల్యూట్ చేయగలమన్నది కేంద్రం ధీమా.
'విపక్షాలు ప్రజల మెదళ్ళలో విష బీజాలు నాటాయి.. అందుకే సీఏఏ, ఎన్‌ఆర్‌సి గొప్పతనాన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారు..' అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ బుకాయింపులు కొనసాగిస్తూనే వున్నారు. సిఎఎకి మద్దతిచ్చి, ఎన్నార్సీ విషయంలో 'యూ టర్న్' తీసుకోవడమేంటి.? అంటూ అమాయకంగా కమలనాథులు ప్రశ్నిస్తోంటే, అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.
ఏదన్నా సంచలన నిర్ణయం తీసుకునే క్రమంలో ప్రజల్లో అపోహలు కలగకుండా చేయాలన్న 'ఇంగితాన్ని' విస్మరించడం వల్లే ఈ దుస్థితి. 'సంచలనం' మీద పెట్టిన శ్రద్ధలో సగం అయినా 'తదనంతర' పరిణామాలపై పెడితే.. ఈ స్థాయిలో కమలనాథులు, దేశ ప్రజల నుంచి వ్యతిరేకతని ఎదుర్కొనేవారు కారేమో.!