ఇండియాలో టెలీకాలర్ స్కామ్ ల లీలలు అన్నీ ఇన్నీ కావు. మీకు గిఫ్ట్ తగిలింది, మీకు లాటరీ తగిలింది.. అంటూ అమాయకులను ఎర వేసే వాళ్లతో మొదలుపెడితే, మీకు పర్సనల్ లోన్ కావాలా, మీకు ఓవర్ డ్రాఫ్ట్ అవకాశం ఉంది, మీకున్న లోన్ మీద లోన్ ఇస్తాం.. అంటూ కాల్స్ ప్రవాహం సాగుతూ ఉంటుంది. ఈ విషయంలో హద్దంటూ లేకుండా పోయింది. ఏదో రకంగా ఒక నంబర్ సంపాదించారంటే..ఆ నంబర్ వాడే వాడిని, పలకరించడంతో మొదలుపెట్టి.. వేధించి, విసిగించే వరకూ వదిలిపెట్టరు!
ఎక్కడైనా ఒక చోట క్రెడిట్ కార్డు కోసమనో, పర్సనల్ లోన్ విషయంలోనో నంబర్ ఇచ్చామంటే అంతే సంగతులు. ఒక్కసారి అలా నంబర్ ఎంటర్ చేస్తే.. ఆ తర్వాత అనేక బ్యాంక్ ల వాళ్ల నుంచి ఫోన్లు వస్తాయి, వస్తూనే ఉంటాయి. మొదట్లో ఓపికగా సమాధానాలు ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం ఆ ఓపికను నశింపజేసే వరకూ ఈ కాల్స్ ఆగవు. అరిచి చెప్పినా, తిట్టి చెప్పినా వినియోగదారుడి కంఠశోషే తప్ప… ప్రయోజనం ఉండదు!
మీరు టీవీ రీచార్జ్ చేయలేదు, మీరు ఇంటర్నెట్ రీచార్జ్ చేయలేదు అనే కాల్స్ కు కూడా లోటు ఉండదు. అనుదినం ఇదో టార్చర్ గా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కసారి ఇలా నంబర్ బయటకు వెళ్లిపోవడంతో బుక్ అయిన వారు.. రోజుకు మినిమం నాలుగైదు కాల్స్,పదుల కొద్దీ మెసేజ్ లను రిసీవ్ చేసుకోవాల్సిందే. ఈ విషయంలో కంపెనీలు తెలివి మీరిపోయాయి. పర్సనల్ నంబర్లు అనిపించే వాటి నుంచి కాల్స్ చేస్తూ వినియోగదారులను విసిగిస్తూ ఉన్నారు.
మరి ఈ వ్యవహారంలో ప్రపంచంలో మన స్థానం ఏమిటంటే.. నాలుగో స్థానమట. ప్రపంచంలో స్పామ్ కాల్స్ విషయంలో ఇండియాకు నాలుగో స్థానం దక్కుతూ ఉంది. మన కన్నా బ్రెజిల్, పెరు వంటి దేశాలు ముందున్నాయి. వినియోగదారుడి వ్యక్తిగతానికి ఏ మాత్రం విలువని ఇవ్వకపోవడమే ఈ స్పామ్ కాల్స్ పరమోద్దేశం అని చెప్పుకోవాలి. వ్యక్తిగత సమాచార గోప్యతను కూడా ఈ వ్యవహారం ప్రశ్నార్థకంగా నిలుపుతుంది.
ఇలాంటి కాల్స్ చేసుకోవడానికి కంపెనీలకూ నంబర్లను అమ్ముకోవడం కూడా ఒక బిజినెస్ అని కొన్ని సినిమాల్లో చూపించారు. అలాగే సోషల్ మీడియా సైట్లు కూడా.. యూజర్ల ఫోన్ నంబర్లను అమ్ముకుంటాయనే ప్రచారమూ ఉంది. సమాచారమే సంపద అనే యుగంలో.. ఈ స్పామ్ కాల్స్ దందాలో స్కాములు, యూజర్ల వ్యక్తిగత సహనానికి పరీక్ష తప్పదు.