రాయలసీమ ఉద్యమకారుల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా తయారైంది. తరతరాలుగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే ఆవేదన, ఆక్రోశం ఆ ప్రాంత ప్రజానీకంలో బలంగా ఉంది. అయితే ప్రజానీకంలో గూడుకట్టుకున్న ఆవేశాన్ని ఉద్యమంగా మలిచి, ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు సీమలో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
వేదికలపైకి ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధాసక్తులు, ప్రజలను చైతన్యవంతం చేయడంలో కొరవడ్డాయనే విమర్శలో సమంజసం ఉంది. ఒక వైపు అమరావతి రాజధానికి ప్రజా మద్దతు కూడగట్టేందుకు కార్పొరేట్ శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా రాష్ట్ర ప్రజల కోసమే అని నమ్మించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కానీ గతంలో పెద్ద మనుషులు చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు స్వయంగా జగన్ ప్రభుత్వమే ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ చేయాలని జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే ఆ అడుగులకు టీడీపీ నేతృత్వంలోని కార్పొరేట్ శక్తులు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల శక్తులను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజానీకంపై కూడా ఉంది. ప్రజలను సైనికులుగా మలచాల్సిన బాధ్యత ఉద్యమకారులపై ఉంది. ఆ పనికి సీమ ఉద్యమ నాయకులు నేతృత్వం వహించాల్సి ఉంది.
తమ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ అంశాల్ని గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలపై మాత్రమే ఉంది. తమకు అన్యాయం జరుగుతోందనే బాధ రాయలసీమలో బలంగా ఉంది. అయితే న్యాయం పొందాలంటే ఏం చేయాలనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్న వాళ్లలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది.
ఎవరికి వారుగా వ్యక్తిగతంగా, కొందరు చిన్నచిన్న వ్యవస్థలుగా పోరాటం చేస్తుండడం వల్ల దాని బలం, ప్రభావం బయటి సమాజానికి తెలియడం లేదు. రాయలసీమ ప్రయోజనాల రీత్యా ఆ ప్రాంతంలోని ఉద్యమకారులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. సీమ ఉద్యమకారులంతా వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థాన్ని వీడి తమ ప్రాంత శ్రేయస్సే ధ్యేయంగా సమరం సాగించాలి.
సీమకు ప్రతికూలంగా ఉండే శక్తులపై పోరాడాలంటే …ముందు తమలోని అహంకారాన్ని, స్వార్థాన్ని, అసూయ, ద్వేషాలను చంపుకోవాలి. అప్పుడే సీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. సీమ ప్రజా నీకాన్ని చైతన్యపరచడమే తక్షణ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఆ దిశగా ఆలోచిస్తే సీమ సమాజానికి మంచిరోజులు వచ్చినట్టే. లేదంటే సీమ ద్రోహులుగా పరాయి వాళ్లు కాదు… మనమే మొదటి వరుసలో నిలుస్తామని గుర్తించుకోవాలి.