వెలుగుజిలుగుల రంగుల ప్రపంచంలో క్రేజ్ లేకపోతే అడుగడుగునా అవమానాలు తప్పవు. అందుకే క్రేజ్ తగ్గిన చాలామంది హీరోలు, నటులు ఫంక్షన్లకు రారు. మునుపటి సత్కారం, గౌరవం లభించవనేది వాస్తవం. ఇప్పుడీ అంశాలపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. క్రేజ్ లేక తనను ఓ ఫంక్షన్ లో మొదటి వరస సీట్ నుంచి లేపేసి, వెనక కూర్చోబెట్టిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.
“ఓసారి ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వెళ్లాను. మొదటి వరసలో కూర్చోబెట్టారు. నన్ను మొదటి వరసలో కూర్చోబెడతారని నేను అస్సలు అనుకోలేదు. కానీ అంతలోనే ఓ పెద్ద స్టార్ వచ్చాడు. అంతే, నన్ను లేవమన్నారు, వెనక్కి వెళ్లి కూర్చోమన్నారు. వెనక్కు వెళ్లి కూర్చున్నాను.”
రంగుల లోకంలో ఇదంతా కామన్ అంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఇలాంటి విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదని, మరింత కష్టపడాలని నిద్రపోయే ముందు మనకు మనం చెప్పుకోవాలని అంటున్నాడు. ఇక సినిమాల్లో, షూటింగ్ లొకేషన్లలో జరిగిన అవమానాలకు కొదవ లేదంటున్నాడు ఈ హీరో.
“చాలా సినిమాల్లో నన్ను తప్పించారు. కొన్ని సినిమాల నుంచి చెప్పకుండా తీసేసిన సందర్భాలూ ఉన్నాయి. సినిమా షూటింగ్ వెళ్తే, అక్కడ మరో నటుడితో షూటింగ్ జరుగుతుంటుంది. సైలెంట్ గా అక్కడ్నుంచి తప్పుకోవడమే. ఆ సినిమా నుంచి తప్పించామని తర్వాత చెబుతారు. మనం చెప్పేది వాళ్లు వినరు, అది సర్వసాధారణం.”
కెరీర్ లో ప్రతి నటుడికి ఈ దశ ఉంటుందని అంటున్నాడు అభిషేక్. తన తండ్రి అమితాబ్ బచ్చన్ ను కూడా ఈ దశ ఉందని, దాన్ని తను ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడు స్టార్ డమ్ చూడడం లేదు, సిల్వర్ స్క్రీన్ చూడడం లేదు. నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. రోజులు గడిచేకొద్దీ ఓ నటుడిగా మన స్థాయి ఏంటనేది మనం చేసే పాత్రలే నిర్ణయిస్తాయని నమ్ముతున్నాడు బిగ్ బి తనయుడు.