‘ఉచితాలు’ కాదు భవిష్యత్ తరానికి పెట్టుబడులు! : జగన్

పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతోంటే.. విపక్షాలు వాటిని విమర్శిస్తుంటాయి. విపక్షాలు, మేధావులు అని చెప్పుకునే వారు ‘ఉచితాలు’ అంటూ విమర్శించేవి.. భవిష్యత్ తరాలకోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులు అని ఏపీ…

పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతోంటే.. విపక్షాలు వాటిని విమర్శిస్తుంటాయి. విపక్షాలు, మేధావులు అని చెప్పుకునే వారు ‘ఉచితాలు’ అంటూ విమర్శించేవి.. భవిష్యత్ తరాలకోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి గానీ.. తనకు ఎప్పటికైనా రాష్ట్రప్రయోజనాలు మాత్రమే ప్రధమ ప్రాధాన్యం అని అంటున్నారు. విశాకలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో… ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అనేక వివరాలు వెల్లడించారు. 

ఆయన మాటల్లోనే.. చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ కు వస్తున్నారని, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వగలదు అనేదాన్ని బట్టి.. పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఏర్పడుతుంది. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి పెట్టుబడిదార్ల సదస్సులను నిర్వహిస్తుంటాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు అనేక సానుకూల అంశాలున్నాయి. 

ఏపీలో 974 కిమీల అతిపెద్ద సముద్రదీరం ఉంది. ఆరు ఓడరేవులు అందుబాటులో ఉన్నాయి. మరో నాలుగు నిర్మాణం అవుతున్నాయి. భూవనరులు, ఖనిజ సంపద, నిరంతరాయ విద్యుత్తు వంటి అదనపు వసతులు ఉన్నాయి. మేం ప్రభుత్వంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.  ఈ సదస్సు ద్వారా.. రాష్ట్రంలో లైమ్ స్టోన్ లభ్యత అధికంగా ఉన్న దృష్ట్యా సిమెంటు రంగంలో ఎక్కువ పెట్టుబడులు రావడానికి కూడా అవకాశం ఉంది. 

మేం అధికారంలోకి వచ్చే నాటికే 2.71 లక్షల కోట్ల అప్పు భారం ఖజానాపై ఉంది. 2014 నాటి పరిస్తితిలో పోలిస్తే అది 139 శాతం పెరిగింది. అప్పట్లో అప్పుల పెరుగుదల రేటు 19.05 శాతంగా ఉంది. మా ప్రభుత్వం వచ్చాక తక్కువ అప్పులు తీసుకోవడం వల్ల.. 68 శాతం మాత్రమే పెరిగాయి. అప్పుల వృద్ధి రేటు 13.5 శాతం మాత్రమే. ప్రస్తుతం 4.42 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఆర్థికంగా రాష్టం ఎంతో అప్రమత్తంగానే ఉంది. మేం తీసుకుంటున్న అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్‌బిఎం పరిమితులకు లోబడే ఉంటున్నాయి. 

‘ఉచితాలు’ అనే పదం కరెక్టు కాదు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలను మీరు ‘ఉచితాలు’ అని పిలుస్తున్నారు. కానీ అవి భవిష్యత్ తరాలకు పెట్టుబడులు. స్కూళ్లు, కాలేజీల్లో గణనీయమైన అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీబీఎస్ఈ ఆధారిత ఇంగ్లిషు మీడియం చదువులు పిల్లలకు ప్రాథమిక పాఠశాల దశనుంచే అందుతున్నాయి. చదువుల్లో పిల్లల ప్రస్థానం హాయిగా, అవాంతరాల్లేకుండా సాగడానికే మేం ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. తద్వారా.. కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి ఉపయోగపడగల నైపుణ్యాల వనరులను తయారుచేస్తున్నాం.

అలాగే ప్రజల ఆరోగ్యభద్రత బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటోంది. రైతులకు విత్తనాలు అందించడం ద్వారా.. వారు పంట దిగుబడి మొత్తం అమ్ముకోడానికి ప్రభుత్వం తోడ్పడుతోంది. వీరికి అందే లబ్ధి యావత్తూ నేరుగా వారికే చెందుతోంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందుతోంది. ఈ పథకాలన్నీ కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ముడిపడినవే. మేం చేస్తున్నదల్లా.. మానవ వనరులపై పెట్టుబడి మాత్రమే. ఇవన్నీ కూడా ఉచితాలే అని అనేట్లయితే.. మేం 11.43 శాతం వృద్ధిని ఎక్కడినుంచి నమోదు చేయగలుగుతున్నాం.

ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని దిద్దుబాటు చర్యలు జరుగుతూనే ఉంటాయి. నా తొలిప్రాధాన్యం.. విద్యారంగం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను సమూలంగా అభివృద్ధి చేయడమే. కేంద్రం తీసుకువచ్చే కొన్ని బిల్లులకు మద్దతిస్తున్నట్టుగానే, కొన్నింటిని వ్యతిరేకిస్తున్నాం కూడా. ఏం చేసినా సరే.. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మాకు లక్ష్యంగా ఉంటున్నాయి. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా అనేది రాజకీయ నిర్ణయం. ఏదో ఒకనాటికి కార్యరూపం దాలుస్తుంది. ఈ అంశాన్ని మేం విడిచిపెట్టేది లేదు. సజీవంగానే ఉంచుతాం.

రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి .. ప్రతి పార్టీ కూడా ప్రజలకు చేరువ కావడానికి తమకు ఏది మంచిదనిపిస్తే అది చేస్తుంటుంది. నేను కూడా ప్రజలకు చేరువ కావడానికి గతంలో ప్రజాసంకల్ప యాత్ర చేశాను.