సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, వలసలకు వేళైంది. ఈ నేపథ్యంలో టీడీపీలో సీపీఎం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చంద్రబాబుతో గఫూర్ చర్చలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం.
గత కొంత కాలంగా ఏపీ సీపీఎం అగ్రనాయకత్వంపై గఫూర్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. వైసీపీ వ్యతిరేక, ఇదే సందర్భంలో టీడీపీ అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారు. 2004లో కర్నూలు నుంచి ఆయన సీపీఎం తరపున తన సమీప ప్రత్యర్థి టీడీపీ నాయకుడు టీజీ వెంకటేశ్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ తరపున టీజీ పోటీ చేసి, గఫూర్‌ను ఓడించారు.
సీపీఎం, ఆ పార్టీ అనుబంధ సంస్థల్లో గఫూర్ క్రియాశీలకంగా పని చేశారు. ఒక దశలో ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వైఖరితో గఫూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు.
అయితే టీడీపీ అనుకూల చానళ్లలో నిత్యం డిబేట్లలో పాల్గొంటూ, చంద్రబాబునాయుడు నాయకత్వంపై సానుకూలమనే సంకేతాల్ని పంపారు. కర్నూలులో మైనార్టీ ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. గఫూర్‌ను చేర్చుకోవడం వల్ల తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చంద్రబాబు భావన. దీంతో గఫూర్‌ను చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
అయితే టీడీపీలో చేరిక ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. కానీ టీడీపీలో గఫూర్ చేరిక మాత్రం పక్కా.