రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను బలి పెట్టడమే చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే బలమైన విమర్శ వుంది. తాజాగా ఆ విమర్శకు బలం చేకూర్చేలా ఆ పార్టీ ముఖ్య నేతల కామెంట్స్ ఉన్నాయి. పాదయాత్రలో భాగంగా లోకేశ్ ఏమన్నా రంటే… ‘శాసనసభ సాక్షిగా నా తల్లిని అత్యంత దారుణంగా అవమానించారు. నా తల్లి కోలుకునేందుకు ఆరు నెలలు పట్టింది. వైసీపీ కుక్కలు మహిళల జోలికొస్తే నాకు చెప్పండి. ఆ కుక్కల తోలు తీస్తా. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొట్టండి’ అని లోకేశ్ అన్నారు.
మహిళలను బలి పెట్టడంలో తండ్రీతనయుడు ఇద్దరూ ఇద్దరే అని చెప్పక తప్పదు. నాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. నేడు నారా భువనేశ్వరిని రాజకీయంగా బలి పెట్టేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. భువనేశ్వరికి సంబంధించి సున్నితమైన అంశాల్ని పదేపదే చంద్రబాబు, లోకేశ్ గెలకడం వెనుక దురుద్దేశం ఏంటో అర్థం చేసుకోలేని దయనీయ స్థితిలో జనం లేరు.
అయ్యో, చంద్రబాబు భార్య లేదా లోకేశ్ తల్లి ఆరు నెలల పాటు నిద్రాహారాలు మాని, మంచం పట్టిందని మాట్లాడుకోవాలని యువనాయకుడు ఆశిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఎందుకూ అంటే… మళ్లీ ఆ నీచమైన విషయాల్ని చర్చించుకున్నా ఫర్వాలేదని లోకేశ్ అనుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాడు లక్ష్మీపార్వతిపై నెగెటివిటీని పెంచడం ద్వారా, తనకు సానుకూల వాతావరణాన్ని సృష్టించుకునేందుకు చంద్రబాబు వ్యూహం పన్నారు. నేడు తన భార్యపై పాజిటివిటీని జనంలో క్రియేట్ చేసుకుని, దాన్ని తమ రాజకీయ ఉన్నతికి వాడుకోవాలని దుర్మార్గ ఎత్తుగడకు పాల్పడ్డారనేది బహిరంగ రహస్యమే.
కనీసం తన తల్లి గౌరవమర్యాదల్ని కాపాడాలనే ధ్యాస లోకేశ్‌లో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. చంద్రబాబుకు పదవి తప్ప, తల్లి, భార్య, మామ తదితర సెంటిమెంట్లు ఏవీ లేవని అంటుంటారు. బాబు రాజకీయ చరమాంకంలో ఉన్నారు. కనీసం ఆయన కుమారుడికైనా కొన్ని సుగుణాలు వస్తాయని ఆశించారు. అబ్బే… చంద్రబాబే మేలనే రీతిలో లోకేశ్ నడుచుకుంటున్నారు.
శాసనసభలో తన తల్లికి అవమానం జరిగిందని, ఆమె కోలుకోడానికి ఆరు నెలల సమయం పట్టిందని లోకేశ్ చెప్పడం వెనుక దురుద్దేశం… ఆ రకంగా మహిళల సానుభూతి పొందాలనుకోవడమే.
రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు లక్ష్మీపార్వతిని నెగెటివ్ కోణంలో చూపారు. ఇప్పుడు భువనేశ్వరిని పాజిటివ్ కోణంలో చూపాలని చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. అంతిమ లక్ష్యం మాత్రం… సీఎం పీఠాన్ని దక్కించుకోవడమే. అందుకు ఏ మహిళనైనా, ఎంత దగ్గరి వాళ్లనైనా బలిపెట్టడానికి వెనుకాడేది లేదని చంద్రబాబు, లోకేశ్ తమ మాటల ద్వారా చెబుతున్నారు. అర్థం చేసుకోవాల్సింది ప్రజలే.