గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
రైలు ప్రమాదం నుండి బయటపడిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. పెద్ద సౌండ్ వచ్చిందని, ఏమైనా భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 250 మంది ప్రయాణికులను అధికారులు రక్షించి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలు.. అథెన్స్ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కార్గో రైలును వేగంతో ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది గ్రీస్ ప్రభుత్వం.