జనసేనాని పవన్‌కల్యాణ్ మొదలుకుని, ఆ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తుంటారు. తమ వీపు వెనుక ఏం జరుగుతున్నదో చూసుకోరు. కానీ ఎదుటి వాళ్లకు మాత్రం చాలా నీతులు బోధిస్తుంటారు. పవన్‌కల్యాణ్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం ఓట్ల కోసం చంద్రబాబు, లోకేశ్ వాళ్లపై ప్రేమ నటిస్తుంటారు. మనసు లోపల ఏమన్నా, పైకి మాత్రం తమతో బాగుంటే చాలునని జనసేన నేతల భావన.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై జనసేన నాయకులు ఈగ వాలనివ్వరు. కానీ అధికార పార్టీపై మాత్రం జనసేన నాయకులు కత్తులు నూరుతుంటారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ వైసీపీ ఎంపీలపై మండిపడడం గమనార్హం. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును చూసి పోరాటం ఎలా చేయాలో నేర్చుకోవాలని వైసీపీ ఎంపీలకు పోతిన హితవు చెప్పారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో చలికి రగ్గులు కప్పుకుని నిద్రపోవద్దని, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్తే పోరాటం ఎలా చేయాలో చెబుతారని హితవు పలికారు.
మనం ప్రజల కోసం పనిచేయాలి గానీ.. ఒకరి మెప్పు కోసం కాదని రఘురామ నుంచి గ్రహించాలని జనసేన నాయకుడు చెప్పడం విశేషంవ. వైసీపీ ఎంపీలు ఇకనైనా మేల్కొని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో గళం విప్పాలని మహేష్ కోరారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నుంచి నేర్చుకోవాల్సిందేమీ లేదా అని పోతిన మహేశ్ నెటిజన్లు సెటైర్లు విసరడం గమనార్హం. రాజోలు నుంచి జనసేన తరపున ఒకేఒక్క ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక వరప్రసాద్ అందరి దృష్టిని ఆకర్షించారు. పవన్‌కల్యాణ్ సహా ఆ పార్టీ తరపున అభ్యర్థులంతా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
పార్టీతో విభేదించి ఇతరులతో అంటకాగే ప్రజాప్రతినిధులను తెరపైకి తేవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పు పడుతోంది. ముందు తమ ఇంటిని జనసేన చక్కదిద్దుకుంటే మంచిదని వైసీపీ నేతలు హితవు చెప్పడం విశేషం. ఒకే ఒక్క ఎమ్మెల్యేనూ కూడా నిలుపుకోలేరు కానీ నీతులు చెప్పడంలో మాత్రం జనసేన నేతలు ముందుంటారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.