మిగిలిన విషయాలు ఎలా వున్నా, తెలుగు సినిమాలు ఎప్పటికి అప్పుడు తన స్టామినాను నిరూపించుకుంటూనే వుంటుంది. చాటుతూనే వుంటుంది. పెద్ద హీరోల సినిమాలు ఏవి వచ్చినా కోట్లకు కోట్లు తొలి రోజు కలెక్షన్లు వస్తూనే వుంటాయి. అదే తెలుగు సినిమా స్టామినా.
కరోనా ఫేజ్ వన్, టూ కారణంగా టాప్ హీరోల సినిమాలు అన్నీ అలా పేరుకుపోయాయి. చిన్న మీడియం సినిమాలు అన్నీ కరోనా నేపథ్యంలో కూడా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు మాత్రమే రంగంలో మిగిలాయి.
బాలయ్య అఖండ వచ్చింది. మాంచి హడావుడి ఓపెనింగ్. ఎక్కడ లేని హుషారు వచ్చింది టాలీవుడ్ కు. పుష్ప విడుదలయింది. కరోనా ముందు కాలాన్ని గుర్తు చేసింది. థియేటర్ల దగ్గర సందడి సంక్రాంతి పండగను తలపించింది. తొలి రోజు వసూళ్లు కుమ్మేసాయి.
టికెట్ రేట్లు లేని ఆంధ్రలో కూడా మంచి అంకెలే కనిపించాయి. పైగా కోర్టు ఆదేశాల ప్రకారం చాలా థియేటర్లలో రెండోరోజు నుంచి 250 రూపాయల రేటు ఫిక్స్ చేసారు. దాని వల్ల ఇంకా మంచి అంకెలు కనిపించే అవకాశం వుంది.
ఈ లెక్కన చూసుకుంటే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లు వచ్చినపుడు థియేటర్లు ఇంకా కళకళలాడతాయి. ఆపైన ఆచార్య, భీమ్లానాయక్ వుండనే వున్నాయి. తెలుగు పెద్ద సినిమాల మార్కెట్ తెలుగురాష్ట్రాల్లో కనీసం వంద కోట్లకు చేరిపోయింది. ఈలెక్కన హీరోల పారితోషికాల, ఇంకా పెరుగుతాయేమో?