కేసీఆర్ కు ఎన్నికల అస్త్రం దొరికేసినట్టే..!

టైమ్, టైమింగ్ ను పక్కాగా నమ్ముతారు కేసీఆర్. సరైన టైమ్ వచ్చిందనుకున్నప్పుడు ఆయన మరో ఆలోచన లేకుండా ముందస్తుకు వెళ్తారు. అయితే అలా వెళ్లాలంటే ఏదో ఒక సెగ లేదా సెంటిమెంట్ ను రగల్చడం…

టైమ్, టైమింగ్ ను పక్కాగా నమ్ముతారు కేసీఆర్. సరైన టైమ్ వచ్చిందనుకున్నప్పుడు ఆయన మరో ఆలోచన లేకుండా ముందస్తుకు వెళ్తారు. అయితే అలా వెళ్లాలంటే ఏదో ఒక సెగ లేదా సెంటిమెంట్ ను రగల్చడం ఆయనకు ఆనవాయితీ. దాన్నే పొలిటికల్ టైమింగ్ అంటారు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ టైమ్, టైమింగ్ రెండూ సెట్ చేసినట్టు కనిపిస్తోంది.

కిందటిసారి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్, మహాకూటమిని టార్గెట్ చేశారు. చంద్రబాబును మరోసారి కార్నర్ చేశారు. స్థానికత సెంటిమెంట్ ను రగిల్చారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే, చంద్రబాబు మరోసారి తెలంగాణపై స్వారీ చేస్తారని ఊదరగొట్టారు. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే.. చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చిపడేశారు. కేసీఆర్.

ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో, అదే టైమ్ లో తెలంగాణలో బీజేపీ బలపడింది. కేంద్రం అండదండలు పుష్కలంగా ఉండడం, 2 స్థానాల్లో గెలుపు వరించడంతో కేసీఆర్ కు పక్కలో బల్లెంలా మారింది. దీంతో రాబోయే ఎన్నికలకు బీజేపీని టార్గెట్ చేశారు కేసీఆర్. ఎక్కడ దొరుకుందా అని టైమ్ కోసం ఎదురుచూశారు. ధాన్యం కొనుగోలు అంశంతో ఆ టైమ్ రానే వచ్చింది. ఇక అక్కడ్నుంచి సెగను ఎగదోశారు ముఖ్యమంత్రి.

మొన్నటివరకు ధాన్యం కొనుగోలు అంశాన్ని కేవలం ఓ వివాదం లేదా సమస్యగా మాత్రమే చూశారంతా. కానీ కేసీఆర్, చాకచక్యంగా దానికి రాజకీయ రంగు పులిమారు. మొత్తం అంశానికి, బీజేపీతో ముడిపెట్టారు. విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ''ఇక బీజేపీనే నా టార్గెట్'' అని విస్పష్టంగా ప్రకటించారు. సో.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే, ఆయన ప్రధాన ఎన్నికల అస్త్రం ఇదే కానుందనేది ఇప్పుడు అందరి మాట.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై దశలవారీగా పోరాటం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బీజేపీతో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. మొన్నటివరకు కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి మరో ముగ్గురు-నలుగురు మాత్రమే బీజేపీపై విమర్శలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ సూచనలతో మొత్తం శ్రేణులన్నీ రాష్ట్ర/కేంద్ర బీజేపీపై బాణాలు ఎక్కుపెట్టాయి.

ఈ నెల 20 నుంచి తెలంగాణలో బీజేపీకి చావుడబ్బు కొడతామని బాజాప్తా ప్రకటించారు ముఖ్యమంత్రి. దిష్టిబొమ్మలు దగ్దం చేయడం నుంచి మొదలుపెట్టి, ఉద్యమంలో వాడిన అన్ని రకాల ఎత్తుల్ని కేంద్రంపై ప్రయోగించాలని అధికారికంగా నిర్ణయించారు. దీన్ని 'ముందస్తు'కు సమరశంఖంగానే భావిస్తున్నారు రాజకీయ నిపుణులు.

కేసీఆర్ రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు ఊపిరిసలపనివ్వరు. రాజకీయ పరిణామాలన్నీ గుక్కతిప్పుకోకుండా వరుసపెట్టి చకచకా మారిపోతుంటాయి. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ వ్యూహాల్ని బీజేపీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆయన ఎత్తులకు పైఎత్తులు వేయాలని నిర్ణయించుకుంది. కేసీఆర్ మనసులో ముందస్తు ఆలోచన ఇలా మెదలగానే, అలా తమకు తెలిసేలా తెరవెనక అన్ని ఏర్పాట్లు చేసిపెట్టుకుంది కమలదళం.

బహుశా, ఈసారి కేసీఆర్ కు స్థానికత అంశం కలిసిరాకపోవచ్చు. ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ రాజుకోకపోవచ్చు. ఇక మిగిలింది కేంద్రంపై డైరక్ట్ ఎటాక్ మాత్రమే. దానికి పునాదే ఎల్లుండి నుంచి తెలంగాణవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా జరగనున్న నిరసన ప్రదర్శనలు.