విశాఖ మీద ఎందుకో కాస్తా దేవుడు దయ చూపినట్లున్నాడు. అందుకే విశాఖ ఎయిర్ పోర్ట్ స్వల్ప లాభాలతో ఒడ్డున పడింది. అది కనుక జరగకపోయి ఉంటే ఎయిర్ పొర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ షాక్ విశాఖ అంతర్జాతీయ విమాశ్రయానికి కూడా గట్టిగా తగిలేదని అంటున్నారు.
విశాఖ విమాశ్రయం గత కొంతకాలంగా స్వల్పంగా అంటే 2.29 కోట్ల లాభాలను మాత్రమే గడించింది. అంటే తృటిలో బతికిపోయిందన్న మాట. అదే టైమ్ లో రాష్ట్రంలో మిగిలిన అయిదింటిలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేయడానికి ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా చురుకుగా సన్నాహాలు చేస్తోందిట.
ఈ విమానాశ్రయాల వల్ల నష్టాలు ఏకంగా కోవిడ్ విపత్తు తరువాత రెండు వందల కోట్ల దాకా ఏటా వస్తున్నాయని అంచనా వేసి మరీ పీపీపీ పద్ధతిలో యాభై ఏళ్ల పాటు ప్రైవేట్ పరం చేయనున్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా 136 విమానాశ్రయాలు కలిగి ఉంటే అందులో 25 ఎయిర్ పోర్టులను 2025 నాటికి పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. అందులో ఒక్క ఏపీలోనే మూడు ఉండడం విశేషం. ఇందులో తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ హోదా కలిగిన విమానాశ్రయాలు కావడం గమనార్హం.
ఏది ఏమైనా విశాఖ ఈ లిస్ట్ లో లేకపోవడం కొంతలో కొంత ఊరట అంటున్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ దిశగా నడిపిస్తూ జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. అదే టైమ్ లో ఎయిర్ పోర్టు కూడా ప్రైవేట్ పరం అయితే విశాఖ బాధ వర్ణనాతీతమే అని చెప్పాలి.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలోని పోర్టులను, ఎయిర్ పోర్టులను ప్రైవేట్ పరం చేయడం పైన పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వామపక్షాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.