అమరావతి సభకు వెళ్లాలని మనసు తహతహలాడుతోందని, అయితే తమ పార్టీ వాళ్ల ప్రోద్బలంతో తనను కొడ్తారనే భయాన్ని గత రెండు రోజులుగా వెల్లడిస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు…ఎట్టకేలకు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు.
తిరుపతికి వెళ్లనని పదేపదే చెప్పడం వెనుక …ఆయన భయంతో కూడిన ఎత్తుగడ కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై ప్రత్యర్థుల దృష్టి మరల్చేందుకు రఘురామకృష్ణంరాజు వ్యూహాత్మకంగా గత రెండురోజులుగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విడుదల, వీల్‌చైర్‌పై ముఖ్య నాయకుల వద్దకు చక్కర్లు కొడుతూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అద్భుతహః అనిపించింది. ఏపీ సీఐడీ సత్కారంతో అమాంతం ఆయన క్రేజ్ పెరిగిందని ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది. ఎలాగైనా ఆయన్ను చూడాలని, స్పీచ్ వినాలనే బలమైన కోరికతో అమరావతి రాజధాని మద్దతుదారులున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
అయితే తనకూ అభిమానుల్ని చూడాలని ఉందని, కానీ కొడ్తారనే భయాన్ని నాటకీయంగా వ్యక్తపరుస్తూ వచ్చారు. తిరుపతిలో అమరావతి సభకు రఘురామ రారనే సమాచారంతో చాలా మంది అక్కడికి వెళ్లడం మానుకున్నారనే ఆందోళన ఆధ్యాత్మిక నగరంలో కనిపిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆయన ఆకాశం నుంచి రేణిగుంట విమానాశ్రయంలో దిగారు.
ఆయనకు అమరావతి జేఏసీ ఘన స్వాగతం పలికింది. రఘురామ మీడియాతో మాట్లాడుతూ ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి ఎవరూ మాట్లాడే వారు ఉండరన్నారు. వందశాతం అమరావతే రాజధానిగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి వైసీపీ శ్రేణుల కన్నుగప్పి ఆయన తిరుపతి చేరుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రఘురామా…మజాకా!