ఇది ‘‘ఎలైవ్’’ 1996 నవంబరు సంచికలో ప్రచురించబడిన నా ‘‘ద కంపానియన్’’ అనే ఆంగ్లకథకు స్వీయానువాదం. కథ చదువుతూండగా యిదేదో డబ్బింగు సినిమా కథ కాపీకొట్టి రాసినట్లు ఉందే అని తోచినా, చివరిదాకా చదివేయండి. ఆఖర్లో కథకు స్ఫూర్తి నిచ్చిన విషయాల గురించి రాస్తాను.
సుమన్ నిశ్చితార్థం యింకో వారంలో అనగా మహదేవ్ సాఠేకు గుండె పోటు వచ్చింది. ఆసుపత్రిలో మూడు రోజులకు మించి ఉండనక్కరలేక పోయినా సుమన్ స్థయిర్యం చెదిరింది. తనకు పెళ్లయి వెళ్లిపోయాక తండ్రికి తోడెవరుంటారు? అనే చింత పుట్టుకువచ్చింది. ఆసుపత్రి నుంచి తిరిగి రాగానే నిశ్చితార్థం పనులు ఎంతవరకు వచ్చాయని తండ్రి అడిగినప్పుడు తను ‘దాని గురించి వర్రీ కాకండి, కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు. ముందు నీ ఆరోగ్యం కుదుటపడనీ..’’ అంది. ‘‘అబ్బెబ్బే, ఒక మంచి ముహూర్తం అనుకున్నాక వాయిదా వేయడం దేనికి? అనుకున్న దాని ప్రకారం కానిద్దాం. నా గురించి భయపడాల్సిందేమీ లేదు. పనివాడు చందూ ఉన్నాడుగా.’’ అన్నాడు సాఠే.
‘‘తాంబూలాలు తీసుకోవడం నెలో, రెండు నెలలో ఆలస్యమైనంత మాత్రాన కొంపలంటుకోవు. దానికి ముందు చక్కబెట్టవలసిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయ్’’ అంది సుమన్. సాఠే భృకుటి ముడిపడింది. ‘‘ఏమిటా వ్యవహారాలు?’’ అని అడిగాడు. సుమన్ తడబడింది. ‘‘.. అదే నీ గురించి, నీ ఆరోగ్యపరిస్థితి యిలా ఉండగా మిమ్మల్ని ఒకర్నీ వదిలేసి ఎలా వెళ్లగలను?’’ సాఠే నవ్వాడు. ‘‘పిచ్చిపిల్లా, వయసు వచ్చాక యిలాటివి సహజం. దాని కోసం పెళ్లి మానేసి యింట్లోనే కూర్చుంటావా? నాతోనే ఎల్లకాలం ఉండిపోతావా?’’ ‘‘అమ్మ ఉండుంటే, ఫర్వాలేక పోయేది..’’ అంది సుమన్ నానుస్తూ.
‘‘బాగుంది, అది నిన్నామొన్నా జరిగిన సంగతా, బేబీ? నీకు ఎనిమిదేళ్ల వయసులో తను పోయింది. అప్పణ్నుంచి ఎలాగోలా బండి లాక్కుని వచ్చేస్తున్నాంగా. ఇక మీదా అలాగే నడుస్తుంది.’’ అంటూ తేల్చేశాడు సాఠే. ‘‘ఇన్నాళ్లూ యిద్దరం నడుపుకుంటూ వచ్చేశాం. ఇక మీద నువ్వు ఒక్కడివే ఉంటావు. ఎలాగా అని నా వర్రీ.’’ ‘‘ఏడిచినట్టుంది. నాకేమైనా అవసరం పడితే ఓ ఫోన్ కొడతాను. బాంబేలో మీ అత్తారింటి నుంచి పూనా రావడం ఎంతసేపు కనుక? ప్రతీ తండ్రికి యీ అవస్థ తప్పదు. నువ్వు విఠల్‌కు ఫోన్ చేసి, అంతా అనుకున్న ప్రకారమే జరుగుతుందని చెప్పు.’’ అంటూ అక్కణ్నుంచి లేచి వెళ్లిపోయాడు సాఠే. సుమన్ విఠల్‌కు ఫోన్ చేసింది కానీ తండ్రి చెప్పమన్నట్లు చెప్పలేదు. ‘‘మా నాన్న ఆరోగ్యం కుదుట పడేదాకా ఫంక్షనుండదు.’’ అని చెప్పింది. తండ్రితో వాళ్లే కాస్త ఆగితే మంచిదన్నారని చెప్పింది. ఆనక విషయం బయటపడినా విఠల్ ఏమీ అనుకోడన్న ధీమా ఆమెది.
బొంబాయిలో పని చేస్తున్న విఠల్ తన కజిన్ పెళ్లికి పూనాకు వెళ్లినపుడు అతను తన క్లాస్మేట్ అంటూ సుమన్‌ను పరిచయం చేశాడు. త్వరలోనే అది ప్రణయం, పరిణయ ప్రతిపాదన దాకా వచ్చింది. అతని తలిదండ్రులు, సుమన్ తండ్రి కూడా ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో సాఠే గుండెపోటు సుమన్‌ను చింతకు గురి చేసింది. తల్లి మరణం తర్వాత సుమన్ తండ్రికి బాగా దగ్గరైంది. ఆయన తన ఆఫీసు వ్యవహారాలన్నీ కూతురితో చెప్పేవాడు. ఆమె తన స్కూలు, కాలేజీ గొడవలన్నీ తండ్రితో చెప్పేది. ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లు. ఆయన రిటైరైపోయిన తర్వాత పూర్తిగా సుమన్తోనే కాలక్షేపం చేసేవాడు. ఆమె కూడా ఏ ఉద్యోగం చేయకుండా యింటిపట్టునే వుండడంతో యిద్దరూ కలిసి కారమ్స్, చెస్ ఆడుకోవడం, కలిసి టీవీలో సినిమాలు చూడడం, ఊళ్లు తిరగడం.. యిలాగే సమయం గడిపేవారు. సుమన్ దిగులుగా ఉండడం ఆయనకు నచ్చలేదు. ఏమైందని అడిగాడు.
‘‘నాన్నా, నేను వెళ్లిపోయిన తర్వాత నీకు టైమెలా గడుస్తుంది? రిటైరై పోయావు. నువ్వు లాయరువో, డాక్టరువో, వ్యాపారివో అయితే చివరిదాకా పని చేసేవాడివి. ఇప్పుడెలా?’’ అని అడిగింది. ‘‘చెప్పానుగా, నాకు డబ్బు అవసరం లేదు. మరీ కష్టపడనక్కరలేదు. ఏదైనా సామాజిక సేవా సంస్థలో చేరి రోజూ ఓ రెండు, మూడు గంటలు వెళ్లి వస్తాను. ఇంట్లో తోటపని ఎలాగూ ఉంది. ఏడాదిగా నీ పెళ్లి సంబంధాలు చూడడంలో బిజీగా ఉన్నాను. ఈ మధ్యే మా ఫ్రెండ్స్ కొందరు కలిసి వ్యాపారం పెడదామా అంటున్నారు…’’
‘‘ఇవన్నీ అంతకుముందు అనుకున్నవి. ఇప్పుడీ హార్ట్ ఎటాక్ తర్వాత జరిగే పనా?’’
‘‘నువ్వు మరీ హంగామా చేయకు. వచ్చే నెల యీ పాటికి మామూలుగా అయిపోతాను. అయినా నాకు వేరే ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పు. ఎవరైనా బంధువుల కుర్రాడిని వచ్చి సాయంగా నాతో ఉండమంటే ఉంటాడా? ఇన్నాళ్లూ మనం ఎవరికీ సాయం చేసి యింట్లో పెట్టుకోలేదు. మనిద్దరమే చాలు అన్నట్లుగా మనలోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు మన అవసరం కొద్దీ రమ్మంటే ఎందుకు వస్తారు? నేనే ఏదోలా పొద్దు పుచ్చే మార్గం చూసుకోవాలి. అవును, యివన్నీ సడన్‌గా యిప్పుడెందుకు మాట్లాడుతున్నావు?’’
‘‘సడనేమీ కాదు, మనసులో ఎప్పణ్నుంచో మెదులుతోంది. కానీ నా పెళ్లి ఎవరితో జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా చెయ్యాలి, పెళ్లయ్యాక సంసారం ఎలా ఉంటుంది అనే ఆలోచనల్లో పడి కాస్త మరుపున పడింది. యిప్పుడీ ఎటాక్ రావడంతో నీ సంగతేమిటా అనే వర్రీ పట్టుకుంది. నీకు ఎవరో ఒకరు తోడుండాలి. అంటే ఆయానో, నర్సో కాదు. వాళ్ల అవసరం యిప్పుడే కాదు. నేనూ నువ్వూ కబుర్లు చెప్పుకున్నట్లు, భావాలు పంచుకున్నట్లు, ఎమోషనల్‌గా ఎటాచ్ అయినట్లు అలాటివాళ్లు ఉండాలి. నా వయసు వాళ్లు ఎవరినైనా పేయింగ్ గెస్ట్‌గా పెట్టుకున్నా కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు కదా..’’ సాఠే చిరునవ్వు నవ్వాడు. ‘‘ఇవన్నీ జరిగే పన్లు కావు బేబీ, అలాటివాళ్లు ఎవరూ దొరకరు. కట్టుకున్నవాళ్లలో ఒకరు ముందే కాటికి తరలిపోతే మిగిలినవాళ్లు మోడులా బతకాల్సిందే. ఇదే జీవితం. ఏమొచ్చినా మన ప్రాప్తమని ఊరుకోవాలి తప్ప ఆలోచించి బుర్ర పాడుచేసుకోకూడదు.’’
తండ్రి గోదావరి టీచరు ప్రస్తావన తెచ్చి మనసు నొప్పించనందుకు సుమన్ సంతోషించింది. తను తొమ్మిదో క్లాసులో ఉండగా ట్యూషన్ టీచరుగా వచ్చింది గోదావరి. తల్లీతండ్రి పోయారు, అన్నగారు పట్టించుకోలేదు. అందంగా లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో యింటింటికి వెళ్లి పిల్లలకు ఇంగ్లీషు, మాథ్స్ పాఠాలు చెప్పేది. ఆమె సౌమ్యత, సుమన్ పట్ల ప్రేమ, తీసుకున్న శ్రద్ధ సాఠేకు నచ్చింది. సుమన్‌కు కూడా టీచరంటే యిష్టం కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుందామా అనుకున్నాడు. ప్రతిపాదన రాగానే మీ యిష్టం అనేసిందావిడ. కానీ సుమన్ ఒప్పుకోలేదు. తల్లి లేకపోవడం చేత తండ్రితో ఆమెకు గాఢానుబంధం ఏర్పడింది. ఆయన్ను వేరే వాళ్లతో పంచుకోవడానికి యిష్టపడలేదు. ఒక్కతే సంతానం కావడంతో ఆమె తన ఆటబొమ్మలనే ఎవరితోనూ పంచుకునేది కాదు, అలాటిది తండ్రిని పంచుకుంటుందా?
సాఠే కూర్చోబెట్టి వివరించాడు. ‘‘బేబీ, నీకెందుకు భయం? ఈ పెళ్లి తర్వాత కూడా నీపై నా ప్రేమ ఏమీ తగ్గదు. నేనెందుకు పెళ్లి చేసుకోవాలని నువ్వు అడగవచ్చు. పిల్లలు, స్నేహితులు, కొలీగ్స్, వీరెవ్వరూ భార్యకు సాటి రారు. నా జీవితంలో ఒంటరితనం పోగొట్టుకోవడానికి వివాహమాడ దామనుకుంటున్నాను. గోదావరికి నువ్వంటే యిష్టం. నీ చదువుసంధ్యలు బాగా చూసుకోగలదు..’’
‘‘..ఆవిడ ఒక్కత్తేనా టీచరు? ఆవిడ కాకపోతే మరొకరి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటాను..’’
‘‘నిజమే. కానీ యిది కూడా ఆలోచించు. నాకు భార్య లేదు. ఆవిడకు పెళ్లి కాలేదు. ఆవిడ మనింటికి వచ్చి వెళుతూంటే ఎవరైనా ఏమైనా అనవచ్చు. అందువలన నేను పెళ్లి చేసుకోవాలి, లేదా ఆమెను యింటికి రావద్దని చెప్పాలి. తను యోగ్యురాలు కాబట్టి పెళ్లాడదామని అనుకుంటున్నాను…
’’నా చదువు గురించైతే నేనే వాళ్లింటికో, వేరే యింట్లో ట్యూషన్ చెప్తూంటే అక్కడికో వెళ్లి చదువుకుంటాను. నీకు పెళ్లి చేసుకోవాలని అంత యిదిగా ఉంటే అమ్మ పోగానే పిన్నినే చేసుకోవాల్సిందిగా? తాతా అమ్మమ్మా అడిగారు కూడా. వేరేవాళ్లయితే పిల్లను కష్టపెడుతుంది, యింట్లో పిల్లయితే ఆ భయం ఉండదు అన్నారుగా..’’ కోపంగా అడిగింది సుమన్.
‘‘అదేం మాట? సుమన్, అప్పుడు అమ్మ పోయిన దుఃఖం నుంచి బయటకు రాలేదు. నేనొక్కణ్నీ నిన్ను బాగా పెంచగలననుకున్నాను. ఇప్పుడు గోదావరిని చూశాక పోనీ తను కూడా కలిసి వస్తే..’’
‘‘గోదావరి టీచరు తారసిల్లకపోతే ఏం చేసేవాడివి?’’
సాఠే కాస్సేపు ఆలోచించాడు కానీ సమాధానం తట్టలేదు. ‘‘ఏమో, నాకూ తెలియదు. అమ్మ పోయినప్పుడు తోడు అవసరం లేదనిపించింది. ఒంటరిగా బతకగలను అనుకున్నాను. ఇప్పుడీ ఆలోచన వచ్చింది. అదైనా గోదావరి నీపై చూపిస్తున్న ప్రేమ కారణంగా. ఈ వివాహం వలన నేను మారిపోయి, నీకు అన్యాయం చేస్తానని అనుకోవద్దు. ఆస్తి విషయాలలో ఎవరికేం చేయాలో నాకు క్లారిటీ ఉంది. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే అవన్నీ విశదంగా చెప్తాను.’’
‘‘అక్కరలేదు. సవతి తల్లి అనే ఆలోచనే నేను భరించలేను.’’ అని సుమన్ లేచి వచ్చేసింది. చిన్నప్పటి నుంచి ఆమె చదివిన కథలన్నిటిలో సవతితల్లి దుష్టురాలే. బయట కూడా చాలా సంఘటనలు వింది. ఈ వయసులో తండ్రికి కొత్త భార్య వస్తే ఆమెపై మోజు పడి తనను నిర్లక్ష్యం చేస్తాడని ఆమె గట్టిగా నమ్మింది. గోదావరి టీచరు తండ్రిపై మత్తుమందు చల్లిందని, ఆయనలో లేనిపోని ఆలోచనలు పుట్టించిందని ఆమెకు తోచింది. సాఠే ఏమీ చేయలేక పోయాడు. తన బాగోగుల కంటె కూతురి యిష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చాడు. అందువలన పెళ్లి జరగదని గోదావరికి చెప్పేశాడు. ఆవిడ దగ్గర ట్యూషన్ చెప్పించుకోనని సుమన్ మొండికేయడంతో, గోదావరి యింటికి మళ్లీ రాలేదు. ఊరి శివార్లకు ఎక్కడికో మారిపోయింది. వాళ్ల కుటుంబానికి మళ్లీ మొహం చూపించలేదు.
ఇప్పుడు సుమన్‌కు ఆవిడ ఒక్కతే రక్షకురాలిగా తోచసాగింది. వేరేవాళ్లని తెస్తే తండ్రి ఆమోదించక పోవచ్చు. తండ్రిని, ఆమెను కలపగలిగితే కథ సుఖాంతమౌతుందనుకుంది. ఆవిడ ఆనుపానుల కోసం వెతకసాగింది. తెలిసినవాళ్లందరినీ వాకబు చేసింది. ఎవరూ ఏమీ చెప్పలేక పోయారు. ఈ ప్రయాసంతా ఆమె ఒక్కతే పడాల్సి వచ్చింది. ఎందుకంటే విఠల్ కలిసి రాలేదు. అతను ఫోన్ చేసి నిశ్చితార్థం ఎప్పుడని అడిగినప్పుడు ఆమె అసలు విషయం చెప్పేసింది. ‘‘నా చిన్నపుడు ఒకావిణ్ని మా నాన్న పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆవిడ దొరికితే నాన్నను ఆవిడకు అప్పగించి పెళ్లి చేసుకుందామని నా ప్లాను.’’ అంది.
‘‘మళ్లీ పెళ్లి గురించి మీ నాన్నగారేమన్నారు?’’ అడిగాడు విఠల్. ‘‘ఆ ఆలోచన మర్చిపోమన్నారు.’’
‘‘మంచాయన కాబట్టి అంతటితో వదిలిపెట్టారు. లేకపోతే ‘నీకు నేను కావల్సి వచ్చినపుడు అడ్డుపడ్డావు, ఇప్పుడు నీకంటూ తోడు దొరికింది, నేను అక్కరలేదు కాబట్టి ఎవరికో అంటగట్టి చేతులు దులుపుకుంటున్నావు అనేవారు.’’ ‘‘ఎవరో కాదు, ఆయన యిష్టపడినావిడ కోసమే వెతుకుతున్నాను…’’
‘‘ఆవిడ అప్పుడు నీకు దుష్టురాలు, దుర్మార్గురాలు, మందుపెట్టి మగాళ్లను లోబరుచుకునే దానిగా కనిపించింది, ఇప్పుడెలా మంచిదై పోయింది? అని అడిగితే..?’’ ‘‘నువ్వలా లాజిక్‌లు లాగితే ఎలా? అప్పుడు తెలిసీతెలియని వయసులో ఏదో పిచ్చిపని చేశాను. ఇప్పుడు సవరించు కుందామని చూస్తున్నాను. మా నాన్న గురించి ఆలోచిస్తున్నానని ఆయనకు అర్థమౌతుంది. నీలా కాదు..’’
‘‘అప్పుడూ నీ గురించే నువ్వు ఆలోచించుకున్నావు. ఇప్పుడూ అంతే. మీ నాన్న పట్ల నీ బాధ్యత తప్పించుకోవడానికి ఆయన్ని ఎవరి నెత్తికో చుడదామని చూస్తున్నావు. నీకోసం ఆయన పెళ్లి మాన్పించావు. ఇప్పుడు ఆయన కోసం నీ పెళ్లి మానుకోవడం లేదు. నీకు భర్తా, పిల్లలూ కావాలి. మనసులో ఏ సంకోచం లేకుండా జీవితాన్ని అనుభవించాలంటే ఆయనకో తోడును చూపించాలి. నాకక్కరలేదు, మొర్రో అని ఆయన అంటున్నా, ఎవరో ఒకర్ని కట్టబెట్టి నువ్వు బయటపడాలి.. అంతేగా?’’ అన్నాడు విఠల్ కటువుగా. ఇలా కఠోర వాస్తవాలు మాట్లాడడంతో బాటు ప్రాక్టికల్‌గా కూడా మాట్లాడాడు. ‘‘నీదంతా వృథా ప్రయాస. ఆవిడ యీ పాటికి తిండిలేక మాడి చచ్చిపోయి ఉండవచ్చు. లేదా ఎవరో ఒకరిని కట్టుకుని ఉండవచ్చు. మీ నాన్నను మర్చిపోయి ఉండవచ్చు, ఒకవేళ గుర్తున్నా, ముందుగా నీతో తేల్చుకోకుండా తనకు ఆశపెట్టి ఆశాభంగం చేసినందుకు తిట్టుకుంటూ ఉండవచ్చు.’’
విఠల్ వాదన విన్నాక సుమన్ హతాశురాలై పోయింది. ఒంటరిగా తన అన్వేషణ సాగించింది. చివరకు నెలన్నర తర్వాత ఒకతను గోదావరికి పెళ్లయిపోయిందని తనకు లీలగా గుర్తని చెప్పాడు. దారులన్నీ మూసుకుపోయాయి. ఈ లోపున సాఠే పూర్తిగా కోలుకుని తాంబూలాలు పుచ్చేసుకుందామని తొందర పెడుతున్నాడు. ఆయనకు సుమన్ పడుతున్న తాపత్రయం ఏమీ తెలియదు. తండ్రి చూపుతున్న వాత్సల్యం, తను ఆయన పట్ల కనబరుస్తున్న స్వార్థం సుమన్‌కి పదేపదే గుర్తుకు వచ్చి ఆమె అస్వస్థురాలైంది. విఠల్ తనను పరామర్శించడానికి వచ్చినపుడు ఓ కోరిక కోరింది. ‘‘మా నాన్నను పూనాలో ఒంటరిగా వదిలేసి నేను రాలేను. ఏదో జాబ్ ఆఫరుంది అని చెప్పి బాంబేకు తీసుకుని వచ్చేస్తాను. మనతో పాటు ఆయనా ఉంటారు. నువ్వు మీ వాళ్లను ఒప్పించు.’’ అంది.
విఠల్ నిట్టూర్చాడు. ‘‘నేనే మా అమ్మానాన్నతో ఉంటున్నాను. బాంబేలో హౌసింగ్ ప్రాబ్లెమ్ తెలుసు కదా! వాళ్లకీ సొంత యిల్లులేదు. మేం మా అత్తయ్య యింట్లో ఉన్నాం. పెద్దదే, మీ నాన్నగారు వచ్చి ఉన్నా ఫర్వాలేదు కానీ మా అత్తయ్యను అడగడం మా వల్ల కాదు.’’
‘‘ఏం? ఆవిడ అంత కరకు మనిషా?’’
‘‘అదేం కాదు, మా నాన్న బాగా సంపాదించుకునే రోజుల్లో ఆవిణ్ని పట్టించుకోలేదు. ఆవిడ ఒంటరిగా నానా అగచాట్లూ పడి, ఏదోలా పొట్టపోసుకుంటూ చాలాకాలం పెళ్లిపెటాకులూ లేకుండా బతికింది. చివరకు ఓ ముసలాడు దయతలిచి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన కొన్నేళ్లకే గుటుక్కుమన్నాడు. అయితే ముసలాయన పేరు మీద బొంబాయిలో ఫ్లాటు ఉండడంతో ఆవిడ దానిలో ఉంటోంది. ఈలోగా మా నాన్న చితికిపోవడంతో తను దయతల్చి గతం మర్చిపోయి, మాకు ఆశ్రయం యిచ్చింది. ఇప్పుడు మా వియ్యంకుణ్ని కూడా ఉండనియ్యమని ఎలా అడుగుతాం? నేను ఉద్యోగం మారి బొంబాయి కాకుండా వేరే ఊళ్లో కాపురం పెడితే మీ నాన్నగారు మనతో ఉండవచ్చు. కానీ అది యిప్పట్లో జరగదు. నేను ప్రస్తుతం ఉన్న కంపెనీతో యింకా ఐదేళ్ల వరకు బాండ్ రాశాను. అప్పటిదాకా ఆయనకు ఏమీ జరగదని ఆశిద్దాం.’’ అని చెప్పాడు.
సుమన్ ఏడ్చింది. ‘‘నేను వెళ్లి మీ అత్తయ్యను బతిమాలనా?’’ అంది. ‘‘వద్దువద్దు, నేనే పంపించా ననుకుంటుంది.’’ అన్నాడు విఠల్. అయినా సుమన్ వినలేదు. అతనికి తెలియకుండా వాళ్లింటికి వెళ్లిపోయింది. ఆవిణ్ని చూడగానే అవాక్కయింది. తన తండ్రి చేసిన దానికి విఠల్ తన అత్తయ్యను అడగడానికి గిల్టీగా ఫీలైతే, తను యింకా ఎన్ని రెట్లు ఫీలవ్వాలో అనుకుంది. ఎందుకంటే ఆ అత్తయ్య వేరెవరో కాదు, గోదావరే!
కానీ గోదావరి సుమన్‌ను చూస్తూనే లేచివచ్చి కౌగలించుకుంది. సుమన్ ఏమీ మాట్లాడలేక పోయింది. ఆమె ఒడిలో పడి భోరున ఏడ్చింది. గోదావరి తన కొంగుతో ఆమె కన్నీళ్లు తుడిచింది. ‘‘విఠల్ ఫలానా అమ్మాయిని పెళ్లాడబోతున్నానని చెప్పిన దగ్గర్నుంచి నాకు మీ గురించిన విషయాలు తెలుస్తున్నాయి. నువ్వు నీ తండ్రి గురించి పడుతున్న తపన గురించి విఠల్ చెప్పాడు. నీతో బాంధవ్యం కుదురుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇక మీ నాన్నగారి సంగతంటావా? ఆయనంటే యిప్పటికీ నాకు గౌరవం, అభిమానమే. ఆయన్ని సేవించుకునే అవకాశం వస్తే వదులుకోను. ఏ విషయం ఆయనే తేల్చాలి.’’ అంది.
తడిసిన సుమన్ కళ్లల్లో ఓ మెరుపు మెరిసింది!
కథ చదివారుగా, ఇది 1996లో పబ్లిషయ్యాక చదివినవారిలో ఒకరిద్దరు ‘‘1990లో వచ్చిన ‘‘కేలడి కన్మణి’’ అనే తమిళ సినిమా చూసి రాశావా?’’ అని అడిగారు. దాని తెలుగు డబ్బింగు ‘ఓ పాపా లాలీ’ అని వచ్చింది. అవి నేను మద్రాసులో ఉన్న రోజులు. తెలుగు సినిమా చూసే ఛాన్సూ లేదు. తమిళ సినిమా చూడనూ లేదు. 1995లో ఎన్టీయార్ కుటుంబం వ్యవహరించిన తీరు, 96లో ఎన్టీయార్ మృతి సంఘటనల సందర్భంగా నా మనసులో మెదిలిన ఆలోచనలతో యీ కథ రాశాను. ఎన్టీయార్ ద్వితీయ వివాహం జరగకుండా ఉంటే, ఆయన అనారోగ్యం పాలైనప్పుడు కొడుకులు, కూతుళ్లు ఏం చేసేవారా అనే ఆలోచన వచ్చింది. వాళ్లు పట్టించుకోలేదు కాబట్టే లక్ష్మీపార్వతికి అవకాశం చిక్కింది అంటారు. ఒకవేళ పట్టించుకున్నా ఏమేరకు పట్టించుకోగలరు?
ఓసారి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. ఎన్టీయార్‌తో ఈ పెళ్లెందుకు చేసుకున్నారండి, అనవసరంగా అని అంటే ‘నేను తినలేను, కడుక్కోలేను. ఏ కూతురు చేసిపెడుతుంది? ఏ కోడలు చేసిపెడుతుంది?’ అని జవాబిచ్చారట. ‘ఇలాటి పరిస్థితుల్లో అందరూ రెండో పెళ్లి చేసుకోవడం లేదు. పనివాళ్లను పెట్టుకోవచ్చుగా’ అని యీయన అడిగి వుంటే ‘వాళ్లు మొక్కుబడిగా చేస్తారు, అయినవాళ్లంత ఆత్మీయంగా చేయరు’ అని జవాబిచ్చేవారేమో! ఆగస్టు సంక్షోభం తర్వాత ఎన్టీయార్ ఆరోగ్యం మరింత క్షీణించింది. లక్ష్మీపార్వతి అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఆవిడ రాజకీయాల్లోకి చొరబడకుండా ఉంటే కుటుంబంలో కొందరైనా ‘హమ్మయ్య, ఆవిడ చూసుకుంటోంది, మనకు బాధ్యత తప్పింది’ అని సంతోషించి ఊరుకునేవారేమో! తెలియదు.
ఎన్టీయార్ వంటి హైప్రొఫైల్ కుటుంబాల విషయం పక్కన పెట్టినా, మామూలు కుటుంబాల్లో చూస్తాం కదా.. పిల్లలు మహా స్వార్థపరులు. వాళ్లకు అమ్మానాన్నా కావలసి వచ్చినపుడు ఫుల్ ఎటెన్షన్ కోరుకుంటారు. ఇంటికి ఎవరైనా వచ్చి మాట్లాడబోయినా విననీయకుండా మొహం వాళ్లవైపు తిప్పేసుకుంటారు. టీనేజి వచ్చి, సొంత సర్కిల్ ఏర్పడ్డాక యిక తలిదండ్రుల జోక్యాన్ని యింటర్ఫియరెన్స్ అనుకుంటారు. నాకు కావలసిన డబ్బు సమకూరిస్తే చాలు, ఎమోషనల్‌గా నీ అవసరం లేదు అన్నట్లు ప్రవర్తిస్తారు. తలిదండ్రుల సహకారంతో తమకంటూ కుటుంబం ఏర్పడి, తాము జీవితంలో సెటిలయ్యాక తలిదండ్రులతో నామమాత్రపు రిలేషన్స్ పెట్టుకుంటారు. వారికి వృద్ధాప్యం వచ్చి, వారి ఋణం తీర్చుకోవలసి వచ్చినపుడు మొదలౌతుంది బాధ. తెచ్చి యింట్లో పెట్టుకోలేరు. ‘ఇక్కడికి వస్తే ఎజస్ట్ అవలేరు, అక్కడే ఉన్న ఊళ్లోనే ఉంటూ, ఆరోగ్యాలు బాగా చూసుకుంటూ ఉండండి. రోగాలు తెచ్చుకుని మాకు యిక్కట్లు తెచ్చిపెట్టకండి. మేం మాటిమాటికి వచ్చి ఆసుపత్రుల్లో చేర్పించలేం.’ అంటారు. ముసలివాళ్లిద్దరూ ఉన్నపుడు ఏదోలా అవస్థపడుతూ గడిపేసినా, వాళ్లలో ఒకరు రాలిపోయినప్పుడు వస్తుంది అవస్థ.
తీసుకురావాలంటే కుదరదు. ఒంటరిగా వదిలేయాలంటే భయం, లోకం ఏమనుకుంటుందో నన్న బెదురు. వాళ్లకు తోడుగా ఎవరైనా ఉంటే మనకు చింత ఉండదనే ఆశ. అందుకనే ‘మా బావమరిది లేదా తోడల్లుడున్న ఊళ్లో వాళ్లకు దగ్గర్లో ఉంటావా? ఏదైనా మంచి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేరతావా? మంచి నర్సుల్ని పెట్టుకుంటావా? డబ్బు ఎంత కావాలన్నా పంపిస్తా’ లాటి ఆఫర్లు చేస్తారు. ఈ కథ రాసేనాటికి వై2కె రాలేదు. ఎన్నారై పిల్లలు అంతగా ఉండేవాళ్లు కాదు. ఇప్పుడైతే చాలామంది వృద్ధుల ఎన్నారై పిల్లలు యీ తరహాలోనే ఉన్నారు. ఇలాటి పరిస్థితుల్లో తండ్రికో, తల్లికో మళ్లీ ఎవరైనా జతపడితే బాగుండును అనే ఆలోచన రావడంలో అసహజం ఏమీ లేదు. తండ్రికి ఏ ఫ్లాష్‌బ్యాక్ లేకపోయినా తనకు పెళ్లయిపోయిన తర్వాత తండ్రికి తోడుండాలని ప్రయత్నించే కూతుర్ని ‘‘దర్బార్’’ (2020) సినిమాలో చూపించారు.
ఈ మధ్యే ఓ మాగజైన్లో ఆర్టికల్ చదివాను. భార్యో, భర్తో పోయిన సీనియర్ సిటిజన్లకై మాట్రిమోనియల్ వెబ్సైట్లు, స్వయంవరాలు ఏర్పాటు చేస్తున్నారని, సీనియర్ సిటిజన్లు తటపటాయిస్తూ ఉంటే వారి పిల్లలే వారిని ప్రోత్సహిస్తున్నారని రాశారు. గతంలో అయితే సవతి తల్లి ఆస్తిలో వాటా అడుగుతుందనే భయాలు ఉండేవి. ఇప్పుడు తమ వాటాలు తమకు వచ్చేశాక తండ్రి తాలూకు ఫ్యామిలీ పెన్షనో, ఉంటున్న యిల్లో కొత్త భాగస్వామికి పోయినా ఫర్వాలేదు, బాధ్యత కొన్నేళ్లపాటు తమ నెత్తిన పడకుండా ఉంటే అంతే చాలు అనే ధోరణిలో పిల్లలు ఆలోచిస్తున్నారట. ఈ కథలోని సుమన్ అంత తీవ్రంగా ఆలోచించక పోయినా, తనకు తోడు దొరికింది కాబట్టి తండ్రికి కూడా తోడు అమర్చాలి అనే బాధ్యత ఫీలైంది. ఇదివరకు వచ్చిన అవకాశాన్ని తను చెడగొట్టిందనే గిల్ట్ తోడైంది. గతంలో అనుకున్న వ్యక్తే అనుకోకుండా తారసపడడం అనేది డ్రమెటిక్ ఎలిమెంట్, పొయెటిక్ జస్టిస్.
ఇక ‘‘కేలడి కన్మణి’’ సినిమా కథేమిటి? ఆ సినిమా యిప్పటికీ చూడలేదు. ఇవాళే వికీపీడియాలో సారాంశం చదివాను. తల్లి లేని ఆరేళ్ల అను తండ్రి టీచరును పెళ్లి చేసుకుంటానని అంటే ఒప్పుకోదు. అటు టీచరూ ఊగిసలాడుతుంది. ఎందుకంటే ఆమెకు మూగ-బధిర తలిదండ్రులు ఉంటారు. తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వాళ్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే చింత ఆమెది. కూతురు పెళ్లికి తాము అడ్డుగా ఉన్నామనే వ్యథతో ఆ తలిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. తన వలననే వాళ్లు చనిపోయారనే గిల్ట్ ఫీలింగ్ అనులో కలుగుతుంది. దాంతో పెద్దదవుతున్నకొద్దీ ఆమెకు తరచుగా దిగులు కలిగి, తలనొప్పి వస్తూంటుంది. ఒకబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు కిడ్నీ సమస్య ఉందని, ఏడాదికి మించి బతకదని తెలుస్తుంది. ఆ జబ్బుని తండ్రి నుంచి దాచడానికి ప్రయత్నం చేయడం, కానీ అతనికి తెలిసిపోవడంతో కాస్త కథ నడుస్తుంది.
అనుకు ఆపరేషన్ చేయాలంటారు. అప్పుడు ఆమె తన ప్రియుడికి ఫ్లాష్‌బ్యాక్ చెప్పి, తను చనిపోయేలోగా తండ్రిని, టీచరుని కలపమని కోరుతుంది. టీచరు ఫోటో చూపిస్తే, ప్రియుడు ఆమెకై వెతికి ట్రెయినింగ్‌కై అమెరికా వెళ్లబోతున్న ఆమెను తీసుకుని వస్తాడు. ఆపరేషన్ విజయవంతమై తను బతుకుతాననే ఆశను అను వెలిబుచ్చడంతో సినిమా ముగుస్తుంది. పెళ్లికి అడ్డుగా ఉన్నామని టీచరు తలితండ్రులు ఆత్మహత్య చేసుకుంటే టీచరు అపరాధభావనకు గురవ్వాలి కానీ యీ పిల్ల అవడమేమిటో నాకు అర్థం కాలేదు. గిల్ట్ ఫీలింగు వలన న్యూరలాజికల్ సమస్య వచ్చిందంటే ఓహో అనుకోవచ్చు కానీ మధ్యలో కిడ్నీ ఫెయిలు కావడమేమిటో! సినిమాలో చాలా భాగం అను అనారోగ్యం చుట్టూనే తిరిగినట్టుంది. ఆ మెలోడ్రామా జనాలకు నచ్చి సినిమా బాగా హిట్టయింది. ఎనీవే, నా కథలో సుమన్ పాత్ర మామూలు కొడుకు లేదా కూతురు లాటిది కాబట్టి చాలామందికి రిలేట్ కావచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)