ఓటీటీల్లో మలయాళీ సినిమాల హవా కొనసాగుతూ ఉంది. గత కొన్నేళ్లుగా మలయాళీలు ఇండియన్ సినిమాపై తమదైన మార్కును గట్టిగా వేస్తూ ఉన్నారు. ఇండియానే చెప్పుకోదగిన సినిమాలు తీయడం మలయాళీలకు కొత్త కాదు కానీ, నయతారం ప్రేక్షకులకు, విదేశీ సినిమాలకు ధీటైన మూవీస్ ను తీయడం మలయాళీలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
ప్రత్యేకించి మంచి సినిమాలను చూడాలని తపించే తెలుగు వాళ్లు మలయాళీ సినిమాల వైపు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. మలయాళీ సినిమా ఏదైనా ఓటీటీలో వస్తోందంటే దాని పట్ల ఆసక్తి ఇక్కడ బాగా వ్యక్తం అవుతూ ఉంది. మరి ఈ ఆసక్తికి ఎప్పటికప్పుడు న్యాయం చేయడంలో మలయాళీ మూవీ మేకర్లు సఫలం అవుతూ ఉన్నారు!
కనీసం నెలకో మంచి సినిమాను అయినా అందించడంలో వారు దూసుకుపోతున్నారు! మోహన్ లాల్, మమ్ముట్టీ లు ఈ రేసులో తమ దైన రీతిలో సాగుతూ ఉన్నారు. ఈ ట్రెండ్ లో తాజాగా మమ్ముట్టీ సినిమా ఒకటి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆ సినిమా పేరు 'నాన్పకల్ నేరత్తు మయక్కం'. గత నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. దాదాపు 45 రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా పట్ల తెలుగు నెటిజన్లు రివ్యూలు అందిస్తున్నారు! ఈ సినిమా తమను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసిందనేది తెలుగు ఫేస్ బుక్ రివ్యూయర్ల మాట!
మలయాళీలు కొందరు తమిళనాడులో వేలంగిణి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక ఊరి వద్ద బస్ ఆగిపోతుంది. అందులోని వారు ఊర్లోకి వెళ్లగా, వారిలో ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి వెళ్లి, కొన్నేళ్ల కిందట చనిపోయిన ఆ ఇంట్లోని వ్యక్తి ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తాడు. తమిళం మాట్లాడతాడు, అచ్చంగా ఆ వ్యక్తి పనులన్నీ చేస్తాడు.. స్థానికులు, అతడి వెంట వచ్చిన కుటుంబీకులు ఆశ్చర్యపోతారు. తనను తీసుకెళ్లిపోవడానికి మలయాళీ ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ తరహా కథాంశంతో ఈ సినిమా ఓటీటీ సినీ ప్రియులను కట్టి పడేస్తోంది. ఇలా మరో సినిమాతో మలయాళీలు తమదైన ముద్రను వేస్తున్నారు.
అలాగే అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్న బిజూ మీనన్ సినిమా తన్కమ్ కూడా పాజిటివ్ రివ్యూలను పొందుతోంది. ఇక ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఇరట్టా కూడా పాజిటివ్ రివ్యూలు పొందింది. దీని ఓటీటీ రిలీజ్ కోసం కూడా తెలుగు ఓటీటీ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు! ఏతావాతా.. నెలకో సారి అయినా మలయాళీలు తెలుగు సినీ ప్రియులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పక్షం రోజులకు ఒకసారి కూడా ఏదో ఒక సినిమా మంచి రేటింగుతో ఎంటర్ టైన్ చేస్తోంది!