ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యాత్ర రెండో దశకు రెడీ అవుతున్నారట! దేశానికి మధ్య రాహుల్ యాత్ర తొలి దశలో నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగింది. ఈ యాత్రతో రాహుల్ గాంధీ తన ఫిజికల్ ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు.
రాహుల్ అంత వేగంగా పాదయాత్ర చేసిన నేత మరొకరు ఇప్పటి వరకూ లేరు! దాదాపు మధ్య వయస్కుడు అయిన రాహుల్ తన ఏజ్ వారికి లేని ఫిట్ నెస్ తనకుందని నిరూపించుకున్నాడు. వడివడిగా, ఎక్కడా ఇబ్బంది లేకుండా నడిచాడు. మధ్యమధ్యలో పరుగులు తీశాడు!
ఇలా ఫిట్ నెస్ ను అయితే నిరూపించుకున్న రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఫిట్ గా మార్చాడనేది ఇంకా తేలాల్సిన అంశం! ఈ ఏడాది వివిధ రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వాటిల్లో కాంగ్రెస్ ప్రదర్శన రాహుల్ యాత్ర ద్వారా దక్కినదేమిటో తేల్చనుంది.
అదలా ఉంటే.. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే యాత్రను పూర్తి చేసి రాహుల్ ఊరికే ఉండదలుచుకోలేదట. భారత్ జోడో యాత్రను రాహుల్ కొనసాగించనున్నారని తెలుస్తోంది. తొలి దశలో కవర్ కాని ప్రాంతంలో రాహుల్ రెండో దశ యాత్ర సాగుతుందట.
ఈశాన్యం నుంచి మొదలుపెట్టి గుజరాత్ దిశగా జోడోయాత్ర పార్ట్ టూ ఉండబోతోందని తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేరడమే లక్ష్యమన్నట్టుగా తొలి దశ యాత్ర సాగింది. అప్పుడు కవర్ కాని ప్రాంతాలను రాహుల్ రెండో దశలో కవర్ చేసేలా ఉన్నాడు.