డీజే టిల్లూ.. 2022 ఫిబ్రవరిలో ఓ ఊపు ఊపింది. ఇక 2021 ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2020 ఫిబ్రవరిలో నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. ఇలా గడిచిన మూడేళ్లుగా ఏటా ఫిబ్రవరికి ఓ హిట్ సినిమా పడుతోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆ మేజిక్ రిపీట్ కాలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 22 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్టయిన సినిమా ఒక్కటి కూడా లేదు. అలా అని ఈనెల మరీ ఫ్లాప్ మంత్ కూడా కాదు. చిన్న చిన్న మెరుపులున్నాయి.
ఫిబ్రవరి మొదటి వారంలో రైటర్ పద్మభూషణ్ సినిమా మెరిసింది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అతడి రేంజ్ కు ఇది హిట్ సినిమానే. అంతే తప్ప, బాక్సాఫీస్ ను షేక్ చేసేంత సక్సెస్ మాత్రం కాదు. నిజానికి ఆ వారం విడుదలైన సినిమాల్లో అంచనాలతో వచ్చిన సినిమా ఇది కాదు.
మొదటి వారంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్, మలయాళీ సినిమాకు రీమేక్ గా వచ్చిన బుట్టబొమ్మ సినిమాలపై భారీ అంచనాలుండేవి. కానీ ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. ఆశ్చర్యకరంగా మొదటి రోజుకే రెండు సినిమాలూ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రెండో వారంలో కూడా బాక్సాఫీస్ కు ఇలాంటి షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య వచ్చిన అమిగోస్ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. తొలిసారి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. పైగా బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరి చూపు ఈ మూవీపై పడింది. కానీ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాతో పాటు ఆ వారం వచ్చిన వేద, పాప్ కార్న్, వసంత కోకిల, అల్లంత దూరాన లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఇక మూడో వారంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా సార్. ధనుష్ తొలిసారి తెలుగులో హీరోగా నటించిన ఈ సినిమా అంచనాల్ని అందుకుంది. ప్రారంభంలో మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ఉన్న గ్యాప్ కారణంగా సినిమా తొందరగానే కోలుకుంది. అలా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ 75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి హిట్ అనిపించుకుంది.
చివరివారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. కోనసీమ థగ్స్, డెడ్ లైన్, మిస్టర్ కింగ్ లాంటి సినిమాలొచ్చినా ఏవీ నిలబడలేకపోయాయి. ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో రైటర్ పద్మభూషణ్, సార్ సినిమాలు మెరవగా.. అంచనాలతో వచ్చిన మైఖేల్, బుట్టబొమ్మ, అమిగోస్ సినిమాలు చతికిలపడ్డాయి.