టీమిండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్సీ ఒకింత ఇబ్బందికరమైన పోస్టులాగుంది. ఈ అనధికార హోదాలో ఉన్న వారు వరసగా జట్టులో స్థానాన్నే కోల్పోతున్నట్టున్నారు. ఆ మధ్య రహనే ఇలానే జట్టులో స్థానం కోల్పోయాడు. అక్కడికీ కొహ్లీ లేనప్పుడు కెప్టెన్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే వ్యక్తిగత ఫామ్ లేమిటో నాటి వైస్ కెప్టెన్ జట్టు నుంచి చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో రహనే ఓ మోస్తరుగా రాణిస్తున్నా సెలెక్టర్లు అతడి వైపు చూడటం లేదు!
ఇక మొన్నటి వరకూ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ కు ఆ ట్యాగ్ ను ఢిల్లీ టెస్టు ముందు తొలగించేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు వరకూ రాహుల్ వైస్ కెప్టెనే. రెండో మ్యచ్ ముందు జట్టు ప్రకటనలో ఆ ట్యాగ్ తీసేశారు. ఇక రెండో టెస్టులో కూడా రాహుల్ బ్యాటింగ్ మెరుగు కాలేదు. మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది, అయినా రాహుల్ పై దాడి ఒక రేంజ్లో ఉంది.
ఇక రేపటి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ కు ఇంకో చాన్స్ ఇచ్చి టీమిండియా యాజమాన్యం విమర్శల వానలో తడవడానికి రెడీగా ఉండకపోవచ్చు. ఒకవైపు సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ వంటి ఆటగాడు జట్టులో చోట కోసం ఎదురుచూస్తున్నాడు. టెస్టుల్లో గిల్ ఇప్పటికే తన సత్తా చూపించాడు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆ ఓపెనర్ కు ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటికే రాహుల్ కు విపరీతమైన అవకాశాలు ఇచ్చారనేది తీవ్ర విమర్శగా మారింది.
రాహుల్ కు ఇచ్చినన్ని అవకాశాలు గత కొన్నేళ్లలో ఎవ్వరికీ దక్కలేదని అభిమానులు గణాంకాలతో సహా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్ లో రాహుల్ కు అవకాశం ఇస్తే.. ఈ విమర్శల జడి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఒకవేళ రాహుల్ రాణించినా ఈ మాత్రం దానికి ఇన్ని చాన్సులా అంటూ విమర్శలు తప్పవు.ఈ అంశంపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. వైస్ కెప్టెన్సీ హోదాను తీసేయడంలో గూడార్థం ఏమీ లేదని, ఫైనల్ 11లో ఎవరుంటారో ఆఖరి నిమిషంలోనే తేలుస్తామంటున్నాడు!