ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా బిల్లును 21 జనవరి 2020 న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొన్ని సాంకేతిక కారణాలతో పాటు, మరింత సమగ్రంగా కొత్త బిల్లును ప్రవేశపెడతామని 22 నవంబర్ 2021 న ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకొంది. ఈ రెండేళ్ళ కాలంలో రాజధానుల వికేంద్రీకరణ స్వాగతించేవారు, వ్యతిరేకించే వాళ్ళ మధ్య తీవ్ర చర్చలు , ఉద్యమాలు జరుగుతూ వస్తున్నాయి.
రాజధానిని రెండు, మూడుగా వికేంద్రీకరణ చేయడం సాధ్యమేనా? అందులోనూ హైకోర్టు లాంటి ప్రధాన వ్యవస్థను రాజధాని వెలుపల ఏర్పాటు చేయడం ఏంటి ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. రాజ్యం, రాజు, రాజధాని ఇలాంటి ఒక సంప్రదాయ స్వరూపం సహజంగానే మనకు స్ఫురిస్తుంది. రాజధాని అంటే పరిపాలన శాఖలున్న ప్రధాన కేంద్రం లేదా పట్టణం.
ప్రభుత్వంలో ప్రధానంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ ఒకే చోట ఉండటం, ఉండాలనుకోవటం సర్వ సాధారణంగా ఉండే అభిప్రాయమే.
ఆధునిక కాలంలో వస్తున్న మార్పులు, ఆయా రాష్ట్రాలలోని భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక కారణాలు, వెనుక బాటుతనం, ప్రత్యేక పరిస్థితుల వల్ల అన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాజధానిని కూడా వికేంద్రీకరణ చేసే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆయా సమస్యల పరిష్కారానికి అభివృద్ధితో పాటు, ఇతర ప్రత్యేక ప్రాధాన్యతలు ఇస్తే సరిపోతుంది కదా … రాజధాని, పాలన వికేంద్రీకరణ అనవసరం అనే వాళ్ళు ఉంటారు. ఆయా ప్రాంతాలు అభివృద్ధితో పాటు తమ గుర్తింపు, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం వికేంద్రీకరణ అవసరం అనే ప్రత్యామ్నాయ భావనలు కూడా ఏర్పడుతుంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికేంద్రీకరణ అమలవుతుంది. భారతదేశంలోను అనేక రాష్ట్రాల్లో వివిధ కారణాల రీత్యా రాజధాని, ప్రధాన పాలన వ్యవస్థల వికేంద్రీకరణ జరిగిన సందర్భాలున్నాయి.
రాజధానుల వికేంద్రీకరణ:
భారతదేశంలో ఇప్పటికి దాదాపు ఆరు రాష్ట్రాలలో రాజధానుల వికేంద్రీకరణ జరిగింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అధికారికంగా శ్రీ నగర్, వేసవికాల రాజధానిగా, జమ్మును శీతాకాల రాజధానిగా వాతావరణ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య దూరం 262 కిలోమీటర్లు.
ఇటీవల జమ్ముకాశ్మీర్ రాష్ట్రం నుంచి విడదీసిన లడక్ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ లేహ్, కార్గిల్ లు వేసవి, శీతాకాల రాజధానులుగా అధికారికంగా ఉన్నాయి. ఈ రెండు రాజధానుల మధ్య దూరం 219 కిలోమీటర్లు.
మహారాష్ట్ర రాష్ట్రంలో ముంబై రాజధాని కాగా, రెండవ రాజధానిగా నాగపూర్ ను అధికారికంగా 1988 లో ప్రకటించారు. శీతాకాల రాజధానిగా ఉంది. వెనకబడిన విదర్భ తదతర ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఏర్పడింది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 823 కిలోమీటర్లు ఉంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా తో పాటు ధర్మశాలను రాజధానిగా 2017 లో అధికారకంగా ప్రకటించారు. సాంస్కృతిక పరంగా ప్రాధాన్యతతో ఇది ఉంది. వీటి మధ్య దూరం 223 కిలోమీటర్లు ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ తో పాటు గైర్సేన్ 2013 లో అధికారికంగా ప్రకటించారు. వీటి మధ్య 280 కిలోమీటర్ల దూరం ఉంది.
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో బెంగుళూరు రాజధాని కాగా ఉత్తర కర్ణాటక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బెల్గాం ను 2012 లో మరో రాజధానిగా ప్రకటించారు. వీటి మధ్య దూరం 507 కిలోమీటర్లు ఉంది.
తమిళనాడులో మదురై, తెలంగాణలో వరంగల్ ఇలా అనేక రాష్ట్రలలో రెండవ రాజధాని ఉండాలనే డిమాండ్ లు వస్తున్నాయి. వచ్చే రోజులలో అనేక రాష్రాలలో రాజధానుల వికేంద్రీకరణ వివిధ కారణాలతో తప్పనిసరి అవబోతుంది. భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాదు నగరం ఉండాలని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మొదలుకొని ఎందరో ప్రతిపాదించారు.
ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు , ఉప ప్రాంతాల మనోభావాలు, వెనుకబాటుతనం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు, అభివృద్ధి అవకాశాలు ఇలా అనేక కారణాలరీత్యా రాజధానుల వికేంద్రీకరణ ఒక ప్రజాస్వామిక హక్కుగా రాబోతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజధాని విషయమై నిపుణుల కమిటీ సూచనల మేరకు చేయాలని ఉంది. అందుకోసం శివ రామన్ కమిటీ ప్రామాణిక నివేదిక ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ విషయంగా ప్రస్తావించింది. 1937 నాటి ఆంధ్ర, రాయలసీమ నేతల శ్రీ బాగ్ ఒప్పందం కూడా రాజధాని, హైకోర్టు వేరు వేరుగా ఉండాలనే వికేంద్రీకరణనే సూచిస్తుంది.
గత ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకైక రాజధాని అమరావతిని ఏకపక్షంగా ప్రకటించింది. ఆ సమయంలో రాయలసీమ ప్రాంత ప్రజలు తీవ్ర అసమ్మతి ప్రకటించారు. ఒక ప్రాంతంలో గొప్ప రాజధానిని నిర్మించి అక్కడ వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల మేలు కలుగుతుందని ప్రతిపాదించారు. హైదరాబాదు ఏకీకృత అభివృద్ధి వలన జరిగిన నష్టం దృష్ట్యా సీమవాసులు ఏకీకృత రాజధానిని వ్యతిరేకిస్తూ వచ్చారు.
అమరావతి పరిసరాలకు ప్రాధాన్యత కల్పించేదుకు కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్, అగ్రికల్చరల్ యూనివర్శిటీ తదితర కీలక సంస్థలను వాటి వైపు తీసుకెళ్లడంపై సీమవాసులు నిరసనలు వ్యక్తం చేసారు. అమరావతిని ఒక సాధారణ రాజధానిగా నిర్మించే బాధ్యత కేంద్రానికి వదిలేయకుండా రైతులను భాగస్వామ్యం చేసి జాయింట్ వెంచర్ గా మార్చేసి ఏదో భూతల స్వర్గంగా ప్రచారం చేసారు. అమరావతి ఊహజనిత ఆర్థిక కేంద్రంగా ప్రచారం సాగింది. అమరావతిలో ఆస్తి లేకుంటే ఏమైపోతామో ఏమో అనేంత ఆత్మన్యూనత కలిగించారు. సమస్య మరింత జటీలమైపోయింది. సాధారణ రాజధానిగా అమరావతి ఉంటే ఇంత క్లిష్టత ఉండేది కాదు. అవసరమైన పాలనా వ్యవస్థల వికేంద్రీకరణకు కూడా పెద్ద అడ్డంకులు ఉండేవి కావు.
ఆయా రాష్ట్రాల పరిస్థితుల బట్టి రాజధానుల, పాలన వికేంద్రీకరణ చేసుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేది సత్యం.
రాజధాని వెలుపల హైకోర్టులు:
హైకోర్టు అనేది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల కన్నా భిన్నమైంది. ఎంతో స్వయం ప్రతిపత్తి ఉండేది. నిజానికి హైకోర్టు దినసరి కార్యక్రమాలకు, పై రెండు వ్యవస్థలకు పెద్దగా సంబంధం కూడా ఉండదు. హైకోర్టు కూడా రాజధాని లోనే ఖచ్చితంగా ఉండాలనడం అశాస్త్రీయం.
*భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు తొమ్మిది చోట్ల రాజధాని కేంద్రంలో కాకుండా ఇతర నగరాలలో ఉన్నాయి.
*అస్సాం రాష్ట్రంలో గౌహతి, చత్తీస్గఢ్ లో బిలాస్పూర్, గుజరాత్ లో అహ్మదాబాద్, కేరళలో ఎర్నాకుళం, మధ్యప్రదేశ్ లో జబల్పూర్, ఒడిస్సా లో కటక్, రాజస్థాన్ లో జోద్ పూర్, ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్ లో నైనిటాల్ ఇలా రాష్ట్ర రాజధానితో సంబంధం లేకుండా పక్క ప్రాంతాలలో హైకోర్టులు ఉన్నాయి. ఆయా హైకోర్టు లకు అనుబంధంగా దాదాపు 15 బెంచ్ కోర్టు బెంచ్ లు కూడా ఇతర నగరాలలో ఉన్నాయి.
విభజన చట్టం 31 సెక్షన్, 2 సబ్ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన స్థానం రాష్ట్రపతి నోటిఫై చేసిన చోట ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు అది సహజంగా జరగాలి. 3 సబ్ సెక్షన్ ప్రకారం పై 2 వ సబ్ సెక్షన్ నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, ద్వి సభ్య ధర్మాసనాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన చోట లేదా చోట్లలో న్యాయ విచారణ చేయవచ్చు అని ఉంది.
సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు అనుసరించడం ఆనవాయితీ. ఇంత సహజంగా హైకోర్టు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం చట్టం కల్పించింది.
ఈ నేపథ్యంలో శ్రీ బాగ్ ఒప్పందం స్ఫూర్తితో కర్నూలు లో హైకోర్టు ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తొమ్మిది రాష్ట్రాలలో హైకోర్టులు రాజధానిలో కాకుండా బయట ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయకూడదని అశాస్త్రీయంగా చర్చ సాగుతుంది.
రాజధాని లేదా పాలన వ్యవస్థలను రాష్ట్రంలోని ఇతర ఉప ప్రాంతాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే చోట కొన్ని ప్రాంతాల ప్రయోజనాలు అన్నీ పరిమితం చేస్తే వచ్చే విపరిణామాలను కూడా వ్యతిరేకిస్తున్నవారు ఆలోచించాలి. కర్ణాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల స్ఫూర్తితో వికేంద్రీకరణను స్వాగతించాలి. ఎంతో ఐక్యతతో సాగవలసిన తెలుగుజాతి చిన్న చిన్న కారణాలతో తెలంగాణగా విడిపోయింది.
మరింత చిన్న కారణాలతో ప్రస్తుతం మిగిలిన తెలుగు నేల, జాతి, భాష విడిపోయే పరిస్థితులు కలిగించకుండా అన్ని ప్రాంతాలు సమగ్ర వికేంద్రీకరణ స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఇందుకు మేధావులు, సాహిత్యకారులు, భాషాభిమానులు ఒక సాంస్కృతిక ఉద్యమంగా సాగాలి. ఒక రాజధాని విషయంలోనే కాకుండా సాగునీళ్ళు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి తదితర అనేక అంశాలలో భవిష్యత్తులో వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటి ఆధునిక భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి.
– డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, 9963917187