టైటిల్: పుష్ప
రేటింగ్: 2.5/5
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, ధనంజయ, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్- రూబెన్
సంగీతం:దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ యర్నేని, రవి శంకర్
దర్శకత్వం: సుకుమార్
విడుదల తేదీ: 17 డిసెంబర్ 2021
చాలా కాలం తర్వాత ఒక పండుగ వాతావరణంలో పెద్ద సినిమా విడుదలయ్యింది. కరోనా కాలాన్ని గట్టెక్కి అసలు తెలుగు సినిమా మళ్లీ పూర్వవైభవం చూస్తుందా అన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ “ఫుష్ప” దాదాపు వంద శాతం అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకుంది.
సింగిల్ లైన్లో కథ చెప్పాలంటే ఒక ఎర్రచందనం సిండికేట్ లోని కూలీ ఆ వ్యాపరంలో డాన్ లా ఎలా ఎదిగాడనేది కథ.
కథలో కొత్తదనం లేకపోయినా కానీ, దర్శకుడు సుకుమార్ అనగానే ఎన్నో అంచనాలుంటాయి. ఆయన స్క్రీన్ ప్లే మాంత్రికుడు. కథ ఎంతున్నా ఊహించని మలుపులతో తెలివైన ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేయగల నేర్పరి. పైగా ఇది “రంగస్థలం” తర్వాత ఆయన తీసిన సినిమా. అది కూడా “అలవైకుంఠపురంలో” లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా కూడా.
ఇన్ని అంచనాలు తలలో పెట్టుకుని చూస్తే ఆ రంగస్థలం అంచుని కూడా తాకలేని సినిమాగా మిగిలింది ఇది.
సినిమా టైటిల్స్ లోనే నీరసం ధ్వనిస్తుంది. సంబంధం లేకుండా యానిమేషన్లో ఎక్కడో జపాన్లో ఒక పెళ్లిలో గిటార్ ని బహుమతిగా ఇచ్చే సంస్కృతి గురించి వాయిస్ ఓవర్ లో వినిపిస్తుండగా టైటిల్స్ కదులుతుంటాయి. ఇవి “పుష్ప” టైటిల్సేనా అని నొసట్లు చిట్లించిన ప్రేక్షకులకి కాసేపట్లో లింకు అర్థమవుతుంది. ఆ గిటార్ తయారయింది ఎర్రచందనంతో అని…అది ప్రపంచం మొత్తంలో ఒక్క శేషాచలం అడవుల్లోనే దొరుకుతుందని చెప్పడంతో “హమ్మయ్య మ్యాటర్లోకొచ్చాడు. ఇది పుష్ప నే” అని మనసులోనే నిట్టూర్చడం ప్రేక్షకుల వంతౌతుంది.
హీరో ఎంట్రీకి ఎక్కువ సమయం తీసుకోకుండా టైటిల్స్ అవ్వగానే కథ మొదలుపెట్టేసారు. అది బాగుంది. అయితే కథనం మాత్రం స్ట్రైట్ రోడ్ లో సుదీర్ఘ ప్రయాణంలా ఉంటుంది తప్ప ఎటువంటి మలుపులు ఉండవు.
నెట్ ఫ్లిక్స్ లో “నార్కోస్” చూసిన వాళ్లకి గ్రాఫ్ మొత్తం అక్కడనుంచి స్ఫూర్తి పొందినట్టు అర్థమౌతుంది. అక్కడ డ్రగ్స్- ఇక్కడ ఎర్ర చందనం. అక్కడ పాబ్లో ఎస్కోబార్- ఇక్కడ పుష్పరాజు..అంతే తేడా.
అందులో కూడా ఆ క్రైం సిండికేట్ లో రెండు మూడు గ్రూపులుంటాయి. తెలివిగా పాబ్లో ఎస్కోబార్ ఆ గ్రూపుల్ని తుదముట్టించి ఎలా వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటాడో నార్కోస్ లో చూపించారు. అదంతా జరిగిన చరిత్ర.
పుష్పరాజు కథ మాత్రం కల్పితం. ఇందులో కూడా హీరో ఎదుగుదల “నార్కోస్” లో మాదిరిగానే ఉంటుంది. కానీ “నార్కోస్” లో ఉన్న బిగువు, పట్టు, ఉత్కంఠ “పుష్ప”లో కనపడవు.
అలాగే “రక్త చరిత్ర”, “సర్కార్” సినిమా ఛాయలు ఒక సన్నివేశంలో కనిపిస్తాయి. విలన్ పాత్రధారి అయిన సునీల్ తన బావమరిదికి ఒకడిని ఎలా కొట్టాలో, ఏ ఎముక విరగ్గొట్టాలో డైరెక్షన్ ఇస్తుంటాడు. సర్కార్ లో నటుడు రవి కాలె టైపులో చూస్తూ ఆ బావమరిది ఆ వ్యక్తిని విరగ్గొడుతుంటాడు. ఇదంతా జరుగుతుంటే అనసూయ చాలా క్యాజువల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇది రక్తచరిత్ర మొదటి భాగంలోని బుక్కారెడ్డి ఎపిసోడ్ నుంచి స్ఫూర్తి పొందినట్టుగా ఉంది.
అన్నట్టు బుక్కారెడ్డంటే గుర్తొస్తోంది…ఇందులో జాలీరెడ్డి అని ధనుంజయ్ పాత్ర ఒకటుంది. అది అచ్చం రక్తచరిత్రలోని కామాంధుడైన బుక్కారెడ్డి పాత్రని పోలి ఉంటుంది. అలాగని అంత ఇంటెన్సిటీ ఉందని మాత్రం కాదు.
ఆ విధంగా మొదటి సారి సుకుమారులోని ఒరిజినాలిటీ కనపడకుండా “ఎత్తు”గడలు కనిపించాయి.
ఈ సినిమాలో ప్రధాన మైనస్ సునీల్ పాత్ర. విలన్ గా గెటప్పేస్తే సరిపోదు. విలనీ పలకాలి. కానీ పలకలేదు. సునీల్ కి విలన్ గా ఇది తొలి సినిమా కాదు. గతంలో కూడా చేసాడు. ఏ రకమైన వైవిధ్యమూ, విశేషమూ లేకుండా సుకుమార్ కూడా సునీల్ ని అలాగే చూపించడం ఆశ్చర్యం.
పుష్పరాజ్ గా అల్లు అర్జున్, కొండారెడ్డిగా అజయ్ ఘోష్..ఈ ఇద్దరే చాలా కన్విన్సింగ్ గా పవర్ఫుల్ గా ఉన్న పాత్రలు. మిగిలినవన్నీ బిల్డప్ ఎక్కువ బిల్ట్ క్వాలిటీ తక్కువ అన్నట్టున్నాయి.
అనసూయ పాత్ర తేలిపోయింది. ఐటం సాంగులో సమంత కనీసం రిజిస్టర్ కూడా కాలేదు. సమంత కాక ఎవరున్నా ఏమంత తేడా ఉంటుంది అనిపించింది.
పాటలన్నీ వింటున్నప్పుడు కలిగిన అనుభూతి చూసినప్పుడు కలగలేదు.
క్లైమాక్స్ కి 20 నిమిషాల ముందు వచ్చే ఫహద్ ఫాజిల్ ట్రాక్ చాలా సాగతీతగా ఉంది. దర్శకుడు కోరుకున్నంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది ఆ పాత్ర. అయితే రెండవ భాగానికి నాందిలాగ ఆ ట్రాక్ ని లాగారంతే.
మొత్తంగా అసలీ సినిమా గుండెకి హత్తుకోకపోవడానికి ముఖ్యకారణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ రేంజ్ సినిమాకి నేపథ్య సంగీతం ఎలా ఉండకూడదో అలా ఉంది. పాటల్లో రెచ్చిపోయిన దేవీశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ విషయంలో మాత్రం వెనుకంజ వేసారు.
ఇక దర్శకత్వం విషయానికొస్తే చాలామంది క్యారెక్టర్స్ ని పెట్టుకున్నంతలో సరిపోదు. అన్ని పాత్రలకి తగిన డ్రామా పండాలి. అప్పుడే అది సుకుమార్ మార్క్ సినిమా అవుతుంది. ఇందులో లోపించింది అదే. ఏ పాత్రతోటి ఎమోషనల్ కనెక్షన్ ఎర్పడదు.
లవ్ ట్రాక్ ని కామెడితో మిక్స్ చేసి లైట్ గా తీసుకున్నారు. ఏ రొమాంటిక్ సన్నివేశమూ గుండెని తాకదు.
పైగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అస్సలు సమంజసంగా లేదు. వెయ్యి రూపాయలిస్తే ఓర చూపు చూడ్డానికి, ఐదువేలిస్తే ముద్దుకి ఒప్పేసుకుందంటే ఏమనాలి?
మరొక సన్నివేశంలో దర్శకుడు ఎంత సుకుమారంగా తీసానని సర్దిచెప్పుకున్నా అందరికీ అర్థమయ్యేలా అశ్లీలాన్ని సింబాలిక్ గా చూపించారు. హీరోగారు హీరోయిన్ భుజం మీదే చెయ్యి వేసారని కవరింగ్ ఇచ్చుకునేలా వెసులుబాటు కల్పించుకున్నా, ప్రేక్షకులు మరీ అంత అమాయకులు కాదు. సకుటుబంగా చూసే ఈ సినిమాలో ఆ సీన్ అవసరమా అనిపిస్తుంది. ఇంతకంటే దీని గురించి వివరంగా చెప్పలేం.
ఇక చాలాబాగున్న అంశాల్లో ఒకటి కెమెరా వర్క్. విజువల్ గా చాలా రిచ్ గా కనిపించింది. లైటింగ్, ప్యానింగ్, సజెషన్స్ అన్నీ గొప్పగా అనిపించాయి.
మరి కొన్ని నెలలు ఆగితే తప్ప “పుష్ప-2” తెర మీదకు రాదు. ప్రస్తుతానికైతే రెండవ భాగం ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆసక్తి మాత్రం కలగట్లేదు.
ఫస్ట్ పార్ట్ స్పందనని బట్టి అవసరమైతే మార్పులు చేస్తామని అల్లు అర్జున్, సుకుమార్ లు చెప్పారు. ఏం మార్పులు చేసుకుంటారో తెలీదు కానీ సెకండ్ పార్ట్ కి చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. సుకుమార్ నుంచి ప్రేక్షకులు ఆశించింది మాత్రం ఇది కాదు.
అసలీ సినిమాని మొదటి భాగమే మూడు గంటలు తెయాల్సిన అవసరమేంటి? రెండు భాగల్లో వస్తున్న సినిమా కాబట్టి బలవంతంగా తీసినట్టుతుంది తప్ప వేరే అవసరం కనపడదు. వెబ్ సిరీస్ లో లాగ కొత్త కొత్త పాత్రలు తెర మీదకు రావడం, పాత పాత్రలు పోవడం జరుగుతుంటుంది.
పుష్పరాజుకి శత్రు కూటమిలోని ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కడిని చంపి మిగిలిన వాళ్లని ఉంచాడు. ఎందుకంటే రెండవ భాగం వాళ్లతో నడపాలి కాబట్టి.
బాహుబలి- ది బిగినింగ్ చూసాక “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న రెండవ భాగానికి ప్రచారాస్త్రంగా పనిచేసింది. ఇప్పుడు పుష్ప కి అలాంటి ప్రశ్నలేవీ మిగల్లేదు. రెండవ భాగం కోసం వేచి చూడడానికి మొదటి భాగంలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ ఏదీ లేదు.
ఏదో గొప్ప ఫీట్ చేసి రెండవ భాగం ట్రైలరులో ఊహించని ఆకర్షణలు పెడితే తప్ప ఈ మొదటి భాగానికి వచ్చినంత క్రేజ్ రాదు. ప్రస్తుతానికైతే క్రేజుకు తూగలేని పువ్వులా మిగిలింది.
బాటం లైన్: గుబాళించని పుష్పం