బాబుకు అవమానం.. జిల్లాలకు రావొద్దంటున్న తమ్ముళ్లు

స్థానిక ఫలితాల్లో పూర్తి స్థాయిలో బోల్తా పడ్డ తర్వాత జిల్లా నాయకుల్ని పిలిపించి సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఆ తర్వాత జిల్లాల పర్యటనల్ని గొప్పగా ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో పర్యటించి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నారు.…

స్థానిక ఫలితాల్లో పూర్తి స్థాయిలో బోల్తా పడ్డ తర్వాత జిల్లా నాయకుల్ని పిలిపించి సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఆ తర్వాత జిల్లాల పర్యటనల్ని గొప్పగా ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో పర్యటించి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నారు. తన ఏడుపుగొట్టు ఎపిసోడ్ ను హైలెట్ చేసుకోవాలనుకున్నారు. పనిలోపనిగా అమరావతిని ప్రమోట్ చేయాలనుకున్నారు. 

నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మీటింగ్స్ అనుకున్నారు. కానీ బాబు ప్లాన్స్ కు ఆదిలోనే చెక్ పడింది. చెక్ అనడం కంటే బాబుకు తీవ్ర అవమానం జరిగిందని చెప్పడం కరెక్ట్. చంద్రబాబును రావొద్దంటూ జిల్లాల నాయకులు వేడుకుంటున్నారు. దీనికి కారణం ఆర్థిక సమస్యలే.

బాబు జిల్లాల పర్యటనకు వస్తే, స్థానిక టీడీపీ నేతల జేబులకు చిల్లు పడినట్టే. ఒక్కో నేత లక్షల్లో డబ్బు తీయాల్సి ఉంటుంది. కార్యకర్తలు ఎలాగూ లేరు కనక, మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్ లపైనే నడవాలి. మీటింగ్ లకు జనాలను తరలించడం, వాళ్లకు మద్యం, భోజనం.. ఇలా కోట్ల ఖర్చు. ఇప్పుడిదంతా భరించలేమని, రావొద్దని తెగేసి చెబుతున్నారు నాయకులు.

ఆర్థిక కష్టాల్లో టీడీపీ..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికార, ప్రతిపక్ష నాయకులెవరూ జేబులో డబ్బులు బయటకు తీయాలనుకోరు. ఎందుకంటే ఎంత ఖర్చు చేసినా, ఐదేళ్ల తర్వాత చివరకు ఓటుకు నోటు సమర్పించాల్సిందే. జనంలో పలుకుబడి ఉంటే కాస్త తక్కువ ఇచ్చినా పోలింగ్ స్టేషన్లకు వస్తారు, అసలేమీ లేకపోతే పూర్తిగా నోట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉండగా ఎవరూ ఖర్చు పెట్టాలనుకోరు, ఆర్థిక కష్టాలు కోరి తెచ్చుకోవాలనుకోరు. 

అందులోనూ ఇటీవలే స్థానిక ఎన్నికల్లో ఎంత చించుకున్నా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, వారి వెనకున్న నాయకులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. వారంతా పూర్తిగా డీలా పడ్డారు. దీంతో మరోసారి జేబులో నుంచి సొంత డబ్బులు బయటకు తీయాలంటే అల్లాడిపోతున్నారు.

వచ్చే ఎన్నికలకు డబ్బులు పెట్టేది ఎవరు..?

2014 నుంచి 2019 వరకు దోచుకున్నదంతా సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఇప్పుడు సంపాదన మార్గాలు మూసుకుపోయాయి. దీంతో 2024 నాటికి అసలు టీడీపీ తరపున డబ్బులు ఖర్చు పెట్టేవారు ఉంటారా లేదా అనేది కూడా అనుమానమే. జగన్ వేవ్ లో గెలవడం కష్టం అని డిసైడ్ అయినవాళ్లు.. తాడో పేడో తేల్చుకోడానికి భారీగా డబ్బులు వెదజల్లాల్సిందే. అలాంటి పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో లేదు.

రెండేళ్ల తర్వాత కేవలం డబ్బులు ఖర్చుపెట్టే బ్యాచ్ నే వెదికి మరీ తెరపైకి తీసుకు వస్తారు చంద్రబాబు. ఆ టైమ్ కి ఆయనకు బకరాలు దొరికితే సరి, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు కూడా టీడీపీ అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిందే. 

ప్రస్తుతానికైతే బాబు జిల్లాల పర్యటనల్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాబు డబ్బులివ్వరు, తమ్ముళ్లు డబ్బులు తీయరు, జూమ్ లో మీటింగులు పెడితే జనాలు పట్టించుకోరు. బాబుకు భలే చిక్కొచ్చిపడింది.