శ్రీవిష్ణు మంచి కథలు సెలక్ట్ చేసుకుంటాడనే పేరుంది. టాలెంట్ ఉన్న కొత్త కుర్రాల్ని పట్టుకుంటాడనే ఇమేజ్ ఉంది. ఈసారి కూడా ఈ హీరో అదే పని చేశాడు. ఓ యంగ్ డైరక్టర్ ను పరిచయం చేస్తున్నాడు. ఓ సరికొత్త కథను అందిస్తున్నాడు. అదే అర్జున ఫాల్గుణ.
ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా ఇదే. డిసెంబర్ 31న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ఈ ఏడాది రాజరాజచోర సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. అర్జున-ఫాల్గుణతో గ్రాండ్ ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈసారి అతడి ఊహలు నిజమౌతాయా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అర్జున ఫాల్గుణ సినిమా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అనుకోకుండా ఈ మాఫియాలో ఇరుక్కున్న హీరో, అందులోంచి విజయవంతంగా ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు టాక్ నడుస్తోంది.
“నాది కాని కురుక్షేత్రంలో, నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు, అర్జునుడ్ని” అంటూ టీజర్ లోనే డైలాగ్ కొట్టాడు శ్రీవిష్ణు. ఆ డైలాగ్ కు, తాజాగా బయటకొచ్చిన స్టోరీలైన్ కు సింక్ కుదిరింది.
ఈ సినిమా కూడా క్లిక్ అయితే కొత్త ఏడాదిలో శ్రీవిష్ణు మార్కెట్ మరింత పెరగడం ఖాయం. కానీ సమస్య అంతా ఒక్కటే. శ్రీవిష్ణు కెరీర్ కన్సిస్టెంట్ గా ఉండడం లేదు. ఒక సినిమా సక్సెస్ అయితే, వరుసగా 2 ఫ్లాపులిస్తున్నాడు. ఈసారి ఏమౌతుందో చూడాలి.