స్కిల్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో ఆ ప్రభావం టీడీపీపై తీవ్రంగా పడింది. ఎన్నికలకు ఇక ఆరు నెలల సమయం మాత్రమే వుంది. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తూ జనంలో వుంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా విస్తృతంగా పర్యటిస్తూ, రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని వేడుకోవడం చూశాం.
ఇందులో భాగంగా అనంతపురం జిల్లా పర్యటనలో వుండగా తనను కూడా రెండు రోజుల్లో అరెస్ట్ చేయొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నంద్యాలలో పర్యటిస్తుండగా, బాబు అన్నట్టే ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చంద్రబాబుకు ఈ రోజు కాకపోతే, రేపో ఎల్లుండో బెయిల్ వస్తుందని టీడీపీ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది.
అయితే బాబు అరెస్ట్ టీడీపీలో చేరికలపై తీవ్ర ప్రభావం చూపుతోందని సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజక వర్గాల్లో వైసీపీ, బీజేపీ నుంచి ముఖ్య నాయకులు టీడీపీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నాయకులు టీడీపీలో చేరేందుకు తమ అనుచరులతో సమావేశాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఆత్మీయ సమావేశాలను రద్దు చేసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ కష్టకాలంలో వుందని, లోకేశ్ ఢిల్లీలో వుంటున్నారని, ఇప్పుడు ఎవరి సమక్షంలో చేరాలో తెలియక ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. చంద్రబాబు బెయిల్‌పై స్పష్టత, లోకేశ్ మళ్లీ పాదయాత్ర ద్వారా జనంలోకి వస్తే తప్ప, టీడీపీలో చేరికల ఊసే ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.