టీడీపీతో జనసేన పొత్తుపై తేల్చేసినంత సులువు కాదు.. తన పార్టీ శ్రేణులతో చంద్రబాబు పల్లకీ మోయడం అని పవన్‌కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. పొత్తు ప్రకటన నేపథ్యంలో టీడీపీ, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆ రెండు పార్టీల నేతలున్నారు. అయితే టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో స్పష్టత లేకుండా, ఇప్పటి నుంచే ఆ పార్టీని భుజాన మోయడం శ్రేయస్కారం కాదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి జనసేన నేతలు తేల్చి చెప్పారు.
దీంతో పవన్‌కల్యాణ్ పొత్తుపై ప్రకటించినంత ఈజీగా టీడీపీతో కలిసి పని చేయడమని జనసేన పెద్దలకు జ్ఞానోదయం అవుతోంది. టీడీపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలని జనసేన నేతలకు అధిష్టానం పెద్దలు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, వేచి చూద్దామనే ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని తెలిసింది.
చంద్రబాబునాయుడంటే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు విపరీతమైన ఇష్టం ఉండొచ్చు. బాబును జైలుకు పంపితే, లోకేశ్ కంటే ఎక్కువ బాధపడింది పవన్‌కల్యాణే అనే ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బందీగా ఉన్న చంద్రబాబును చూడగానే పవన్‌కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. బాబును పరామర్శించి, ఓదార్చిన అనంతరం జైలు బయట పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు వుంటుందని ప్రకటించారు.
రాజకీయంగా ఎలా వుండాలనేది టీడీపీ, జనసేన నేతల ఇష్టం. దీన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే అధినాయకులకు ఇష్టాయిష్టాలున్నట్టే, ఆ పార్టీ కేడర్‌కు కూడా సొంత అభిప్రాయాలుంటాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జనసేనాని తొందరపడి పొత్తు ప్రకటన చేశారనే ఆవేదన జనసేన నేతల్లో వుంది. తమను రాజకీయంగా వాడుకోవడమే తప్ప, అటు వైపు నుంచి ఎలాంటి సహకారం వుండదని జనసేన నాయకులు, కార్యకర్తల ఆవేదన.
రెండు రోజుల క్రితం నాగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి ఇదే అనుమానం వ్యక్తమైంది. టీడీపీ నుంచి సహకారం వుండదని నాగబాబుకు తెగేసి చెప్పారు. టీడీపీని నమ్ముకుని ముందుకెళితే, చివరికి దెబ్బతింటామనే భయాన్ని నాగబాబు ఎదుట వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు మోజులో ఉన్న అన్నదమ్ములైన నాగబాబు, పవన్‌కల్యాణ్‌లకు సొంత పార్టీ నుంచి వ్యక్తమవుతున్న భయం వెనుక ఉద్దేశం అర్థం కావడం లేదు. పవన్‌కల్యాణ్‌పై ప్రేమతో చంద్రబాబు జనసేన బలోపేతానికి కృషి చేస్తారని నమ్ముతున్నారు.
కానీ సీట్ల పంపిణీ తేలాకే టీడీపీ పల్లకీ మోయాలా? వద్దా? అనేది తేల్చుకుంటామని ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు అంటున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో చంద్రబాబు ఇప్పట్లో తేల్చే పరిస్థితి వుండదు. ఇతర పార్టీలను ఎలా బలహీనపరచాలో చంద్రబాబుకు బాగా తెలుసు. తమకు గరిష్టంగా 25 సీట్ల కంటే ఇవ్వరని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఈ సీట్ల కోసమే అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం దేనికనే ప్రశ్న వారి మనసుల్ని తొలుస్తోంది. అందుకే టీడీపీ జెండా మోయడానికి జనసేన నేతలు తటపటాయిస్తున్నారు.