ఎమ్బీయస్‍: కాశీ విశ్వనాథ మందిరం

కాశీలోని విశ్వనాథ మందిరానికి చక్కగా తీర్చిదిద్దారని తెలిసి చాలా ఆనందం వేసింది. ఈ పని చేపట్టిన బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాశీ నుండి ఎంపీగా ఎన్నికై, యీ కార్యానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని…

కాశీలోని విశ్వనాథ మందిరానికి చక్కగా తీర్చిదిద్దారని తెలిసి చాలా ఆనందం వేసింది. ఈ పని చేపట్టిన బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాశీ నుండి ఎంపీగా ఎన్నికై, యీ కార్యానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని మోదీ అభినందనీయులు. ఎందుకంటే యిది బృహత్కార్యం. ఖాళీ ప్రదేశంలో ఏదైనా నిర్మాణం చేపట్టడం సులభం. కానీ కాశీ వంటి పురాతన నగరంలో ఏది ముట్టుకున్నా వివాదమౌతుంది. అంతెందుకు, బిజెపి కాకుండా వేరే ఏ పార్టీవాళ్లు యీ సత్కార్యానికి పూనుకున్నా, స్థానికులే కాదు, బిజెపి కార్యకర్తలే గగ్గోలు పెట్టేసేవారు, హైందవ సంస్కృతిని, భారతీయ వారసత్వాన్ని నాశనం చేసేశారంటూ. అందువలన బిజెపియే యీ పని చేయగలదు, చేసింది కూడా.

గంగాప్రక్షాళన గురించి రాజీవ్ గాంధీ హయాం నుంచీ వింటూనే విన్నాం. అది యిప్పటికీ పూర్తి కాలేదు. నది కలుషితం అవుతూనే వుంది. అక్కడి ప్రజల మనస్తత్వం మారేవరకు ఎప్పటికీ కాదు. పైగా కాశీలోని ఘట్టాలు శుభ్రం చేస్తే సరిపోదు. ఎగువనున్న ఫ్యాక్టరీలు, ఊళ్లు అన్నీ తమ మాలిన్యాలను గంగలో వదిలే అలవాటు మానుకునేదాకా గంగ బాగుపడదు. ప్రజలు తమంతట తాము యివి మానుకోరు. ప్రభుత్వాలే భారీ జరిమానాలు వేసి కట్టడి చేయాలి. ఆ ప్రభుత్వాలేవీ కఠినంగా వ్యవహరించవు, క్రమశిక్షణ పాటించమని చెప్పవు. అస్తవ్యస్తమైన పరిస్థితే రాజ్యమేలుతూంటుంది అక్కడ. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అదే తీరు. అందుచేత గంగ మీద ఆశ వదిలేశాను. విశ్వనాథ మందిరం కూడా బాగుపడుతుందని నేనెన్నడూ అనుకోలేదు. అందుకే ఆశ్చర్యానందాలతో యిది రాస్తున్నాను. ఈ సందర్భంలో గుళ్ల గురించి నా అనుభవాలు, భావాలు రాస్తాను. పూర్తిగా వ్యక్తిగత భావాలు కాబట్టి మీరు ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు కానీ వాదనలకు తావు లేదు.

నాకు గుళ్లు చూడడం యిష్టం. దేవుడు ఎక్కడైనా వున్నాడు, గుడికే వెళ్లి ఎందుకు చూడడం అని అడగవచ్చు. నేను దేవుడి కోసం వెళ్లను. నిజానికి గుడిలో వుండే రద్దీ వలన ఎవరికైనా సరే, దేవుడి మీద దృష్టి నిలపడం కష్టం కూడా. అయితే గుళ్లనేవి మన సాంస్కృతిక వారసత్వం. పాత రోజుల్లో అవి జనజీవన చైతన్యకేంద్రాలు. ఓ కవిత్వం రాసినా, కచ్చేరీ చేద్దామనుకున్నా, నాట్యం ప్రదర్శిద్దామనుకున్నా, ఓ ఆధ్యాత్మిక ప్రసంగం వినిపిద్దామన్నా గుడిలోనే చేసేవారు. చిత్రకళ లేదా శిల్పకళానైపుణ్యం చూపుకోవడానికి దాన్నే ఎంచుకునేవారు. అంతేకాదు, ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అందరూ అక్కడే చేరేవారు. వేదాధ్యయానికి, శాస్త్రాధ్యయానికి శృంగారబోధకు అన్నిటికీ పాఠశాల అదే. అన్నిరకాలుగా అది కమ్యూనిటీ హాలు. అందువలననే గుళ్లను ఎంతో చక్కగా కట్టేరు. ఈస్తటిక్‌గానే కాదు, టెక్నికల్‌గా కూడా! వాటిని పరికించి, పరిశీలించి చూడండి. అద్భుతం అనిపిస్తుంది.

వేలాది మంది ఒక చోట గుమిగూడినా వేదిక మీద ఉన్నవారిని చూసేందుకు అడ్డురాకుండా అందరికీ బాగా కనబడేట్లు స్తంభాలు అమర్చిన తీరును చూడండి. దూరంగా వున్నవారికి సైతం బాగా వినబడేట్లా ఎకూస్టిక్స్ పట్ల శ్రద్ధ తీసుకున్నారని గమనించండి. అంతమంది ఒక చోట కూర్చున్నపుడు యిబ్బంది లేకుండా గాలీ, వెలుతురూ వచ్చేట్లా చేసిన ఏర్పాటు చూడండి. దుర్గంధం రాకుండా అగరవత్తులు, నేతి దీపాలు, కర్పూరాలు వంటివి పెట్టిన తీరు గమనించండి. ఒక్కో ప్రాంతంలో దేవాలయనిర్మాణం ఒక్కోలా వుంటుంది. ఆ తేడాలు తెలుసుకోవడం, గమనించడం నాకు ఆసక్తి. మనలో దాదాపు అందరం తిరుపతి గుడికి వెళ్లి వుంటాం కానీ శిల్పాలు చూసి వుండం. ఎంతసేపూ దర్శనం అయిందా, లడ్డూ క్యూకి పరిగెట్టాలా, అక్కణ్నుంచి, కాటేజికి పరిగెట్టి ఖాళీ చేయాలా అనే హడావుడే తప్ప అసలు ధ్వజస్తంభాన్ని కూడా తలెత్తి చూడం. బలిపీఠం నిర్మాణం కూడా గమనించం. ఏదైనా కనబడగానే కళ్లు మూసుకుని మన కోరికల జాబితా విప్పుతాం.

ఆలయనిర్మాణాల్లో తేడాల గురించి, చర్చి నిర్మాణాల్లో వున్న తేడాల గురించి వ్యాసాలు రాసి మీతో పంచుకోవాలని, విషయం తెలిస్తే యికనుంచైనా మీరు వాటిని శ్రద్ధగా గమనిస్తారనీ నా ఆశ. రాద్దామనుకుని వాయిదా వేస్తున్న టాపిక్స్‌లో యిదొకటి. నాతో యిదో పెద్ద న్యూసెన్స్. రాస్తానో, రాసినా కొనసాగిస్తానో లేదో, అసలు రాస్తానో లేదో నాకే తెలియదు. దీని ప్రస్తావన చేశాను కాబట్టి మీ అంతట మీరే ఆయా పుస్తకాలు సంపాదించి చదివేసుకుంటే హమ్మయ్య అనుకుంటాను. నేను దేశంలో నలుమూలలా వున్న గుళ్లు చూశాను. వాటి నిర్వహణ గురించి నా ఫీలింగ్స్ తెలుపుతూ రేఖామాత్రంగా రాస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని గుళ్లు చిన్నప్పటినుంచి చూసినవాణ్నే కాబట్టి, మన ఆలయపద్ధతులకే నేను అలవాటు పడ్డాను. వేరే చోట వాటి కంటె భిన్నంగా కనబడితే నాకు అదోలా వుంటుంది.

నేను బ్యాంకులో చేరాక, ట్రైనింగ్‌కై1974లో గుజరాత్ పంపించారు. మా బ్యాంకు హెడాఫీసు భావనగర్‌లో వుండేది. వారాంతాల్లో చుట్టుపక్కల గుళ్లన్నీ చక్కబెట్టాను. సోమనాథ దేవాలయం పేరు చెప్పగానే ఒక పులకింత కలుగుతుంది. వెళ్లి చూస్తే పెద్దగా, నీట్‌గా వుంది కానీ తీర్థాలు, శఠగోపాలు లేకపోవడంతో దేవుడు నన్ను రిసీవ్ చేసుకోలేదనిపించింది. ద్వారకలో కృష్ణవిగ్రహం చూస్తే వింతగా తోచింది. దాని కంటె మన వేణుగోపాలుడి విగ్రహమే బాగుందనిపించింది. పైగా ద్వారక ఆలయంలో ఆ రంగురంగుల కర్టెన్లు, తోరణాలు అవీ కంటికి యింపుగా తోచలేదు. కృష్ణనిర్యాణం జరిగిన ప్రభాస్ పాటన్‌లో అయితే పూజారి భార్య కాబోలు, ఆవిడ కూర్చుంది. ఎడమ చేత్తో నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించింది. ఎడమ చేతి అలవాటున్నవారు గుజరాతీల్లో ఎక్కువ. ఆ చేత్తో ఆశీర్వాదం యివ్వడం వాళ్లకు తప్పు కాదేమో!

గిరినార్ కొండమీదున్న అంబాజీ దేవాలయం బాగానే వుంది కానీ అక్కణ్నుంచి మరో ఎత్తయిన కొండెక్కి వెళితే దత్తాత్రేయుడు ఒంటికాలిపై జపం చేసిన చోటుందన్నారు. కష్టపడి పైకి ఎక్కితే అక్కడ పూజారి ఓ కంబళి కప్పుకుని కుడిచేత్తో బీడీ కాలుస్తూ, ఎడం చేత్తో ఆశీర్వదించాడు. ప్రాణం ఉసూరుమంది. అహ్మదాబాద్‌లో కొత్తగా కట్టిన గుడి అంటే వెళ్లాను. అది తిరగేసిన పొట్లం ఆకారంలో కట్టారు. శంకువు అనవచ్చు కానీ, పొట్లం కడితే మడతలు ఎలా వస్తాయో అలా తెప్పించారు. ఆర్కిటెక్చర్ గొప్పదే కానీ వీళ్ల గుళ్లకు ఆగమశాస్త్రం వర్తించదా? అనిపించింది. దేవుడు, భక్తి, పూజావిధానం యివన్నీ ఓకేయే కానీ, మనకు చిన్నప్పటినుంచి అలవాటైన పద్ధతులు అక్కడ లేకపోతే యిరుకున పడతాం చూడండి, అలాటి ఫీలింగు కలిగింది.

1975లో తమిళనాడు టూరిజం వాళ్ల 8 రోజుల ట్రిప్పులో తమిళనాడు ప్లస్ కేరళలోని త్రివేండ్రమ్ చూశాను. తంజావూరు, చిదంబరం, శ్రీరంగం, తిరుచెందూరు, రామేశ్వరం, కన్యాకుమారి, శుచీంద్రం, మధురై, పళని, శ్రీవిల్లిపుత్తూరు.. ఇలా ఏ గుడి చూసినా అద్భుతం అనిపించింది. శిల్పకళ ఒక్కటే కాదు ఆలయం, దానిలో పూజాదికాలు నిర్వహించే తీరు అమోఘం. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి కోవెల అయితే పరమాద్భుతం. కేరళ గుళ్ల నిర్మాణం వేరేలా వుంటుంది. తిరుచెందూరు, కన్యాకుమారి, శుచీంద్రం, తిరువనంతపురంలలో చొక్కా విప్పమనడం ఒక్కటే చికాకైన వ్యవహారం. మన చర్మానికి ఎవడు తగులుతాడా అని చూసుకోవడంలో దేవుడి విగ్రహాన్ని సరిగ్గా చూడలేం. అప్పణ్నుంచి నాలుగేళ్ల పాటు దక్షిణాదిలో చాలా గుళ్లు చూశాను. అవన్నీ చెప్పటం లేదు. 1979లో మా కజిన్, తన భర్తతో కలిసి తూర్పు, ఉత్తర రాష్ట్రాల టూరు పెట్టుకున్నాను. అక్కడి గుళ్లలో అనుభవాలు చెప్తాను.

హైదరాబాదు నుంచి పూరి స్టేషన్‌లో దిగగానే పండాలు (పూజారులు) ఎదురయ్యారు. ‘యా వూరు? యా వూరు?’ అంటూ! వాళ్లు వచ్చేపోయే యాత్రికుల రికార్డు వుంచుతారట. మన పేరు చెప్తే ‘మీ కుటుంబసభ్యులు ఫలానా సంవత్సరంలో వచ్చి మా దగ్గర పూజ చేయించుకున్నారు’ అని వివరాలు చెప్తారట. పూజతో బాటు భోజనం, వసతి అన్నీ చూస్తారట. ఇంత విగరస్ మార్కెటింగ్, అదీ పురోహితుల్లో, ఎప్పుడూ చూడకపోవడం వలన ఆశ్చర్యపడ్డాను. వాళ్లను విదిలించుకుని బయటపడి, వేరే చోట ఎక్కడో బస చేసి, మర్నాడు గుడికి వెళ్లాం. గుడి పెద్దది. అంతా బాగుంది కానీ అక్కడ అన్నప్రసాదాల కారణంగా గుడంతా కంగాళీగా వుంది. ఆ ప్రసాదం కాళ్ల కింద పడితే పాపం చుట్టుకుంటుందన్న భయంతో తిరుగుతూంటే మధ్యలో యీ పురోహితులొకళ్లు అర్చన చేయించుకో అంటూ ప్రాణం తినేశారు. భువనేశ్వర్‌లో గుళ్లు బాగున్నాయి. అక్కడ యీ న్యూసెన్స్ ఉన్నట్టు గుర్తు లేదు.

ఇక కలకత్తాలో బేలూరు మఠం వద్ద కాళి గుడి బాగుంటుంది కానీ అసలైన కాళీఘాట్ కాళీమాత గుడి దడ పుట్టిస్తుంది. విపరీతమైన రద్దీలో ముందుకు సాగడం ఎలారా అనుకుంటూ వుంటే మధ్యలో ఎవరో పూజారి మన నుదుటి మీద కుంకుమ బలవంతంగా పులిమి ‘బొట్టు పెట్టాను, డబ్బియ్యి’ అని పీడించేస్తాడు. ఆ పులమడం కూడా సుతారంగా వుండదు, బలంగా మోదినట్లే వుంటుంది. ఇక అమ్మవారి వద్ద కూడా పూజారులు తగులుకుని డబ్బియ్యి, పక్కనుంచి దర్శనం చేయిస్తా అంటూ వేపుకుతింటారు. ఉగ్రరూపి ఐన కాళీమాత వీళ్లనేం చేయదా? అనిపిస్తుంది. 1982 నుంచి కలకత్తాలో మూడున్నరేళ్లున్నాను, మా ఆఫీసుకి స్కూటరు మీద ఆ పక్కనుంచే రోజూ వెళ్లేవాణ్ని, కానీ ఆ గుడికి ఐదారుసార్ల కంటె ఎక్కువ వెళ్లి వుండను. అంతలా భయపెట్టారు ఆ పూజారులు.

1979 టూరులోనే బిహారులోని గయ వెళ్లాను. విష్ణుపాదాల దగ్గరకు ఉదయం వెళితే పిండాలు పెట్టమని పండాలు చంపుతారని భయపడి సాయంత్రం వెళితే అప్పుడూ చంపారు. ప్రాణం విసిగిపోయింది. దగ్గర్లో వున్న బుద్ధగయ దగ్గరకు వెళితే అక్కడ యిలాటి గోల లేదు. అక్కణ్నుంచి ప్రయాగ వెళ్లాం. నదీతీరంలో గుడారాలే గుడారాలు. గుడారానికో జండా. లోపల గూండాల లాటి పండాలు. వీళ్లది మార్కెటింగు అనడానికి లేదు. మీదపడి లాక్కునిపోవడమే! పడవలో త్రివేణీ సంగమానికి తీసుకెళ్లి అక్కడ దానాలు చేయిస్తామని ఆఫర్లు. వీళ్లందరిని విదిలించుకుని విడిగా నావల వాళ్లతో డైరక్టుగా బేరమాడుకున్నాం. సంగమానికి వెళ్లి చూసి వచ్చేయడమంతే అని స్పష్టంగా చెప్పాం అక్కడి దాకా వెళ్లినదాకా వుండి, వాడు రేటు పెంచేశాడు. పైగా ఏదైనా దానమియ్యి, యిక్కడిస్తే లక్ష రెట్లు పుణ్యం ఎక్కువ వస్తుందంటాడు. వీడు చాలనట్లు కొందరు పండాలు నావలు వేసుకుని వచ్చి దానాలు, దానాలు అని చికాకు పెట్టేశారు. వాళ్లతో పోట్లాడడంతో సంగమం అందాన్ని చూసే మూడ్ పోయింది.

అక్కణ్నుంచి కాశీ వెళ్లాం. అప్పట్లో రాష్ట్ర టూరిజం కార్పోరేషన్లు యింకా పుట్టలేదు. ఐటిడిసి వాళ్ల సిటీటూరు బుక్ చేసుకున్నాం. మేము ముగ్గురం తప్ప తక్కినందరూ విదేశీయులే. గంగానదీ విహారం అంటూ తిప్పారు. అది చూడగానే గంగలో స్నానం చేసే ఐడియా మానుకున్నాం. (తర్వాతేడాది హృషీకేశ్ వెళ్లినపుడు అక్కడ క్లీన్‌గా కనబడింది కాబట్టి గంగలో స్నానం చేశాను). ఘాట్లన్నీ ఘోరంగా వున్నాయి. ఇక విశ్వేశ్వరుడి గుడి గురించి చెప్పాలంటే అది ఒక భయం పుట్టించే జ్ఞాపకమే. విదేశీయులకు గుడిలో ప్రవేశం లేదు కాబట్టి గైడ్ మమ్మల్ని గుడి ఎదురుగా దుమ్మూ, ధూళీ కొట్టుకుని పోయి వున్న ఒక పాత భవంతిలోకి తీసుకుని వెళ్లి అక్కణ్నుంచి గోపురం చూపించాడు. గుడికి వెళ్లే దారంతా సన్నని సందులు, రోడ్ల మీదే నానా రకాలైన మురికి. మేం వెళ్లిన భవంతి మెట్ల మీద కూడా చెత్త వుంది. విదేశీ యాత్రికులకు చూపిస్తామనైనా టూరిజం వాళ్లు ఆ భవంతిని మేన్‌టేన్ చేయలేదు.

తర్వాతి రోజు మేం విడిగా గుడికి వెళ్లాం. అన్ని రకాల జంతువులు యథేచ్ఛగా వస్తూ పోతున్నాయి. అంతా గందరగోళం. క్రమశిక్షణే కానరాదు. ఎవరైనా ఏదైనా చేయవచ్చు అన్నట్టుంది. ప్రాణం ఉసూరుమంది. మాకే కాదు, గాంధీగారికీ అలాగే అనిపించిందట. కిషన్ రెడ్డి ఒక వ్యాసంలో రాశారు – మహాత్మా గాంధీ తన ఆత్మకథలో 1916లో కాశీ గుడిని చూసి ‘ఇక్కడ ప్రశాంతత లేదు. ఈగల శబ్దాలు, వ్యాపారుల అరుపుల మధ్య భక్తులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు.’ అని.

అనాదిగా కాశీ పండితులకు నిలయం అనే మాట నిజమే అయినా అక్కడి పండాలకు అన్ని రకాల వ్యసనాలూ ఉన్నాయని, రకరకాల వ్యాపారాలు చేస్తారని ఎప్పణ్నుంచో కథలున్నాయి. ఒక అమ్మాయిని చెరబట్టినట్లు సురవరం ప్రతాపరెడ్డి గారి కథ ఒకటుంది. డబ్బున్న భక్తులను హత్య చేసి, శవాన్ని గంగలోకి తోసేస్తారని కూడా చెప్పుకునేవారు. వీటిలో నిజానిజాలెలా వున్నా, వాళ్లని చూస్తే, అవన్నీ నిజమనిపిస్తుంది. అందుకే యిటీవలి కాలంలో మనవాళ్లు కాశీకి యిబ్బడిముబ్బడిగా వెళ్లడం ప్రారంభించాక భరోసా కోసం అక్కడే నివాసముంటున్న తెలుగు పురోహితులకు ముందుగా చెప్పి వెళుతున్నారు. కాశీ చూశాక విరక్తి కలిగింది, జీవితం మీద కాదు, ఉత్తరాది గుళ్ల మీద! ‘గాడ్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ అండ్ గాడ్‌మెన్ ఆర్ ఫ్రమ్ సౌత్’ అనే మాట వినేవుంటారు. మన దేవుళ్లందరూ ఉత్తరాదివారే! ముఖ్యమైన మన పుణ్యక్షేత్రాలు, హిమాలయాలు, గంగ అన్నీ అక్కడే వున్నాయి. అందువలన గత్యంతరం లేక 1984లో మళ్లీ వెళ్లాను.

ఈసారి భార్య, మా అమ్మ, మా అత్తమామలతో పూరి, కలకత్తా, గయ, ప్రయోగ, కాశీ రెండోసారి వెళ్లాను. మధ్యలో ఐదేళ్ల విరామం ఉన్నా పరిస్థితిలో మార్పు లేదు. రెండోసారి వెళ్లినపుడు విశ్వనాథుడి గుళ్లో కాకపోయినా వేరే గుళ్లో అర్చన చేయిస్తానని ఒక పురోహితుడు ఆఫర్ చేస్తే వెళ్లాం. రెండతస్తుల మేడ. కింద చావిడిలో శివలింగం పెట్టి పూజ చేసేస్తున్నాడు. పై అంతస్తులో అనేక వాటాల వాళ్లు కాపురం వుంటున్నారు. గుడి అనేది ఊరికి దూరంగా వుండాలనే కాన్సెప్టుతో గుడి నీడ యింటి మీద పడకూడదంటారు. కానీ వీళ్లు దేవుడి నెత్తిమీదే కాపురం పెట్టారు. ఇప్పుడు వారణాశి రోడ్లను విస్తరించినపుడు బయటపడింది, 40 గుళ్లను ఆక్రమించేశారని, చుట్టూ యిళ్లు కట్టేసి గుళ్లు కనబడకుండా చేసేశారని. ఇలా కబ్జా చేసినవాళ్లు ముస్లిములు, మరోళ్లూ కాదు, పక్కా హిందువులే! బొత్తిగా భయమూ, భక్తి లేదన్నమాట!

వాస్తవానికి యుపి, బిహార్‌లలో మార్పు తేవడం చాలా కష్టం. ప్రజలు మోటుగా, మొరటుగా వుంటారు. దక్షిణాదిన గుళ్లు బాగుంటాయంటే అక్కడి ప్రజలు క్రమశిక్షణతో వుంటారు కాబట్టి అలా మేన్‌టేన్ చేయగలుగుతున్నారు. యుపి, బిహార్‌లలో రైలు ప్రయాణాలు కూడా చాలా కష్టం. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎంతో డబ్బు వెచ్చించి బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్లు కట్టినా, వాటిని తగలేసి దరిద్రంగా చేస్తారు. మాధవరావు సింధియా రైల్వే మంత్రిగా వుండగా యీ విషయం ఒక యింటర్వ్యూలో చెప్పేశాడు కూడా! మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎంతో ఆర్జించి పెడుతుంది. కానీ మనకు వసతులు కల్పించరు. ఇదంతా పట్టుకెళ్లి అక్కడ ఖర్చు పెడతారు. ఎంత పెట్టినా శుచీ, శుభ్రతా లేకపోతే ఏం లాభం? అవి లేకుండా పవిత్రత వస్తుందా? ఇప్పుడు పరిస్థితేమైనా బాగుపడిందేమో నాకు తెలియదు.

1984 తర్వాత యుపి, బిహార్ గుళ్లకు మళ్లీ వెళ్లలేదు. పిల్లల్నీ తీసుకెళ్లలేదు, ఉన్న భక్తి కూడా ఊడ్చిపెట్టుకు పోతుందేమోనని! ఇటీవలి కాలంలో ప్రవచనకారుల ధర్మమాని తెలుగువాళ్లు కాశీకి జోరుగా వెళుతున్నారు. రోజుల తరబడి అక్కడుంటున్నారు. శుభ్రంగా వుంటోందా? అని అడిగితే ‘అక్కడికి వెళ్లినపుడు అవన్నీ పట్టించుకోకూడదండి’ అని సంభాషణ తుంచేస్తున్నారు. అందువలన వాస్తవ పరిస్థితి నాకు తెలియదు. ఈ సొదంతా ఎందుకు చెప్పానంటే, విశ్వనాథుని గుడిని బాగుచేయడాన్ని ‘క్లీనింగ్ ఓజీన్ స్టేబుల్స్’తో పోల్చవచ్చని మీకు అర్థం కావడానికి! ఒక గ్రీకు రాజు 3 వేల పశువులున్న తన కొట్టాన్ని 30 ఏళ్ల పాటు శుభ్రం చేయలేదు. దాన్ని ఒక్క రోజులో శుభ్రం చేసే పని హెర్క్యులస్‌పై పడితే రెండు నదులను అటు మళ్లించి శుభ్రం చేసేశాడు. మోదీ, యోగి చేసినది హెర్క్యులియన్ టాస్క్ అనే చెప్పాలి.  

1780లలో రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టిన గుడి అది. కాలక్రమేణా దాన్ని చెడగొట్టారు తప్ప బాగు చేయలేదు. ఇన్నాళ్లకు ఆ పని జరిగింది. అయోధ్యలో రామమందిరంలా యితరుల ప్రార్థనామందిరాన్ని పడగొట్టి చేసిన పని కాదు, తమ ఆలయాన్ని తామే చక్కదిద్దుకున్న తీరిది! యుపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారనండి, మరోటనండి రెండేళ్లలో యింత పెద్ద పనిని పూర్తి చేశారు. రూ. 800 కోట్ల అంచనాతో 2018లో రూపకల్పన చేసి, 2019లో ప్రారంభించి, మొదటి దశను రూ.339 కోట్లతో పూర్తి చేశారు. 3000 చ.అ.లున్న ఆలయప్రాంగణాన్ని ఐదు లక్షల చ.అ. లకు విస్తరించారు. ఇదివరకు ఘాట్‌ల నుంచి గుడి వరకు రావాలంటే అతి సన్నటి సందుల్లోంచి రావాల్సి వచ్చేది. ఇప్పుడు వాటి స్థానంలో 20 మీటర్ల (దాదాపు 65 అడుగుల) వెడల్పుతో 320 మీటర్ల పొడవున్న కారిడార్ వేశారు. ఆలయ పరిసరాలూ అవీ కలిపి 3500 చ.మీ.లు ఉంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా 40 పురాతన ఆలయాలు బయటపడ్డాయి. పైన చెప్పినట్లు వాటిని పురజనులు కమ్మేశారు. గుడి విస్తరణకై 300 స్థలాలను ఖాళీ చేయించి, 1400 మంది నివాసితులకు, దుకాణదారులకు వేరే చోట పునరావాసం కల్పించారు. ఏడు ద్వారాలు, 23 భవనాలు నిర్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అప్పగించిన ఎచ్‌సిపి డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్ర. లి.కే యీ ప్రాజెక్టూ అప్పగించారు. ఇది అహ్మదాబాదులో వుంది. దీని ఎండీ, స్వయంగా ఆర్కిటెక్ట్ అయిన బిమల్ పటేల్ ఓ యింటర్వ్యూలో ‘గుడి ప్రాంతంలో డ్రైనేజి సౌకర్యం కూడా ఉండేది కాదు. మేం యివన్నీ యిప్పుడు కల్పించాం. ఇప్పటిదాకా అయిన ఖర్చులో నిర్మాణానికి అయినది సగమే. తక్కిన సగం చుట్టూ వున్న 300 ఆస్తులు కొనడానికి, వాళ్ల పునరావాసానికి అయింది. 40 గుళ్లు బయటపడ్డాయి కదా, వాటిలో చాలా గుళ్ల మీద జనాలు యిళ్లు కట్టేసుకుని గుళ్లను పునాదులుగా వాడుకున్నారు. ఆ గుళ్లలో కొన్నిటిని పునరుద్ధరిస్తున్నాం. కొన్నిటిలో విగ్రహాలను వేరే గుళ్లకు తరలిస్తున్నాం.’ అని చెప్పారు.  

ఏది ఏమైనా సంఘర్షణ లేకుండా యీ ఆలయవిస్తరణ జరిగినందుకు సంతోషం. ఈ సౌకర్యాల వలన ఇప్పుడు రోజుకి 50-75 వేల మంది భక్తులు రావచ్చట. మతపరమైన టూరిజం పెరిగితే అక్కడ ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. వ్యాపారస్తులకు, పురోహితులకు, హోటళ్లు, లాడ్జ్‌లు నడిపేవారికి, ఊళ్లో రవాణా సౌకర్యం కల్పించేవారికీ అందరికీ మేలు కలుగుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే గుడిని పరిశుభ్రంగా వుంచడం నేర్చుకోవాలి. పూజారులు భక్తులను వేధించకూడదు. భక్తులు క్రమశిక్షణతో మెలగాలి. మన హైదరాబాదులో రోడ్ల మధ్య గుళ్లు, దర్గాలు వెలిసినట్లుగా యిప్పుడు కాశీలో వేసిన కొత్త రోడ్ల మీద కూడా గుళ్లూ అవీ వెలిశాయంటే చేసినదంతా వ్యర్థమౌతుంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా రోడ్ల మీది గుళ్లను నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు. యోగి లేదా తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కూడా అదే చేస్తారని ఆశిద్దాం. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

[email protected]